11, డిసెంబర్ 2022, ఆదివారం

దిల్ కి బాత్

 దిల్ కి బాత్


భర్తకు దక్కని భార్య రాజస్థాన్ ముఖ్యమంత్రయ్యింది


భార్యకు దక్కని భర్త దేశానికి ప్రధాని అయ్యాడు


చాయ్ దగ్గర మొదలైన ప్రభుత్వం ఆవు దగ్గర ఆగిపోయింది


వికాసమనే తల్లి దారి తప్పి, ఎక్కడో ఆగమైంది


అమ్మాయిలు భావోద్వేగాలు తింటున్నారు


అబ్బాయిలు మోసపు కలలు తింటున్నారు


ఉద్యోగులు లంచం తింటున్నారు


నేతలు కరెన్సీ తింటున్నారు


రైతులు విషం తింటున్నారు


ఉద్యమకారులు బుల్లెట్లు తింటున్నారు


అందరూ ఏదో ఒకటి సుష్ఠుగా తింటూనే ఉన్నారు


ఎవరంటారు భారత్ ఆకలితో అలమటిస్తోందని?


ఎవరంటారు భారత్ ఆర్థికంగా దిగజారిపోయిందని?


ఊడ్చేవాడు ముఖ్యమంత్రయ్యాడు


పన్నెండు చదివినమ్మ విద్యామంత్రయ్యింది


గోచీ సన్నాసులంతా మంత్రులయ్యారు


వేలిముద్రగాళ్ళు ఎమ్మెల్యేలయ్యారు


నేరగాళ్ళేమో యం.పి. లయ్యారు


పీజీలు చేసిన వాళ్ళంతా ఫేస్ బుక్, వాట్సప్ ల్లో ఇరుక్కున్నారు


ఒంటరిగా ఉన్నవాడు వ్యవస్థల్ని ముక్కలు చేస్తున్నాడు


వివాహితుడు మార్కెట్లో కూరలు కొనలేకపోతున్నాడు


వినేవాళ్ళకే కదా మిత్రో – ఎవరైనా చెవుల్లో పూలు పెడతారూ?


తెలివిగల జపాన్ వాళ్ళు బెల్లెట్ ట్రయిన్ నడుపుతారు


మన మేధావులు పదకొండు మందికి ఓం నమశ్శివాయ – పంపుతారు


దాంతో ఫ్రీ బాలెన్స్ చమత్కారం జరుగుతుందని ఆశపడతారు


అగర్ బత్తులు రెండు రకాలుగా ఉంటాయి


ఒకటి భగవంతుడికి మరోటి దోమలకు


భగవంతుడు వచ్చేది లేదు-దోమలు పోయేది లేదు!


ఉన్నవి ఖాళీ కడుపులు, యోగా చేయమంటారు


జేబులో చిల్లి గవ్వ ఉండదు, బ్యాంక్ ఎకౌంట్ తెరవమంటారు


ఉండటానికి ఇల్లు లేదురా నాయనా అంటే


మరుగుదొడ్లు కట్టిస్తామంటారు


ఊళ్ళో కరెంటు ఉండదు, డిజిటల్ ఇండియా అయిందంటారు


నగరాల్లో ఇంటర్నెట్ ఉంటుంది కాని, ఆపేస్తారు


దొరికేవన్నీ విదేశీ కంపెనీల వస్తువులు


దాన్నే ‘మేకిన్ ఇండియా’ అనమంటారు


పప్పు ఉప్పు బియ్యం జనం కొనలేకపోతున్నారు


టాటాకార్లు, సెల్ ఫోన్లూ అగ్గువైపోయాయంటున్నారు


మెదట్లో జాతి మతాల ద్వేషం నింపుతారు


స్వచ్ఛ భారత్ అభియాన్ గూర్చి గొప్పగా చెపుతారు


నిషా కరోనా వైరస్ లను ఎదుర్కోగలిగే జనం,


దేశంలో కాషాయ వైరస్ ను ఎదుర్కోలేకపోతున్నారు


అసమాన్యుడి ‘మన్ కీ బాత్’ లో –ఏదీ- వినిపించదు?


సామాన్యుడి ‘దిల్ కి బాత్!’


(కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త)

Dr. Devaraju Maharaju

సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

కామెంట్‌లు లేవు: