ఇంద్రపురం దేవలోకంలో లేదు. తెలంగాణాలో వుంది.
...................................................
నిజామాబాదు జిల్లాకు ముందు ఇక్కడున్న జిల్లా పేరు ఇందూరు. ఈ ఇందూరు జిల్లాలోనే బోధన్ పట్టణముంది. బోధన్ ప్రముఖకన్నడ కవి పంప పుట్టినిల్లుగా పేర్కొంటారు. పంపకవి ఒలికిలి కూడా ఇక్కడే వుందంటారు.
బోధన్ అసలు పేరు పొదనపురం. ఇది చాళుక్య విజయాదిత్యుడి రాజ్యానికి రాజధానిగా ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. భీమునిగుట్ట క్రమంగా బోధన్ గా మారిందనేది ఐతిహ్యం.
ఇక్కడి శివాలయం ప్రసిద్ధి పొందింది. 60 స్థంభాలతో ప్రముఖ జైనబసది (దేవాలయం) ఇక్కడుండేది. ముస్లీంలు దండయాత్రలో దీనిని కూల్చి మసీదుగా మార్చడం జరిగింది.
8 వ శతాబ్దంలో రాష్ట్రకూట ప్రభువైన ఇంద్రవల్లభునికి కూడా ఇందూరు రాజధానిగా వుండేది. అతను ఇక్కడ ఇంద్రనారాయణ దేవరకు దేవళం కట్టించాడని త్రైలోక్యమల్ల ప్రథమసోమేశ్వరుని దిగువ కనబరచిన కన్నడశాసనం తెలియచేస్తోంది.
" రాష్ట్రకూట్వయ చక్రేశ్వరం ఇందరవల్లభం
రాజధాని బోధనదోళ్ మాడిసిద
ఇంద్రనారాయణదేవర దేవాయతనం "
బోధన్ అసలు పేరు పోధనపురం కదా ! దానికే బోధనపురమని కూడా పేరు.
ఇకనుండి తెలంగాణా సోదరులు బోధన్ అని పిలువకుండా వ్రాయకుండా బోధనపురమని వ్యవహారించాలి.
బోధనపురమే ఇంద్రపురమని మీరు భావించలేదు కదా!
ఇందూరుకే ఇంద్రపురమని పేరు. రాష్ట్రకూటరాజు ఇంద్రవల్లభుని పేరు మీదుగా ఈ నగరి నిర్మింపబడి ఇంద్రపురంగా విలసిల్లుతోంది.
కాబట్టి తెలంగాణా మిత్రులు ఇందూరును ఇంద్రపురంగా పిలుచుకొని తెలంగాణ సంస్కృతిని భావితరాలకు భద్రపరచండి.
.................................................................................................................................
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి