Srikrishna Mallikarjuna:
ఆదర్శానికి నిదర్శనం శ్రీకృష్ణుడు
సంప్రదాయ, శాస్త్రీయ, సంస్కార, సామాజిక, విషయాలపై పూర్తి అవగాహనతో చాతుర్వర్ణనం మయాస్పష్టం అంటూ వర్ణాశ్రమ ధర్మమును స్నేహభావంతో ఆవిష్కరించి అందించిన మహాభావుడు శ్రీకృష్ణుడు. మర్యాదపాలన, నిరంకుశ నిర్మూలనతో సంపూర్ణ మానవజాతి కల్యాణమే కాక సమస్త ప్రాణికోటి శ్రేయస్సు కోరి అవతరించిన శ్రీకృష్ణుడు దివ్యపురుషుడు. జీవితంలో ఎదురయ్యే అనేక పరిస్థితులను సమన్వయపరిచి ఎలా చతురతతో పరిష్కరించాలో తన జీవిత చరిత్ర ద్వారా విశేషంగా తెలియజేశాడు. అందుకే ఆయన అపూర్వ విజయాలు సాధించిన చారిత్రక పురుషుడు. చెరసాలలో జన్మించి, గోవులను మేపుతూ పెరిగినవాడు.. ఆదర్శవిద్యార్థిగా, మిత్రుడిగా, కర్మయోగిగా, రాజ శ్రేష్టుడుగా లోకాదర్శమైన మానవ జీవితాన్ని చూపుతూనే మరోపక్క విశ్వరూప సందర్శనం, గీతాప్రవచనం వంటి ఘట్టాలలో తన అవతార పరమార్థాన్ని, భగవదాంశనూ ప్రదర్శించాడు.
పూర్ణ పురుషుడు శ్రీకృష్ణుడు
సకల గుణవంతుడు, ఆదర్శ చరిత్రకారుడు అయిన శ్రీకృష్ణుడి చరిత్రలో మానవ జీవనం సర్వతో ముఖవికాసం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఉత్తములు దేనిని ఆచరిస్తారో సామాన్యులు అదే బాటను అనుసరిస్తారు. మంచి నడవడిక, నిస్వార్థ భావన, ధర్మ రక్షణతో భూభారాన్ని తొలగించి తన చరిత ద్వారా లోకాదర్శమైన పరిపూర్ణ మానవత్వాన్ని ప్రభోదించాడు. రాజనీతి కోవిడుదు, శీలవంతుడు, సదాచారుడు, నీతిమంతుడు, శూరుడు శ్రీకృష్ణుడు అని వర్ణించిన మహాభారత గాథకు నాయకుడైన దేశ ఐక్యతకు తోడ్పడి భారతీయమైన దేశాన్ని అందించి ఆచంద్రతారార్కం చరిత్రలో నిలిచిపోయాడు ఆ పరంధాముడు. నిష్పక్షపాతం, ధర్మం, శాంతి, నమ్రత, వినయం, శ్రద్ధాభక్తులు శ్రీకృష్ణుని దివ్యగుణాలు. రాజసూయ యాగం పూర్తయిన తర్వాత ధర్మరాజు సభలో అర్ఘ్యం స్వీకరించి, అగ్రతాంబూలం అందుకునే అర్హతగల రాజెవ్వరని భీష్ముడిని అడుగుతాడు. స్థితప్రజ్ఞుడు, యోగివర్యుడు, సహనశీలుడు, అపరిమితబల సంపన్నుడు, తేజోమయుడు అయిన శ్రీకృష్ణుని కంటే అధికులైన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అంటూ భీష్ముడు శ్రీకృష్ణుని ఘనతను కీర్తిస్తాడు. శిశుపాలుని విషయంలో మనోనిగ్రహంతో సహనం పాటించి ధర్మస్థాపనకై చిరుమందహాసంతో వేచి ఉంటాడు. కురుక్షేత్ర సంగ్రామం వలదని శాంతి దూతగా మారి హితువు పలికిన ఉత్తముడు అచ్యుతుడు. కర్మబంధాలకు కారణమైన కామక్రోధాదులను జయించిన కర్మయోగి శ్రీకృష్ణుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి