15, అక్టోబర్ 2020, గురువారం

రామాయణమ్.93

 రామాయణమ్.93

...

దుఃఖార్తుడై తీవ్రమైన వేదనతో విలపిస్తూ శపథములు చేస్తూ మాటిమాటికి ఒట్లుపెట్టుకుంటున్న భరతుని చూసి కౌసల్య దుఃఖము మరింత హెచ్చింది .రాముడంటే ప్రాణమైన భరతుని దగ్గరకు తీసుకొని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని చాలాసేపు దుఃఖిస్తూ అలాగే ఉండిపోయింది.అలాగే రాత్రి గడిచిపోయింది.

.

తెల్లవారుతుండగనే వశిష్ఠ మహర్షి భరతుడికి చేయవలసిన కార్యములను గురించి తెలిపి అందుకు కావాలసిన ఏర్పాట్లు చేసినాడు.

.

నూనెలో జాగ్రత్తగా ఉంచిన దశరథుడి కళేబరాన్ని బయటకు తీసి నేలపై ఉంచారు. మహారాజు ఇంకా నిదురిస్తున్నట్లుగనే ఉన్నాడు.

.

ఆయన పార్ధివ శరీరం వద్దకు వెళ్ళి భరతుడు ఎందుకు చేశావయ్యా నీవీ పని ? ధర్మమూర్తి రాముడిని అడవులకు పంపే నిర్ణయమెందుకు చేశావు.నా దగ్గర రాముడూలేడు,నీవూలేవు ఇక ఈ అయోధ్య భర్తలేని విధవరాలుగా ప్రకాశహీనంగా ఉన్నదయ్యా! అని పరిపరివిధాలుగా రోదిస్తున్న భరతుడిని వశిష్ఠుల వారు ఓదార్చి చేయవలసిన కార్యాలగురించి తొందరపెట్టాడు.

.

మహారాజుదేహాన్ని పల్లకిలో కూర్చుండ బెట్టి శ్మశానమునకు తీసుకువెళ్ళి చితిమధ్యలో పరుండబెట్టి అనేక విధాలైన గంధద్రవ్యాలు చేర్చగా,భరతుడు ఆయన చితికి నిప్పుపెట్టాడు.

.

ఆయనకు జరిపించవలసిన కర్మలు శాస్త్రోక్తంగా పూర్తిచేసి రాముడి వద్దకు వెళ్ళిపోవాలనే తలంపుతో శత్రుఘ్నునితో కలిసి కూర్చున్నాడు భరతుడు.

.

ఇద్దరూ మాట్లాడు కుంటున్నారు.సకల లోక రక్షకుడు ,మహాబలశాలి,మనకు కష్టాలు వస్తే ఆదుకునే రాముడిని ఒక ఆడుది అడవికి పంపి వేసింది.

.

ఆసమయంలో లక్ష్మణుడు ఏం చేస్తున్నట్లు?స్త్రీ వశుడైన తండ్రిని ఎందుకు నిగ్రహించలేకపోయినాడు? ఇలా మాట్లాడుకుంటుంటే వారికి అటుగా వెళ్తూ మంధర కనపడ్డది.

.

అది వంటి నిండా గంధము పూసుకొని రాణులు అలంకరించుకొనే విధముగా విలువైన వస్త్రాలు ధరించి రకరకాల అలంకారాలతో,నడుముకు వడ్డాణముతో త్రాళ్ళతో కట్టబడ్డ ఆడుకోతిలాగ ఉన్నది.

.

దానిని ద్వారపాలకులు పట్టుకొని ఇదిగో ఎవతెమూలంగా రాముడు అడవులపాలయ్యాడో ఆ దరిద్రపుగొట్టు మంధర ఇది ఏం చేస్తావో చెయ్యి అని శత్రుఘ్నునికి అప్పగించారు.

.

ఇది చేసిన వెధవపనికి ఇది ఫలితము అనుభవించాల్సిందే అంటూ ఆ గూనిదానిని జుట్టుపట్టుకొని ఒక ఈడ్పుఈడ్చాడు శత్రుఘ్నుడు అప్పుడు అది వేసుకొన్న ఆభరణాలు చెల్లాచెదురుగా పడి ఆ నేల అంతా నక్షత్రాలు పరుచుకొన్న ఆకాశంలాగ కనపడ్డది.

.

అది కుయ్యోమొర్రో అంటూ ఏడుస్తుంటే దాని వెంట వస్తున్న తక్కిన దాసీజనమంతా శరణువేడటానికి కౌసల్యా మందిరం వైపు పరుగెత్తారు.

.

శత్రుఘ్నుడు తీవ్రమైన క్రోధావేశంతో కైకేయినికూడా దూషిస్తూ ఉంటే ఆవిడ విపరీతమైన భయంతో భరతుడిని శరణువేడింది.

.

అప్పుడు శత్రుఘ్నుని చూసి భరతుడు తమ్ముడూ స్త్రీల ను చంపడం మహాపాపం వీరిని వదిలి వేయి ,అదీగాక వీరికి ఏవిధమైన హానికలిగినా జీవితాంతము రాముడు మనతో మాట్లాడడు.

.

రాముడు నిందిస్తాడు అనే భావనే నాకు లేకపోతే ఈ ధూర్తురాండ్రను నేనే ఎప్పుడో సంహరించి ఉండేవాడిని.

.

భరతుడి ఆ మాటలు విని వారిరువురినీ విడిచిపెట్టేశాడు శత్రుఘ్నుడు.

.

వూటుకూరు జానకిరామారావు 

.

కామెంట్‌లు లేవు: