15, అక్టోబర్ 2020, గురువారం

16-06-గీతా మకరందము

 16-06-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - దైవగుణములుకలవారు, అసురగుణములుకలవారు అని ప్రాణులు రెండు విధములుగా నుందురని చెప్పుచున్నారు –


ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ 

దైవ ఆసుర ఏవ చ | 

దైవో విస్తరశః ప్రోక్త 

ఆసురం పార్థ మే శృణు || 


తాత్పర్యము:- ఓ అర్జునా! ఈ ప్రపంచమున దైవసంబంధమైన గుణముకలదియని, అసురసంబంధమైన గుణముకలదియని రెండువిధములగు ప్రాణుల సృష్టులు కలవు. అందు దైవసంబంధమైనదానినిగూర్చి నీకు సవిస్తరముగ తెలిపితిని. ఇక అసురసంబంధమైన దానినిగూర్చి నావలన వినుము. 


వ్యాఖ్య:- వాస్తవముగ ప్రపంచమున రెండేరెండు జాతులు కలవని ఈశ్లోకము ద్వారా తెలియుచున్నది. (1) దైవజాతి (2) అసురజాతి - అని. అనగా ఒకటి ఆర్యజాతి, మఱియొకటి అనార్యజాతి. తక్కిన అవాంతరజాతులన్నియు తదుపరి ఏర్పడినవేయగును. కావున ప్రతివారును తాము ఏజాతికిజెందినది బాగుగ పరీక్షించుకొని తమయం దేవైన అసురగుణములున్నచో వానికి తిలాంజలినొసంగి దైవగుణముల నభివృద్ధి పఱచుకొని 'దైవజాతి' లో చేరినవారై పరమ శ్రేయము (మోక్షము) నొందవలయును.

కామెంట్‌లు లేవు: