15, అక్టోబర్ 2020, గురువారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 చతుర్థ స్కంధం -5


శివుండనుగ్రహించుట 


ఇదంతా ముందే మనస్సులో తెలుసుకొని ఉండడం చేత విశ్వస్వరూపుడు, కమలాక్షుడు అయిన నారాయణుడు, బ్రహ్మదేవుడు దక్షుని యజ్ఞాన్ని చూడటానికి రాలేదు.”

అని చెప్పి మైత్రేయుడు ఇంకా ఇలా అన్నాడు “దేవతలు ఈ విధంగా విన్నవించగా బ్రహ్మ వారితో ఇలా అన్నాడు.

మహాతేజస్సంపన్నుడైనవాడు అపరాధం చేసినా తిరిగి అతనికి అపకారం చేసేవారికి ఈ లోకంలో క్షేమం ఉంటుందా?” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. యజ్ఞంలో హవిర్భాగం అందుకొనడానికి యోగ్యుడైన పశుపతి, ఈశ్వరుడు, అభవుడు, శర్వుడు, భర్గుడు అయిన పరమేశ్వరుణ్ణి యజ్ఞభాగానికి దూరం చేయడం అనే గొప్ప దోషాన్ని చేసిన దుష్టులు మీరు.ఏ మహాదేవుడు కోపంతో కనుబొమలు ముడివేస్తే లోకాలూ, లోకపాలకులూ నశిస్తారో ఆ మహనీయుని మనస్సు దక్షుని దురుక్తులు అనే బాణాలు గ్రుచ్చుకొని ఇదివరకే నొచ్చింది. ఇప్పుడు ఆ మహాత్మునికి భార్యావియోగం కూడా ప్రాప్తించింది. తిరిగి యజ్ఞాన్ని సక్రమంగా పూర్తి చేయాలనే కోరిక మీకు ఉన్నట్లయితే త్రిపుర సంహారుడైన ఆ హరుని, ఆ మహాదేవుని, ఆ మహానుభావుని నిండుహృదయంతో, నిర్మల భక్తితో ఆశ్రయించండి. ఆయన పాదపద్మాలపై బడి శరణు వేడండి. ఆ దయామయుడు దయ దలిస్తే మీ కోరిక నెరవేరుతుంది. ” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు “మేము ఆయనను సమీపించటానికి భయపడుతున్నాము అని భావించకండి. ఆయన దగ్గరకు పోయే ఉపాయం నన్ను చెప్పమంటారా? నేను, దేవేంద్రుడు, మునులు, మీరు, దేహధారులు ఎవరుకూడా ఆ మహాత్ముని స్వరూపాన్నీ, ఆయన బలపరాక్రమాల పరిమాణాన్నీ తెలుసుకోలేము. ఆయన సర్వస్వతంత్రుడు. కాబట్టి ఆయనను సమీపించే ఉపాయం చెప్పటానికి ఎవ్వరూ సమర్థులు కారు. అయినా ఆయన భక్తులకు అధీనుడు. శరణు జొచ్చిన వారిని రక్షించేవాడు. అందుచేత ఆయన వద్దకు మనం అందరం కలిసి వెళ్ళటం మంచిది” అని చెప్పి బ్రహ్మదేవుడు దేవతలను, పితృదేవతలను, ప్రజాపతులను వెంటబెట్టుకొని కైలాసానికి బయలుదేరి పోయి పోయి..ఆ విధంగా వెళ్ళిన దేవతలు భక్తుల మనస్సులకు అమితమైన ఆనందాన్ని కలిగించేదీ, కిన్నరస్త్రీలు విలాసంగా విహరించేదీ, శాశ్వతాలైన ఐశ్వర్యాలకూ శుభాలకూ స్థానమైనదీ, సిద్ధులూ యక్షులూ నివసించేదీ, వెండి వెలుగులతో నిండినదీ, తన అనంతకాంతులతో కులపర్వతాల శోభావైభవాన్ని పరాభూతం చేసేదీ అయిన కైలాస పర్వతాన్ని కనులపండువుగా దర్శించారు. ధాతుద్రవాలతో పలురంగులు కలిగిన రతనాల కాంతులతో ఆ వెండికొండ ఎత్తైన శిఖరాలు ప్రకాశిస్తున్నాయి. ఆ కొండచరియలు కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు, అప్సరసలు మున్నగువారితో నిండి ఉన్నాయి. దేవతలు తమ భార్యలతో కూడి విమానాలపై ఆయా ప్రదేశాలలో విహరిస్తున్నారు. గుహలచుట్టూ చిక్కని విరజాజి పూలతీగలు అల్లుకొని ఉన్నాయి. అక్కడి ఆశ్రమాలలో దేవతాస్త్రీలు, సిద్ధస్త్రీలు ఉంటున్నారు. దేవతలు సంచరించటానికి అక్కడి చోట్లన్నీ తగి ఉన్నాయి. చేసిన పుణ్యాలకు పెక్కురకాల భోగాలను అక్కడ అనుభవిస్తున్నారు. ఆ వెండికొండ పుణ్యాల పూలదండగా ఉన్నది. ఇంకా ఆ వెండికొండ మందారం, పారిజాతం, తెల్లతెగడ, కానుగు, మద్ది, తాడి, తక్కోలం, ఎఱ్ఱకాంచనం, దిరిసెనం, తెల్లమద్ది, తియ్యమామిడి, కడిమి, మంకెన, నాగవల్లి, సురపొన్న, సంపెంగ, కలిగొట్టు, అశోకం, పొగడ, మొల్ల, ఎఱ్ఱగోరింట, కనకాంబరం, తామర, మోదుగ, ఏలకి, లవంగం, జాజి, ఇప్ప, మల్లె, పనస, పూల గురివెంద, కొండమల్లె, మేడి, రావి, జువ్వి, మఱ్ఱి, ఇంగువ, బుజపత్తిరి, పోక, రాజపూగం, నేరేడు, ఖర్జూరం, ఆమ్రాతకం, మోరటి, కొబ్బరి, అందుగ, గారవెదురు, బొంగువెదురు మొదలైన చెట్లతో శోభిల్లుతున్నది. కోయిలలు, నెమళ్ళు, పావురములు, రామచిలుకలు, గండుతుమ్మెదలు, మొదలైన రకరకాల పక్షుల కలకలంతో భూమ్యాకాశాల మధ్యప్రదేశం ప్రతిధ్వనిస్తున్నది. సింహాలు, సివంగులు, ముళ్ళపందులు, అడవిదున్నలు, శరభమృగాలు, కోతులు, అడవిపందులు, పెద్దపులులు, కుక్కలు, నల్లచారల దుప్పులు, ఎనుబోతులు, తోడేళ్ళు, లేళ్ళు మొదలైన గొప్ప అడవి జంతువులకు ఆశ్రయంగా ఉన్నది. అరటితోపులతోను, తామరపూలతోను, తెల్లకలువలతోను, ఎఱ్ఱకలువలతోను కూడిన ఇసుక ప్రదేశాలతో అందంగా ఉన్న సరోవరాలలో విహరిస్తున్న రాజహంసలు, కొక్కిరాళ్ళు, బెగ్గురుపక్షులు, జక్కవలు, కొంగలు, నీటికోళ్ళు మొదలైన నీటిపక్షుల కూతలతో కలకలంగా ఉంది. జలక్రీడలతో విహరిస్తున్న అందమైన స్త్రీల చనుదోయికి అలదుకొన్న కస్తూరి కలిపిన మంచిగంధపు సువాసనలు కలిగిన గంగానది చేత ఆవరింపబడి ఉన్నది. అటువంటి కైలాసపర్వతాన్ని చూచి బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పొంది, ఎదురుగా అలకాపురాన్ని చూచారు. అది చుక్కలతో, మంచుతో, బంగారంతో కూడిన విమానాలతో, పుణ్యస్త్రీ సమూహంతో శోభిల్లుతున్నది. ఆ నగరం వెలుపల పూజ్యపాదుడైన విష్ణువు యొక్క పాదపద్మాల ధూళిచేత పవిత్రమై, రతికేళిచేత కలిగిన శ్రమను తొలగించే జలక్రీడలో మునిగిన దేవతాస్త్రీల ఎత్తైన స్తనాలకు అలదుకున్న కుంకుమతో కూడిన గోరోజనం రంగును పొందిన నంద, అలకనంద అనే రెండు నదులున్నాయి. వాటిని దాటి ఎదుట సౌగంధికవనాన్ని చూశారు. ఆ వనంలో ఏనుగులు రాచుకొనడం వల్ల మంచి గంధపుచెట్లనుండి వెలువడే సువాసనలతో కలిసిన గాలిని ఆస్వాదిస్తూ యక్షకన్యలు మాటిమాటికి సంతోషిస్తున్నారు. పచ్చలు పొదిగిన మెట్లు కల దిగుడు బావుల్లో బంగారు కలువలు ప్రకాశిస్తున్నాయి. కింపురుషులు సంచరించడానికి అనువైన ఆ సౌగంధికవనంలో...వందయోజనాల పొడవు, డెబ్బైయైదు యోజనాల వెడల్పు కలిగిన ఒక మఱ్ఱిచెట్టును దేవతలు చూచారు. ఆ చెట్టు నీడ సందులేకుండా అంతటా నిండి ఉంది. ఆ చెట్టు ఆకులతో, కొమ్మలతో అలరారుతూ మాణిక్యాలకు సాటివచ్చే పండ్లతో నిండి ఉన్నది. అది సిద్ధయోగ క్రియలకు ఆలవాలమై దోషరహితమై మోక్షం కోరేవారికి ఆశ్రయమై అలరారుతున్నది. అది సంసారతాపాన్ని తొలగిస్తుంది. ఆ మేటిమ్రాను భక్తులకు ఆనందం కలిగించే ఐశ్వర్యాలకు పుట్టినిల్లు.ఆ మఱ్ఱిచెట్టు క్రింద...

ప్రసిద్ధులైన సనందుడు మొదలైన సిద్ధులచేత సేవింపబడేవాడు, శాంతమూర్తి, దయాగుణం కలవాడు, లోకాలకు శుభాలను కలిగించేవాడు, శివుడు, విశ్వానికి బంధువైనవాడు, లోకాలు పొగడే కీర్తి కలవాడు, గుహ్యకులూ సాధ్యులూ రాక్షసులూ యక్షులకు రాజైన కుబేరుడూ మున్నగువారిచే సేవింపబడేవాడు, ఎదురులేని బలం కలవాడు, విద్యతో తపస్సుతో యోగంతో కూడినవాడు, నెలవంకను అలంకరించుకున్నవాడు, మునీంద్రులచేత స్తుతింపబడేవాడు, తాపసుల కోరికలను తీర్చేవాడు, విభూతినీ దండాన్నీ జడలనూ గజచర్మాన్నీ ధరించినవాడు, భక్తులను అనుగ్రహించేవాడు, సంధ్యాకాలంలోని మేఘాల కాంతిని పోలిన క్రొత్త ఎఱ్ఱని కాంతులతో వెలిగేవాడు, శాశ్వతుడు, బ్రహ్మస్వరూపుడు అయిన శివుణ్ణి చూశారు. ఇంకా...

ఆ మహేశ్వరుడు కుడితొడపై ఎడమకాలును మోపి, ఎడమ మోకాలిపై ఎడమచేతిని చాచి కూర్చున్నాడు. కుడి ముంజేతిలో జపమాలను ధరించాడు. మహనీయమైన ధ్యానముద్రను ధరించి బ్రహ్మానందంతో నిండిన మనస్సు కలవాడై సమాధి నిష్ఠలో ఉన్నాడు. అతడు మాత్సర్యం లేనివాడు. యోగపట్టంతో ఒప్పుతూ కోపం విడిచిపెట్టి కూర్చున్న యమునివలె దర్భాసనం మీద యోగనిమగ్నుడై ఉన్నాడు. ఆఢ్యుడు, అభవుడు, నాగభూషణుడు, సజ్జన పోషకుడు, యోగీంద్రులు వింటూ ఉండగా నారదునితో ఇష్టసంభాషణం చేస్తున్న ఆ శివుణ్ణి….లోకపాలకులూ, మునులూ సద్భక్తితో అతని పాదాలకు నమస్కరించారు. అప్పుడు బ్రహ్మను చూచి ఆ శివుడు సంభ్రమంతో…పుణ్యాత్ముడవైన ఓ విదురా! మహాత్ముడైన వామనుడు కశ్యపునకు నమస్కరించినట్లుగా శివుడు బ్రహ్మకు ఇంతో ఇష్టంతో నమస్కారం చేసాడు. అప్పుడు శివుని అనుచరులైన సిద్ధగణాలు, మునులు బ్రహ్మను చూచి నమస్కరించారు. ఆ తరువాత బ్రహ్మ శివుణ్ణి చూచి చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఓ పరమేశ్వరా! లోకాల కన్నింటికి ఉత్పత్తిస్థానం అయిన శక్తివి నీవే. జగత్తుల కన్నింటికీ బీజమైన శివుడు నీవే. నీవు నిర్వికార పరబ్రహ్మవు. నిన్ను విశ్వనాథునిగా నా మనస్సులో తెలుసుకున్నాను.ఓ ఈశ్వరా! రుద్రా! నీవు నీ సమాంశాలైన శివ శక్తి స్వరూపాలతో క్రీడిస్తావు. సాలెపురుగు వలె విశ్వసృష్టికీ, వృద్ధికీ వినాశానికీ నీవే హేతువు అవుతుంటావు. ఓ భక్తజన పోషణా! పన్నగ భూషణా! లోకాలలో వర్ణాశ్రమాచారాలను వేదాలు నిర్ణయిస్తాయి. గొప్పవారు వేదాలను గౌరవిస్తారు. వేదాలు సర్వ ధర్మార్థాలను ప్రసాదిస్తాయి. ఆ వేదాలను వృద్ధి చేయటం కోసం నీవు దక్షుణ్ణి నిమిత్తమాతృనిగా చేసి ఆ యజ్ఞం చేయించావు. నీవు మంగళ స్వరూపుడవు. నీవు న్ మహిమచేత శుభకర్మలు చేసేవారికి ముక్తిని, అశుభకర్మలు చేసేవారికి నరకాన్ని కలిగిస్తావు. అయినప్పుడు ఒకరి విషయంలో ఆ కర్మలు తల్లక్రిందులుగా కావటానికి నీ కోపం కారణం అని అనుకుందామా? నీ పాదపద్మాలపై మనస్సు నిల్పి సమస్త ప్రాణులలోను నిన్ను చూస్తూ ఇతర ప్రాణులను తనకంటే వేరుగా ఉండకుండా మహాత్ములు ప్రవర్తిస్తారు. అటువంటి మహాత్ములకు మూర్ఖులకు కలిగినట్లు కోపం కలుగదు కదా! మహానుభావుడవైన నీకు కోపం ఎక్కడిది? ఓ భవ్యచరితా! నీలలోహితా! పావన గుణ భరితా! లోక పరిపాలా! గంగాధరా! హరా! సకల లోక స్తుత చరిత్రా! మూర్ఖులు మదించి, దుష్టచిత్తులై భేదబుద్ధితో ప్రవర్తిస్తారు. పరుల సంపదను చూచి ఓర్వలేరు. మనోవ్యాధితో క్రుంగిపోతారు. మర్మస్థానాలను భేదించే పరుషవాక్కులతో ఇతరులను బాధిస్తారు. నీవు వారిని దైవానుగ్రహానికి దూరమైన వారినిగా భావిస్తావు. ఆ కపటాత్ములకు నీవంటి సత్పురుషుడు ఏ విధంగానూ హింస కావించడు.సమస్త దేశాలలోను, సర్వ కాలాలలోను ఉల్లంగించరాని మహిమ కల విష్ణువు యొక్క మాయకు చిక్కినవారు భేదదృష్టితో ప్రవర్తిస్తారు. వారు ద్రోహం చేసినట్లైతే సత్పురుషుడు అది దైవకృతంగా భావిస్తాడు. ఆ మహితాత్ముడు ఇతరుల దుఃఖం చూచి ఓర్చుకోలేడు. వారిమీద జాలి పడతాడు. అంతేకాని వారిని హింసింపడు. నీవు విష్ణుమాయకు అతీతుడవు. అందుచేత నీవు సర్వజ్ఞుడవు. విష్ణుమాయకు వశులై కర్మలు ఆచరించేవారు అపరాధం చేసినట్లైతే నీవు క్షమించి వారిని కాపాడాలి.అందువల్ల యజ్ఞభాగానికి అర్హుడవైన నీకు యజ్ఞభాగాన్ని ఇవ్వకపోవడం వల్ల నీవు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేశావు. అది అసంపూర్ణంగా మధ్యలో ఆగిపోయింది. అటువంటి దక్షయజ్ఞాన్ని నీవు పునరుద్ధరించు. దక్షుని బ్రతికించు. భగునికి కన్నులను, భృగుమహర్షికి మీసాలను, పూషునికి దంతాలను అనుగ్రహించు. అవయవాలు తుత్తునియలైన దేవతలకు, ఋత్విక్కులకు ఆరోగ్యం ప్రసాదించు. మిగిలిన యజ్ఞకార్యం సమస్తం పూర్తి కావించి ఈ యాగాన్ని నీ భాగంగా స్వీకరించు.” అని బ్రహ్మదేవుడు వినయంతో వేడుకొనగా శివుడు వెంటనే తృప్తిపడి చిరునవ్వుతో దయతో ఇలా అన్నాడు. ‘విష్ణుమాయకు వశులై పామరులు చేసిన దోషాలను నేను మనస్సులో ఎప్పుడూ లెక్కచేయను. అయినా…బలవంతులను శిక్షించడం, దుర్బలులను రక్షించడం ధర్మమార్గం కనుక నేను దుష్టులను వారు చేసిన దోషాలకు తగినట్లుగా శిక్షిస్తూ ఉంటాను.” అని చెప్పి “శిరస్సు దహింపబడిన దక్షుడు గొఱ్ఱెముఖం కలవాడు అవుతాడు. భగుడు దర్భలతో సంబంధించిన యజ్ఞభాగాన్ని పొంది మిత్రనామకమైన నేత్రాలతో చూస్తాడు. పూషుడు పిండములను యజమాని దంతాల ద్వారా భుజిస్తాడు. దేవతలు యజ్ఞశేషాన్ని నాకు సమర్పించడం వల్ల మునుపటి వలె అన్ని అవయవాలు కలిగి సంచరిస్తారు. అవయవాలు ఖండింపబడిన ఋత్విక్కులు మొదలైనవారు అశ్వినీ దేవతల బాహువుల చేతను, పూషుని హస్తాల చేతను తమ తమ బాహువులను, హస్తాలను పొంది బ్రతుకుతారు. భృగువు చింబోతు మీసాలు, గడ్డాము పొందుతాడు” అని శివుడు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు సమస్త ప్రాణులు సంతోషించి “తండ్రీ! బాగు బాగు” అని మెచ్చుకున్నారు. అప్పుడు ఆ శివుని దగ్గర సెలవు తీసుకొని ఇంద్రుడు మొదలైన దేవతలు ఋషులతో కూడి బయలుదేరారు. బ్రహ్మదేవుడు శివుణ్ణి ముందుంచుకొని దక్షయజ్ఞం జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. అప్పుడు….ఓ విదురా! గొప్పవారిచే మన్నిపబడేవాడ! శివుని ఆజ్ఞానుసారంగా మునులు, ఋత్విక్కులు, దేవతలు మొదలైన వారంతా తమ తమ పూర్వశరీరాలను పొంది చక్కగా ప్రకాశించారు. అప్పుడు…విదురా! విను. శివుడు దక్షుని గొఱ్ఱెతల కలవానిగా చేసి చూస్తుండగా అతడు నిద్రనుండి మేలుకొన్న విధంగా సంతోషంగా లేచాడు.

అలా లేచి నిలిచిన దక్షుడు శివుని చూచినంత మాత్రాన శరత్కాలంలో బురద లేని సరస్సు వలె పూర్వం రుద్రుని ద్వేషించడం వలన కలిగిన దోషాలను పోగొట్టుకొని నిర్మలుడై ఆ శివుణ్ణి స్తుతించాలకున్నాడు. కాని మరణించిన తన కూతురును తలచుకొని ప్రేమతో, తహతహపాటుతో కన్నులలో నీరు నిండగా, డగ్గుత్తిక పడిన కంఠంతో మాట్లాడలేక, ఎట్టకేలకు దుఃఖాన్ని దిగమ్రింగుకొని ప్రేమాతిరేకంతో ఒడలు మరచి ఆ శివునితో ఇలా అన్నాడు. దేవా! అభవా! పురాంతకా! రుద్రా! విను. నీకు అపరాధం చేసిన నన్ను నీవు శిక్షించడం నాకు అది శిక్ష కాదు. అది నన్ను రక్షించడంగానే భావిస్తాను.పుణ్యాత్మా! నీవు, విష్ణువు కపట బ్రాహ్మణులను క్షమింపరు. దృఢమైన వ్రతం కల బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేయరు. సృష్టి ఆరంభంలో వేదసంప్రదాయాలను ప్రవర్తింపజేయడానికి నీవు బ్రాహ్మణులను సృజించావు. విద్య, తపస్సు, వ్రతం బ్రాహ్మణుల ధర్మాలు. కాబట్టి కఱ్ఱ చేత పట్టుకొని గోపాలుడు గోవులను కాపాడే విధంగా నీవు బ్రాహ్మణులను నిత్యం శ్రద్ధగా కాపాడుతూ ఉంటావు.

క్షుద్రులను సంహరించే రుద్రా! దయా సముద్రా! నేను తత్త్వజ్ఞానం తెలియని మూర్ఖుడను. మహాసభలో నేను పలికిన చెడ్డ పలుకులు అనే ములుకులచేత నీవు గాయపడ్డావు. అయినా నేను చేసిన నేరాన్ని నీవు మనస్సులో పెట్టుకోలేదు. మహానుభావుణ్ణి నిందించిన పాపంచేత అధోగతికి పోవలసిన పాపాత్ముణ్ణి నన్ను దయతో కాపాడావు. నీకు తిరిగి ఉపకారం చేయటానికి నే నెంతవాణ్ణి? ఓ సచ్చరిత్రా! త్రినేత్రా! ఇతరులను అనుగ్రహించే కార్యాల మూలంగా కలిగే ఆనందాన్ని నీవు పొందుదువు గాక!” అని ఈ విధంగా దక్షుడు క్షమింపుమని రుద్రుణ్ణి వేడుకున్నాడు. తరువాత బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగా ఉపాధ్యాయులతోను, ఋత్విక్కులతోను కూడి యజ్ఞం చేయడం ప్రారంభించాడు. అప్పుడు బ్రాహ్మణులు యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగడానికి, ప్రమథ వీరుల సంబంధంవల్ల కలిగిన దోషం నివారించడానికి విష్ణుమూర్తి దేవతగా కలిగినదీ, పురోడాశ ద్రవ్యం కలిగినదీ అయిన కర్మను నిర్వర్తించారు. అధ్వర్యుకార్యాన్ని స్వీకరించిన భృగువుతో కూడి నిర్మలమైన మనస్సు కలవాడై దక్షుడు ద్రవ్యత్యాగం చేసాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించి (సాక్షాత్కరించాడు). నల్లని మేని కాంతులు నాలుగు దిక్కుల్లో వ్యాపిస్తుండగా, బంగారు మొలత్రాడు కాంతులతో పట్టుబట్టల కాంతులు కలిసిపోగా, లక్ష్మికి కాపురమైన వక్షఃస్థలంపై వైజయంతీమాల కాంతులను ప్రసరిస్తుండగా, రత్నాలు పొదిగిన బంగారు కిరీటం కాంతులు బాలసూర్యుని వెలుగులతో అతిశయించగా, శిరోజాలు నీలమేఘ కాంతులతో ఒప్పుతుండగా, తన దేహంనుండి వెలువడే దివ్యకాంతులు బ్రహ్మ, శివుడు మొదలైన దేవతాశ్రేష్ఠుల దేహకాంతులను క్రిందుపరుస్తూ సమస్త లోకాలకు గురువైన నారాయణుడు (సాక్షాత్కరించాడు). అందమైన శంఖం, చక్రం, పద్మం, గద, విల్లమ్ములు, ఖడ్గం మొదలైనవాటి నిర్మల కాంతులతోను, మణులు పొదిగిన బంగారు కంకణం, ఉంగరాల కాంతులతోను ప్రకాశించే భుజసమూహంతో తన శరీరం పూచిన కొండగోగుచెట్టు వలె అలరారుతుండగా (విష్ణువు సాక్షాత్కరించాడు).సరసమైన ఔదార్యంతో కూడిన చిరునవ్వుతో, చూపులతో లోకాలకు సంతోషాన్ని కలిగిస్తూ కన్నుల పండుగగా లోకబంధువౌతూ్ (విష్ణువు సాక్షాత్కరించాడు). ఇంకా దేవతాస్త్రీలు రాజహంసలవలె తెల్లనైన విసనకఱ్ఱలతో, వింజామరలతో వీస్తూ ఉండగా, పున్నమనాటి చంద్రబింబం వంటి తెల్లని గొడుగు కాంతులు దిక్కులందు వ్యాపించగా కరివరదుడైన హరి గరుడవాహన మెక్కి అక్కడికి వచ్చాడు.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: