15, అక్టోబర్ 2020, గురువారం

శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము-31

 **దశిక రాము**


🕉️🥀 #శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము-31🥀🕉️


           ✳️శ్లోకం 25✳️


ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః|

అహస్సంవర్తకో వహ్ని రనిలోధరణీధరః


230. ఆవర్తనః --- సంసార చక్రమును పరిభ్రమింపజేయువాడు.

231. నివృత్తాత్మా --- (231, 454, 604, 780 నామములు) అన్నింటికంటె మహోన్నతమగు పరమపద తత్వమూర్తి; సంసార చక్రమును త్రిప్పువాడైనను కోర్కెలకు అతీతుడైనవాడు, మాయాతీతుడు; నివృత్తి ధర్మమును పాటించువారికి ఆత్మస్వరూపుడు; సంసార బంధములకు అతీతుడు; నిత్యవిభూతి యనెడు స్వరూపము గలవాడు.

232. సంవృతః --- కప్పబడియుండువాడు (తెలియజాలనివాడు) ; తమోగుణముచే మూఢులగువారికి కన్పించనివాడు; అజ్ఞానులైన మానవుల దృష్టికి మృగ్యుడై యున్నవాడు.

233. సంప్రమర్దనః --- చీకటిని, అజ్ఞానమును, మాయను పారద్రోలువాడు; (రుద్రుడు, యముడు వంటి రూపములలో) దండించువాడు; దుష్టులను మర్దించువాడు (హింసించు వాడు).

234. అహఃసంవర్తకః --- సూర్యుని రూపముననుండి దినములను (కాల చక్రమును) చక్కగా ప్రవర్తింపజేయువాడు.

235. వహ్నిః --- సమస్తమును వహించువాడు (భరించువాడు) ; దేవతలకు హవిస్సునందించు అగ్నిహోత్రుడు.

236. అనిలః --- (236, 818 నామములు) వాయువు; ప్రాణమునకు ఆధారమైన ఊపిరి; ప్రేరణ లేకుండానే (వేరెవరు చెప్పకుండానే) భక్తుల కోర్కెలు తీర్చువాడు; ఆది లేనివాడు (తానే స్వయముగా ఆది.) ; సంగమము (బంధము) లేకుండా, మంచి చెడులకు అతీతమైనవాడు; కరిగిపోనివాడు; సర్వజ్ఞుడు; భక్తులకు సులభముగా అందువాడు; స్థిరమైన నివాసము (నిలయము) లేనివాడు; ఇల (భూమి) ఆధారము అవుసరము లేనివాడు; అన్నిచోట్ల ఉండువాడు (ఎక్కడో దాగని వాడు) ; సదా జాగరూకుడైనవాడు.

237. ధరణీధరః --- భూమిని ధరించువాడు (భరించువాడు, పోషించువాడు).


25.ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః


అహః సంవర్తకో వహ్ని రనిలో ధరణీ ధరః !!25!!


52. మాయనందె జగతి మరి మరి దిప్పునూ


తాక బోడు మాయ తాను, చూడ


మాయ కింద నుండి మరి గోచరింపడూ


వందనాలు హరికి వంద వేలు !!


{ అర్థాలు : ఆవర్తన ... సంసార చక్రం తిప్పేవాడు, నివృత్తాత్మా ... ప్రపంచంతో సంబంధం లేనివాడు, సంవృత ... మాయలో కప్పబడిన వాడు.


భావము : సృష్టినంతటినీ మాయలో ముంచి జననం, వృద్ధి, వార్థక్యం, వ్యాధి, మరణం ... తిరిగి జననం ప్రసాదిస్తూ సంసార చక్రం(వలయంలో) తిప్పేవాడు, మాయతోనే కప్పబడి ఉండి, తాను ఏ మాయకూ అందకుండా జగతికి అంత తేలికగా కన్పట్టని ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}


53. దౌష్ట్యములను తానె దండించు, వెలుగుతో


దినము నడుపుచుండు, దివ్య వహ్ని,


ప్రాణ వాయువతడె, ప్రాణేశుడవనికీ


వందనాలు హరికి వంద వేలు !!


{ అర్థాలు : సంప్రదన ...సంహారకుడు, అహ సంవర్తక ... సూర్యుని మించిన కాంతితో రోజులను (కాలాన్ని) దేదీప్యం చేయువాడు, వహ్ని ... హోమకుండపు అగ్ని, అనిల ... వాయువు, (ప్రాణం కూడా), ధరణీ ధర .. భూమిని ధ(భ)రించువాడు.


భావము : జీవులలోని రాక్షసత్వాన్ని అనగా దుష్టత్వాన్ని పరిహరించి (మర్దించడం అంటే చంపడమే కదా) దారిన పెట్టువాడు, సూర్యుని మించిన కాంతితో కాలాన్ని (జగతిని కూడా అనుకోవచ్చు) నడిపించువాడు, యజ్ఞ యాగాల సందర్భాన హోమ కుండాలలో వ్రేల్చే పవిత్రమైన అగ్ని వంటివాడు, జీవులకు ప్రాణవాయువు, భూమిని భరిస్తూ, అవసర సమయాలలో ధరించడం కాపాడుతున్న వాడు(భర్త అంటే ప్రాణేశుడు అనగా సర్వకాల సర్వావస్థలందు భారం భరిస్తూ కాచేవాడే కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}


🙏ఓం నమో నారాయణాయ.🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu

కామెంట్‌లు లేవు: