15, అక్టోబర్ 2020, గురువారం

సమయమిది

 *పరీక్షా సమయమిది*


పరీక్షించాలి! పరీక్షిస్తే నిజాలు నిగ్గు తేలతాయి. బంగారానికి పుటం పెడితే దాని వన్నె పెరుగుతుంది. వజ్రానికి కోత పెడుతుంటే కొత్త కోణాలు ఏర్పడి, ప్రకాశం ఇనుమడించి విలువ పెరుగుతుంది.

పరీక్షలు ఎదురైనప్పుడు సహనం వహించండి, విజయం మీదే అవుతుందని పెద్దలు చెప్పారు.

‘మబ్బులు కమ్మాయి. చీకటి ముసురుకుంది. అవి తొలగిపోగానే సూర్యుడు వస్తాడు. వెలుగు చూస్తారు. అంతవరకు ఓపిక పట్టండి’ అని ఒక సందర్భంలో శిరిడియోగి సాయి బోధించారు.

సవాళ్లు, పరీక్షలు అనేవి లేకపోతే జీవనంలో గొప్పదనం లేదు. జీవితంలో సౌందర్యం ఉండదు.

జీవితం ఒక నాటక రంగం అన్నాడు షేక్‌స్పియర్‌. ఈ నాటకంలో రకరకాల పాత్రలు, భావాలు, సన్నివేశాలు, విధి విలాసాలు, అగ్ని పరీక్షలు ఉంటాయి.

పరీక్షలు లేకపోతే ఫలితాలెలా వస్తాయి. ఫలితాలు లేకపోతే ఎవరు, ఏమిటి అనేది ఎలా తెలుసుకోగలుగుతాం? మంచికైనా చెడ్డకైనా ఎదురెళ్ళి నిలబడాలి. ప్రతిదానికీ భయపడకూడదు. పరీక్షించే సమయం ఆసన్నమైనప్పుడు పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవాలి.

ప్రకృతి మనకు ఒక శరీరం ఇచ్చింది. ఆ శరీరంలో మనసుంది. బుద్ధి, చిత్తం, అహంకారం కూడా ఉన్నాయి. వాటిని పరీక్షించాలి. వాటి సత్తువ ఎంతో తేల్చాలి.

ఒక బలహీనమైన మనసు దృఢమైన శరీరంలో ఉంటే అక్కడ సమగ్రతాలోపం ఉంటుంది. శరీరం బలంగా ఉన్నప్పుడు మనసు కూడా బలంగా ఉండాలి.  

మన మనసు ఏయే సందర్భాల్లో ఎలా స్పందిస్తుందో, ఆ స్పందన తీరుతెన్నులు తెలుసుకోవాలి. నిశ్చలత్వమే మనసుకు మందు. ఆ నిశ్చలత్వాన్ని సాధించాలి. అరుణాచల రమణుడిలా బుద్ధిని పరీక్షించుకోవాలి. విచక్షణా జ్ఞానంతో, ఉన్న లోపాలను సరిజేసుకోవాలి. వివేకం పెంచుకోవాలి. వినాశకాలే విపరీత బుద్ధిః అన్నారు. బుద్ధిలోని వైపరీత్యాన్ని తొలగించుకొని సమత్వాన్ని, సమభావాన్ని ఏర్పరచుకుని మంచి కాలాన్ని ఆహ్వానించాలి.

జ్ఞాపకాలు మనల్ని బాధపెడుతుంటాయి. ఒక్కోసారి ఆనందపరుస్తుంటాయి. చిత్తం స్థిరంగా లేకపోతే మనల్ని మనం మరచిపోయే రుగ్మతలకు గురి అవుతాం. జ్ఞాపకాల వ్యవస్థను పరీక్షించుకోవాలి. నిత్యం మనసును ఆహ్లాదకరంగా ఉంచుకోవాలి. నవ్వాలి. తోటివారిని నవ్వించాలి.

అహంకారానికి నిత్య పరీక్ష అవసరం. రక్తపోటులో హెచ్చుతగ్గులున్నట్లు, మధుమేహ గణాంకాల్లో ఆటుపోట్లున్నట్లు- అహం పడిలేచే కెరటంలా కదులుతూ ఉంటుంది. అహం ఎప్పుడెప్పుడు ఎలా మనల్ని ఏ స్థితికి తీసుకు వెళుతుందో గమనిస్తూ ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. అహం మనకు పెట్టే పరీక్ష అన్నింటికంటే కఠినమైనది. తెలివైన వాడిని, తెలివి తక్కువ వాడిని ఇద్దరినీ ఏమారుస్తుంది అహం. స్వచ్ఛమైన నిరాడంబరమైన ప్రేమతో అహం నేలకూలుతుంది. అదంత సులువు కాదు.

శిశుపాలుడు శ్రీకృష్ణుడికి పరీక్ష పెట్టాడు. సహనాన్ని దారుణంగా పరీక్షించాడు. ఆంజనేయుడు శ్రీరాముడు తనకు పెట్టిన పరీక్ష ఇది అనుకున్నాడు. సీతకు అగ్ని పరీక్ష ఎదురయ్యింది. పాండవులకు సైతం అడుగడుగునా పరీక్షలే! వివిధ పౌరాణిక పాత్రల అనుభవాల్ని, ఆయా సందర్భాల్లో వారు ఎలా నెగ్గుకొచ్చారన్న ఉదంతాల్ని విని వదిలెయ్యకూడదు. మన జీవితాలకు ఎప్పుడు ఎలా పనికొస్తాయో గమనిస్తుండాలి. యావత్‌ మానవాళికే ఇది పరీక్షా సమయం! దైర్యంగా ఉండాలి. ఓపిగ్గా ఉండాలి. అంతిమ విజయం మనదే!

(ఈనాడు అంతర్యామి)

✍🏻 ఆనందసాయి స్వామి

కామెంట్‌లు లేవు: