15, ఏప్రిల్ 2025, మంగళవారం

అభినవ నటకులు!

 శీర్షిక..అభినవ నటకులు!


నాటకం బూటకం నిండిన 

మాయా లోకంలో 

ఎవరిని నమ్మాలి? 

ఇంటా బయటా అభినయ వీరులు 

వంచించే మాటల్తో సవారీ చేస్తూ..


పెదవులపై నవ్వులు 

ద్వేషం మోసం గుండెల్లో రగిలిస్తూ 

మాటల మాధుర్యంతో గారడీ చేస్తూ 

వెనుక గోతులు తీస్తూ 

తేనె పూసిన కత్తులు 

గుచ్చేస్తారు గుండెల్లో గునపాలు..


స్వార్ధం నిండిన కుళ్ళూ కుతంత్రాలతో 

నిజాలను కప్పేస్తూ 

అబద్ధాలను మెప్పిస్తూ 

దగా దోపిడీ చేస్తూ 

కోట్లకు కోట్లు దండుకుంటున్నారు 

ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో చెవిలో పువ్వులు పెట్టేస్తూ..


డబ్బున్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా

మూగేస్తారు..బంధాల లంకె బిందెలతో 

నష్టాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మొహం చాటేస్తారు

పాతేస్తారు నిను..నీ కర్మకు నీవే బాధ్యుడవంటూ 

కాటికి తోలేస్తారు నూకలు చెల్లాయంటూ..


బుస కొట్టే నాగులు 

సమయం చూసి కాటేస్తారు అసూయా ద్వేషంతో

మేక వన్నె పులులు 

జగన్నాటక సూత్రధారులు 

నమ్మిస్తారు జగమే మాయంటూ 

అభినవ అభినయ వంచనతో 

నీవెవరంటూ? నిను నీవే ప్రశ్నించుకొనే 

మాయల మత్తులో చిత్తవుతూ..

ంంంంంంంంంంంంంంం

ఇది నా స్వీయ కవిత

కామెంట్‌లు లేవు: