15, అక్టోబర్ 2020, గురువారం

ఆచార్య సద్భోదన*

 *ఆచార్య సద్భోదన*


ఇంద్రియగోచరమైన ప్రపంచం మాత్రమే నిజమని భావించే మనం ఆధ్యాత్మిక సాధనలలో చాలా జాగరూకులమై ఉండాలి. రోజూ మనం చేసే సాధనల క్రమబద్ధతను బట్టి, తీవ్రతను బట్టి వాటి సాఫల్యం ఉంటుంది. నియమబద్ధంగా, క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తే తప్ప ఆధ్యాత్మిక జీవితంలో ఏమీ సాధించలేము.


ఉన్నతమైన ఒక ఆదర్శం కోసం కావలసిన ఆత్మ సమర్పణ, త్యాగం, ఏకనిష్ఠ మన ఆధ్యాత్మిక జీవితం - వీటి మీదనే ఆధారపడి ఉంటుంది. మనకు వచ్చే రకరకాల ఆలోచనల గురించి జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్త పడడం మన సంక్షేమం కోసమే.


కామం, లోభం, హింస వీటికి సంబంధించిన ఆలోచనలు మనలో చెలరేగుతుంటే అవి మనకే కాక ఇతరులకు కూడా హాని చేస్తాయి. అపవిత్రమైన ఆలోచనల వలన మనం సృష్టించే విధ్వంసం, విషవాయువులకంటే కూడా ఎంతో ప్రమాదకరమైనది. 


అపవిత్రత అంటే ఏమిటో తెలియని వారిని కూడా ఈ అపవిత్రమైన ఆలోచనలు దిగజార్చుతాయి. కానీ మనం చేసే పవిత్రమైన ఆలోచనలు మనకే కాక తమ పవిత్రత కోసం ఇతరులు చేసే సాధనలో కూడా సహాయకారులవుతాయి.


*శ్రీకృష్ణార్పణమస్తు*

కామెంట్‌లు లేవు: