మహాభారతము ' ...51.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
సభా పర్వం..
దుర్యోధనుని కోర్కెమేరకు శకుని, ధృతరాష్ట్రుని వద్దకు, పాండవులను జూదక్రీడకు ఆహ్వానించడానికి అనుమతి కోసం వెళ్ళాడు. అయితే, శకుని, తాను యేవిధమైన ప్రసంగము ఆ విషయంపై చెయ్యకుండా, అత్యంత చతురతతో, బావగారైన ధృతరాష్ట్రునితో కుటుంబ యోగక్షేమాలు మాట్లాడుతున్నట్లుగా సంభాషణ మొదలు పెట్టి,దుర్యోధనుని ప్రసక్తి తెచ్చాడు. అతనెందుకో యీమధ్య ఆత్మన్యూనతతో బాధ పడుతున్నాడని విచారం వెలిబుచ్చాడు. అతని అంతరంగం తెలుసుకోగలవాడు తండ్రి తప్ప యింకెవరున్నారని, అన్నాడు.
ఆమాట వినగానే, ధృతరాష్ట్రుడు చివ్వునలేచి, విదురుని పిలిపించి, తనను దుర్యోధనుని వద్దకు తీసుకెళ్లమని అడిగాడు. దుర్యోధనుడు కలిసినంతనే, ' కుమారా ! నీకు కావలసిన రాజ్యాధికాము, నీవు చెప్పినట్లు వినే మంత్రాంగమంతా వున్నదికదా ! అయినా దేని గురించో నీవు మధనపడుతున్నావని నాకు అనిపిస్తున్నది. ఆ విషయం యేమై ఉంటుంది. నాకు చెప్పు. నేనేమైనా నీకు సహాయపడగలనేమో ! ' అన్నాడు.
' జనకా ! మీరు నాగురించి యింతశ్రద్ధగా అడిగినందుకు ధన్యవాదాలు. నాకు యుధిష్ఠరుని సిరిసంపదలు చూసినప్పటినుండి, మనసు వ్యాకులంగా వున్నది. అసూయా భారంతో మనసుకృంగిపోతున్నది. నేను వారి ఐశ్వర్యాన్ని యెలాగైనా దక్కించుకోవాలి లేదా వారిచేతిలో యుద్ధంలో వీర మరణం పొందాలి.. ' అంటూ విదురుడు చూడకుండా, శకునికి సైగ చేశాడు.
'వెంటనేశకుని, ' దుర్యోధనా ! పాండవులను జయించడం అంత సులభంకాదు. వేరే యేదైనా యుక్తి ఆలోచించు. ' అని ధృతరాష్ట్రుని మనసులో నాటుకునేటట్లు జూద ప్రసక్తి తెచ్చి, ' వారిని ఆహ్వానించు జూదానికి. నీకు వారి రాజ్యలక్ష్మిని కానుకగా నేను యేర్పాటు చేస్తాను. ' అని ముగించాడు. దుర్యోధనుడు, యీ వుపాయమేదో బాగున్నది. యిదే తక్షణ కర్తవ్యమ్, తండ్రీ. ' అని తండ్రి అనుమతికై తొందరపెట్టాడు.
పుత్రవాత్సల్యం ధృతరాష్ట్రుని మరియొకసారి దుర్బలుని చేసింది. అయినా, విదురుని సలహా తీసుకుందామని విదురునివైపు తిరిగి అభిప్రాయం చెప్పమని అడిగాడు. విదురుడు మాట్లాడేలోపే, ' ఈ సంభాషణ యింతటితో సరి. విదురుడు ఈ మాటకు యెదురుచెబితే, నాప్రాణత్యాగమే దీనికి పరిష్కారం. ' అని మారు మాటాడనీయకుండా, ధృతరాష్ట్రుని ఆమోదం తీసుకున్నాడు, పాండవులను జూదక్రీడకు పిలవడానికి.
ధృతరాష్ట్రుడు విదురునితో, ' జూదక్రీడకు వెంటనే ఒక ప్రత్యేక భవనం నిర్మింప జేయమని పురమాయించి, అతనినే ఇంద్రప్రస్థం వెళ్లి పాండవులను తీసుకురమ్మని చెప్పాడు. అయినా మనసు వూరకుండక, విదురుడు ధృతరాష్ట్రునికి, దుర్యోధనునికి, జూదక్రీడ వద్దని ప్రాధేయ పడినంతగా చెప్పినా, యేప్రయోజనం లేకపోగా, ఇంద్ర ప్రస్థానికి ప్రయాణమయ్యాడు.
విదురుడు ధర్మరాజుకు తాను వచ్చిన కార్యం చెప్పాడు. విదురుడు అన్యమనస్కంగా తమను రమ్మని చెప్పడం గమనించి, ధర్మరాజు, ' మహాత్మా ! జూదక్రీడ మిగుల ప్రమాదకరమైనది, మిత్రులను, శత్రువులుగా చేసేది అని తెలిసీ, మీరు మమ్ములను తీసుకు వెళ్ళడానికి యెలా వచ్చారు ? ' అని ధర్మరాజు అడిగాడు. దానికి విదురుడు, 'ధర్మజా ! నేను చెప్పిచూశాను. అయినా ప్రయోజనం లేకపోయింది. జూదంవలన కలిగే అనర్ధాలు అన్నీ పూసగ్రుచ్చినట్లు తండ్రీకొడుకులకు చెప్పాను. అయినా నామాట వినలేదు. ఈ విషయంలో, నీవే స్వతంత్రంగా ఒకనిర్ణయం తీసుకో. హస్తినకు రావడమో, నిరాకరించడమో ! ' అనిమాత్రం చెప్పాడు.
ఈమాటలు విన్న ధర్మరాజుకు దుర్యోధన ధృతరాష్ట్రుల అంతరంగం అర్ధమైంది. ఏదో కీడుతలపెట్టారని వూహించాడు. ' నేను అక్కడ యెవరితో జూదమాడాలి ' అని ధర్మజుడు విదురుని అడుగగా, ' అక్కడ శకుని , అతనితో పాటు సత్యవ్రత, పురుమిత్ర, చిత్రసేన, వివింశతి, జయుడు మొదలగు వారు జూదవిశారదులు వున్నారని ' చెప్పాడు విదురుడు.
' విదురా ! నేను పెదతండ్రిగారి ఆజ్ఞకు కట్టుబడి వస్తున్నాను. లేకుంటే నాకు శకునితో జూదమాడడం సుతరామూ యిష్టంలేదు. అని యెంతో వేదనాభరిత హృదయంతో ధర్మజుడు జూదమాడడానికి హస్తినకు బయలుదేరాడు. ఏదో ఉపద్రవం కనిబెట్టి తనతో తమ్ములను, ద్రౌపదినికూడా వెంట తీసుకువెళ్ళాడు ధర్మరాజు. వెళ్ళగానే, హస్తినలో పెద్దలందరినీ మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీర్వాదం తీసుకున్నాడు ధర్మరాజు, తమ్ములతో సహా. ధృతర్రాష్ట్రుడు గాఢమైన ఆలింగనంచేసుకుని వారి రాకవలన తాను పొందిన ఆనందం తెలియజేశాడు.
జూదక్రీడకు శకుని ఆధ్వర్యంలో అన్ని సన్నాహాలు జరుగుతున్నవి.
స్వ స్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.
తీర్థాల రవి శర్మ
విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం. హిందూపురం.
9989692844
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి