*అద్వైత వేదాంత పరిచయం*
04. ఆశ్రమ వ్యవస్థ
మానవ లక్ష్యాలైన పురుషార్థాలని సాధించటానికి శాస్త్రం వర్ణాశ్రమ ధర్మాలని నియమించింది. వర్ణాశ్రమ ధర్మాలంటే వర్ణ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ. నాలుగు వర్ణాల గురించి ఇంతకు ముందు వివరంగా చూసాము. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక సాధకుడు పాటించాల్సిన నాలుగు ఆశ్రమ ధర్మాల గురించి చూద్దాము.
ఆశ్రమ అన్న పదాన్ని సాధారణంగా జీవితంలో ఒక దశ కింద చెప్తారు. ఒక వైదిక జీవితంలో నాలుగు దశలు ఉంటాయి. వాటిని చత్వార: ఆశ్రమ: అంటారు. అవి `
1, బ్రహ్మచారి ఆశ్రమం 2, గృహస్థు ఆశ్రమం 3, వానప్రస్థ ఆశ్రమం
4, సన్యాస ఆశ్రమం
ఆశ్రమం అంటే ఏమిటి? శ్రమ: అంటే కావాలని, మనస్ఫూర్తిగా, ఒక నిర్దిష్ట దిశ వైపుపెట్టే శ్రమ. ఇక్కడ శ్రమ ఆధ్యాత్మిక సాధన. అందువల్ల శ్రమ: అంటే ఆధ్యాత్మిక సాధన లేదా సాధన అనుష్టానం. ఆశ్రమ: అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సాధనల కోసం శ్రమించే దశ.
జీవితం మొత్తం నాలుగు ఆశ్రమాలుగా విభజించబడిరదీ అంటే, శాస్త్రం ప్రకారం జీవితం మొత్తం ఆధ్యాత్మిక సాధనే. ఆశ్రమ అంటే ఎప్పుడో జీవిత చరమాంకంలో, ఉద్యోగ విరమణ చేసాక చేసేది కాదు. జీవితమంతా సాగుతూనే ఉంటుంది. కాకపోతే, ఒక్కో దశలో సాధనదిశ మారుతూ
ఉంటుంది. అందువల్లే శాస్త్రం ప్రకారం మన ప్రాధమిక లక్ష్యం, అంతిమ లక్ష్యం రెండూ ఒకటే. అది ఆధ్యాత్మిక సాధన.
ధర్మార్థ కామాలను మానవ లక్ష్యాలుగా ప్రారంభంలో అంగీకరించినా, శాస్త్రం వాటిని అంతిమ లక్ష్యాలుగా అంగీకరించదు. శాస్త్రం వాటి గురించి మాట్లాడుతుంది కాని, అది పరిపక్వత లేని వాళ్ళకి మాత్రమే. ఈ సాధన అంతిమ లక్ష్యం మోక్షం. మనలో పరిపక్వత వచ్చేదాకా, శాస్త్రం యిది ఆధ్యాత్మిక సాధన అన్న విషయం బట్టబయలు చేయకుండానే, ప్రయత్నం చేయిస్తుంది. చిన్న పిల్లలు మందు వేసుకోవటానికి వాళ్ళకి పంచదార పూత పూసిన మందు యిచ్చినట్టుగా, శాస్త్రం కూడా పైకి ధర్మ`అర్థ`కామ పురుషార్థాలకి శ్రమించేటట్టు చేసినా, రహస్యంగా మన మోక్షం కోసం పాటుపడుతుంది. ఆధ్యాత్మిక లక్ష్యానికి నాలుగు దశల్లోనూ ఆధ్యాత్మిక సాధనని చొప్పించింది. ఆధ్యాత్మిక సాధన అంటే అంతర్గత స్వేచ్ఛ కోసం పాటుపడటం. దీన్నే మోక్షంకోసం సాధన అంటారు.
ఒక సీతాకోక చిలుక నాలుగు దశలని పోలి ఉంటాయి మన జీవితంలో దశలు కూడా. గుడ్డు, గొంగళిపురుగు, ప్యూపా దశల నుంచి సీతాకోక చిలుక చివరికి బయటకు వస్తుంది, చాలా అందంగా, ఆకర్షణీయంగా.
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి