10, జనవరి 2021, ఆదివారం

ఉపనిషత్తులు

 అన్నీ పరమాత్మ దేహంలో భాగాలే, దేనియందు అసహ్యం చెందకు (6వ మంత్రం)           [ఉపనిషత్తులు]                               


4వ మరియూ 5వ మంత్రాల్లో పరమాత్మ తత్త్వం ఏమిటో తెలిసింది. అయితే మనం చూస్తున్నది ప్రపంచాన్ని. అందులో ఎన్నో రకాల జీవుల్లు. వారియందు మనం ఎట్లాంటి భావన కలిగి ఉండాలి ? వారితో నడుచుకునేప్పుడు పరమాత్మ వరకు అది పర్యవసించగలగాలి. అదేలా సాధ్యం ఈ మంత్రం చెబుతుంది.


యస్తు సర్వాణి భూతాని  ఆత్మన్యేవానుపశ్యతి |

సర్వ భూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే || (6)


విజుగుప్స- అంటే అసహ్యం, లోకంలో కొందరిని చూస్తే కలుగుతోంది అసహ్యం, కొందరిని చూస్తే కలుగుతోంది ప్రేమ,  ఏమి కారణం ? మన కాలికి మురికి అంటితే కాలును పట్టుకోవడానికి ఏం పెద్ద పాదపడటం లేదే, కారణం ఇది నా దేహంలోని భాగమే అనే భావం. కాలిలో ముల్లు దిగితే కంటిలోంచి నీరు వస్తుంది, శరీరంలో ఒక అవయవం శోకిస్తే మిగతా అవయవాలు అన్నీ స్పందిస్తాయి. వాటికి అట్లాంటి జుగుప్స లేదు. ఇదే దృష్టితో ప్రపంచాన్ని చూడు,  ఇక ఎవడిని చూసి జుగుప్స చెందుతావు ? చెందవు. ఎందుకని ?  "యస్తు సర్వాణి భూతాని ఆత్మని" సర్వ భూతాలు అన్నీ పరమాత్మ ఆధీనంలో ఉన్నాయి. "సర్వ భూతేషు చాత్మానం" పరమాత్మ అంతటా ఉన్నాడు, ప్రతి ప్రాణిలో ఉన్నాడు. విశ్వశరీరంలో ప్రతి ఒక్కరం ఒక్క అవయవమే, కనుక ఒక అవయవం మరొక అవయవాన్ని ఎప్పుడూ ధూషించదు, ద్వేశించదు, అసహ్యం చెందదు. 


కనుక ఎవడైతే కనిపించే ప్రపంచంలోని విషయాలు పరమాత్మపై ఆధారపడి ఉన్నాయని, అవన్నీంటిలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడని తెలిస్తే వాడికి పరమాత్మ తత్త్వం అర్థం అయినట్లు, ఇక ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉండవు. ఇక అవి లేనప్పుడు వాడికి పాపం అంటనే అంటదు.

కామెంట్‌లు లేవు: