4, డిసెంబర్ 2022, ఆదివారం

కాఫీ ఖాతా

 కాఫీ ఖాతా


ఒకరోజు అకస్మాత్తుగా పరమాచార్య స్వామివారు తము మకాం చేసినచోట ఉన్న ఉగ్రాణంలోకి వెళ్ళి అలా బయటకు వచ్చారు. మహాస్వామివారికి తెలియకుండా నలుగురైదుగురు సిబ్బంది కాఫీ తయారుచేసుకొని తాగుతున్నారు. స్వామివారు ఆ విషయం గమనించారేమో అని వారు భయపడ్డారు. కాని స్వామివారు ఆ విషయమై ఏమి అడగకపోవడంతో వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. స్వామివారు ఏమీ గమనించలేదని సంతోషపడ్డారు. 


రాత్రి స్వామివారు నన్ను పిలిచి, ఫలహారం అయిన తరువాత సిబ్బంది అందరినీ సమావేశపరచాలని మేనేజరుకు చెప్పమని నాకు చెప్పారు. ఆ సమావేశానికి పద్దుల పుస్తకంతో రావాల్సిందిగా చెప్పమన్నారు. ”ఏ లెక్కల పుస్తకం?” అని నన్నడిగారు మేనేజరు. నేను స్వామివారిని అడగగా, “ఏవో ఒకటి రెండు లెక్కాపద్దుల పుస్తకాలు పట్టుకుని రమ్మను” అని ఆదేశించారు.


సిబ్బంది అందరూ సమావేశమయ్యారు. స్వామివారు వారితో, “ఈ పుస్తకంలో ఉన్నది అంతా సరైనది అని ఒప్పుకుని నమస్కారం చెయ్యండ”ని ఆదేశించారు. 


మనసులో భయంతో వారిలో కొంతమంది అలా చెయ్యడానికి ముందుకురాలేదు. “ఎందుకు ఆలోచిస్తున్నారు? అందులో ఉన్నది అంతా నిజమే అయితే నమస్కారం చెయ్యండి”


“అదీ. . . ”


“ఆ ఖర్చును ఏ లెక్కలో చూపిస్తున్నారు?” అని అడిగారు స్వామివారు.


“ఆవుల ఆహారం కోసం పత్తి విత్తనాలు కొన్నట్టుగా” అని బదులిచ్చారు. 


వారి ఇబ్బందిని స్వామివారు అర్థం చేసుకొన్నారు. పీఠాధిపతుల భిక్ష తరువాతనే వారు ఆహారం స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. చాలాసార్లు స్వామివారు భిక్ష చెయ్యడానికి మధ్యాహ్నం రెండు అవుతుంది కాబట్టి వారికి తాగడానికి ఏదో ఒకటి కావాలి. 


అందుకనే స్వామివారు ఇలా తీర్మానించారు, “రేపటి నుండి మొదటికాల పూజ ఉదయం పది గంటల లోపు పూర్తిచేస్తాను. మీరందరూ భోజనం చేసిన తరువాత, నేను భిక్షావందన పూజ చేసి కొద్దిసేపటి తరువాత నేను భిక్ష చేస్తాను.”


అప్పటినుండి ఇలా సిబ్బందికి అనుకూలమైన సంప్రదాయం శ్రీమఠంలో మొదలైంది.


--- ఎన్. వెంకట్రామన్, మైలదుతురై. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 2


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: