సుబ్బమ్మ దీక్ష..
"నీకెందుకు ఈ వయసులో స్వామి దీక్ష?..అంతగా స్వామి మీద భక్తి వుంటే..ఆ మంటపం లో ఒక పక్కన కూర్చొని స్వామిని తలుచుకుంటూ ఉండు..మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ప్రసాదం మేమే పిలిచి నీకు పెడతాము.." అని మా సిబ్బంది ఆమెతో చెపుతున్నారు..ఆమె పేరు సుబ్బమ్మ..సుమారు ఎనభై ఏళ్ల వయసు ఉంటుంది.."మీరు ఊరుకోండి రా..నేను స్వామి మాల వేసుకుంటాను..ఈ గుడిలోనే ఒక మూల ఉంటాను..ఆ దత్తయ్య చల్లంగా చూస్తే..వచ్చే ఏడు కూడా వేసుకుంటాను.." అని చెపుతోంది..ఆమెను నా దగ్గరకు తీసుకొచ్చారు.."అయ్యా..నేను స్వామి మాల వేసుకుంటానంటే..మీ వాళ్ళు వద్దంటున్నారు.." అని ఫిర్యాదు చేసినట్టు చెప్పింది..నేను నవ్వి.."అదేం కాదమ్మా..ఇంత పెద్దదానివి కదా..ఈ దీక్ష తీసుకొని..రెండుపూటలా స్నానం చేస్తూ..దీక్ష నియమాలు పాటిస్తూ ఇబ్బంది పడతావని మా వాళ్ళ బాధ..నీమీద వాళ్లకు ప్రేమ ఉండబట్టే..నిన్ను ఈ నలభైరోజులూ ఇక్కడే వుండమంటున్నారు..నా మాట విని..దీక్ష తీసుకోవద్దు..స్వాములు అందరితో పాటు నువ్వుకూడా ఇక్కడే ఉండు..ఆరాధన రోజు స్వాములందరూ అభిషేకం చేసిన తరువాత నీ చేత కూడా స్వామివారి విగ్రహానికి అభిషేకం చేయిస్తాము.." అని చెప్పాను.."సరే అయ్యా..నువ్వు చెప్పావు కాబట్టి..అలానే చేస్తాను.." అన్నది..
సుబ్బమ్మ సుమారు ఇరవై ఏళ్ల నుంచీ స్వామివారి మందిరానికి వస్తున్నది..స్వామివారంటే ఎనలేని భక్తి..ఆమె సంతానం అంతా బాగానే స్థిరపడ్డారు..వాళ్లకూ మొగిలిచెర్ల అవధూత దత్తాత్రేయ స్వామివారంటే భక్తి ప్రపత్తులు ఉన్నాయి..అందుకే సుబ్బమ్మ గారు ఎప్పుడు మొగిలిచెర్ల బయలుదేరినా..వాళ్ళు వారించరు..ఒక్కొక్కసారి సుబ్బమ్మ స్వామివారి మందిరం లో పది పదిహేను రోజుల పాటు ఉండేది..ఆ సమయం లో ఆమె కుమారుడు మా సిబ్బందికి ఫోన్ చేసి..సుబ్బమ్మ గారి యోగక్షేమాలు విచారించేవాడు.."అయ్యా..మా అమ్మవల్ల అక్కడ మందిరంలో మీకుగానీ..ఇతర భక్తులకు గానీ..ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు తెలియచేయండి..నేను వచ్చి అమ్మను మా యింటికి తీసుకువెళతాను.." అని చెప్పేవాడు..నిజానికి ఆమె వల్ల మేము ఎన్నడూ ఏ ఇబ్బందీ ఎదుర్కోలేదు..
ఆ సంవత్సరం దత్తదీక్ష ..ఆ తరువాత స్వామివారి ఆరాధనా మహోత్సవం అన్నీ సక్రమంగా జరిగిపోయాయి..సుబ్బమ్మ కూడా స్వామివారి ఉత్సవమూర్తి కి అభిషేకం చేసింది..మరో రెండురోజుల తరువాత సుబ్బమ్మ గారి కుమారుడు స్వామివారి మందిరానికి వచ్చాడు.."మీతో మాట్లాడాలని అమ్మ నన్ను పిలిపించింది.." అన్నాడు..సుబ్బమ్మ వైపు చూసి "అమ్మా..ఏదన్నా ఉంటే నాకే చెప్పొచ్చు కదా..ఇంతకూ ఏమిటి విషయం..?" అని అడిగాను.."ఏమీ లేదయ్యా..నిన్న రాత్రి స్వామివారు కలలో కనబడి.."నీకు ఎక్కువ సమయం లేదు..ఒక గది కట్టించి..ఆశ్రమానికి ఇచ్చెయ్యి.." అని చెప్పాడు..స్వామి చెప్పిన తరువాత తప్పదు కదా..ఆ స్వామినే నమ్ముకున్న దానిని..అందుకే ఇక్కడొక చిన్న గది కట్టించాలని అనుకుంటున్నాను..ఎవరన్నా వస్తే..ఉండటానికి అనువుగా వుంటుంది కదా అని ఆలోచన వచ్చింది..మావాడికి కబురు పెట్టాను..పొద్దున బస్సుకు వాడు రాగానే విషయం చెప్పాను..అలానే చేద్దాము అన్నాడు..నీతో ఆ మాట చెప్పించడానికి వాడిని ఇక్కడకు పిలిపించాను.." అన్నది.."అమ్మా..స్వామివారు నీకు చెప్పారు అని అంటున్నావు..ఇక దానికి తిరుగులేదు..మనం పాటించాలి..స్థలం చూపిస్తాను..మంచిరోజు చూసుకొని మొదలుపెట్టండి.." అన్నాను..
స్థలం చూపించాము..మరో రెండు నెలల కల్లా గది కట్టడం పూర్తి అయింది..సుబ్బమ్మ..ఆమె కుమారుడు, కోడలు వచ్చి పూజ చేసి..ఆ గదిని మాకు అప్పచెప్పారు..ఆరోజుల్లో (సుమారు ఇరవై ఏళ్ల క్రితం..) ఎవరైనా ముఖ్యులు వస్తే ఉండటానికి ఆ గదిని కేటాయించేవాళ్ళము..సుబ్బమ్మ మాత్రం..ఎప్పటి లాగానే స్వామివారి మంటపం లోనే ఉండేది..మరో మూడు నెలల తరువాత..సుబ్బమ్మ స్వామివారి మందిరానికి వచ్చింది..ఆమె కాలు మీద పెద్ద వ్రణం లేచింది..బాగా నొప్పి చేసింది..కుమారుడు డాక్టర్లకు చూపించాడు..తగ్గలేదు..ఆ బాధ లోనే కుమారుడి సహాయంతో స్వామివారి వద్దకు వచ్చింది..స్వామివారి సమాధి దర్శించుకొని..తిరిగి వెళుతూ.."స్వామివారు కలలో ఆనాడే చెప్పారు..నీకు సమయం లేదు అని..రోజులు దగ్గరపడ్డాయి..మళ్లీ వస్తానో..లేదో.." అన్నది...మరో పదిహేను రోజుల కల్లా సుబ్బమ్మ మరణించిందని ఆమె కుమారుడు తెలిపాడు..చివరి శ్వాస వరకూ స్వామివారినే తలచుకుంటూ కన్నుమూసింది సుబ్బమ్మ..సుబ్బమ్మ నిర్మించిన ఆ గదిని ప్రస్తుతం ఒక అర్చక స్వామికి కేటాయించాము..
ప్రతి సంవత్సరం దత్తదీక్ష ముందు సుబ్బమ్మ మాకు గుర్తు వస్తూ వుంటుంది..ఎందుకంటే ఆమె సాధారణంగా ఉన్నాకూడా..నిరంతరము స్వామివారి నామాన్ని తలచుకునే దీక్ష లోనే ఉండేది...అదీకాక..ఆమె స్వామివారికి ఆప్తురాలు..అందువల్లే ఆమె మరణాన్ని ఆమెకు ముందుగానే తెలియచేశారు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి