9, మే 2021, ఆదివారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*ఆశ్రమ నిర్మాణానికి సూచనలు..జలకళ!!*


*(ఇరవై రెండవ రోజు)*


శ్రీధరరావు దంపతులు, చిన మీరాశెట్టి గారూ కలిసి, సోమవారం ఉదయాన్నే మాలకొండకు వెళ్లారు..పార్వతీదేవి మఠం వద్ద  కొంతసేపు ఎదురుచూసిన తరువాత, శ్రీ స్వామివారు వెలుపలికి వచ్చారు..మీరాశెట్టి గారిని చూసి, పలకరింపుగా నవ్వారు..శ్రీధరరావుగారు, ప్రభావతి గార్లు ఒక ప్రక్కగా కూర్చున్నారు.. వారికెదురుగా శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని కూర్చుని..


"మీరాశెట్టి ని వెంటబెట్టుకొని మరీ వచ్చారే!.." అని..మీరాశెట్టి గారి వైపు చూసి.."నిస్వార్ధబుద్ధితో, నిర్మల చిత్తంతో మందిర నిర్మాణం చెయ్యి నాయనా!..నీకు శుభం కలుగుతుంది.." అని చెప్పారు..మీరాశెట్టి గారు అలాగే నన్నట్లుగా తలా ఊపి..


"స్వామీ!..నాకు తెలిసిన వాస్తు పండితుడు వున్నాడు..ఆయనను సంప్రదించి, ఆ స్థలం లో వాస్తు నిర్ణయం చేసి, ముహూర్తం చూసుకొని..పని మొదలు పెడతాను.." అన్నారు..


శ్రీ స్వామివారు పెద్దగా నవ్వి..పార్వతీదేవి అమ్మవారి దగ్గరకు వెళ్లి, ఆ అమ్మవారి ముందు పెట్టివున్న నోట్ పుస్తకం లోంచి ఒక కాగితం తీసుకొని..దానిమీద మందిరం ఎలా వుండవలసినదీ..వాస్తు ప్రకారం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవలసినదీ..ప్రతి చిన్న విషయాన్నీ వివరంగా వ్రాసి..మీరాశెట్టి గారికి ఇచ్చారు..శంఖుస్థాపన కు ముహూర్తం కూడా నిర్ణయించి..వ్రాసి ఇచ్చారు..


"ఇక సందేహాలన్నీ తీరి పోయినట్లేనా?..మీరాశెట్టీ..నువ్వు ఎవరినీ సంప్రదించనక్కరలేదు..అన్నీ సవ్యంగా జరిగిపోతాయి.." అన్నారు..


శ్రీధరరావు దంపతుల తో.."మీరూ..మీరాశెట్టి కలిసి చేయవలసిన కార్యక్రమం ఇది..బావి పని మొదలుపెట్టారు కదా..అది పూర్తి కాగానే..మందిర నిర్మాణం మొదలుపెట్టండి.." అని చెప్పి వారి స్పందన కోసం చూసారు..


అందరూ శ్రీ స్వామివారికి నమస్కారం చేసికొని..తిరిగి మొగలిచెర్ల వచ్చారు..మీరాశెట్టి గారు కూడా శ్రీధరరావు గారి వద్ద సెలవు తీసుకొని..బావి పని పూర్తి కాగానే తనకు కబురుచేస్తే..మందిరం పని మొదలుపెడతానని చెప్పి..తమ గ్రామానికి వెళ్లిపోయారు..


బావి త్రవ్వకం జరుగుతోంది..దాదాపు 35, 40 అడుగుల లోతు త్రవ్వారు..నీటి జాడే లేదు..పైగా చట్టుబండ తగిలింది..గునపాలు దిగడం లేదు..ఆరోజుల్లో ఈనాటి లాగా బోరు మిషన్లు అందుబాటులో లేవు..పనివాళ్ళతో త్రవ్వించవలసిందే..అతి కష్టం మీద ఆ బండ తొలగించాలని చూసారు కానీ..పని చేసే వడ్డెర వాళ్ళు ఇక తమ వల్ల కాదని పనిముట్లు అక్కడే వదిలేసి వచ్చేసారు..శ్రీధరరావు గారు ఎంత నచ్చ చెప్పినా..తమ వల్ల కాదని..మందుగుండు పెట్టి పేల్చినా ఆ బండ పగలదని తేల్చేసారు..


ఆ పొలంలో అలా ఓ నలభై అడుగుల గొయ్యి తీసి వదిలేస్తే..గొర్రెలు, మేకలు కాచుకునే వారు గానీ..లేదా ఆ దారంట పోయే వాళ్ళు పొరపాటున అందులో పడితే..తమకెంత చెడ్డపేరు..అదీకాక, శ్రీ స్వామివారు స్వయంగా నిర్ణయం చేసిన స్థలం లో నీళ్లు పడకపోవడమేమిటి?..ఇలా ఆలోచిస్తూ..ప్రభావతి గారు..ఆ లక్ష్మీనృసింహుడినే వేడుకున్నారు.


ప్రక్కరోజు ఉదయాన్నే శ్రీధరరావు గారు ప్రభావతి గారు కావలి లో "కుమారి" (ఇంతకుముందు మొగలిచెర్ల కు వచ్చి శ్రీ స్వామివారిని చూసి వెళ్లిన అమ్మాయి) వివాహ నిశ్చయతాంబూలాలు తీసుకునే వేడుకకు హాజరు కావాల్సి వెళ్లారు..వెళ్ళారిగానీ..వాళ్ళిద్దరి మనసంతా ఈ బావి మీదే ఉంది..అందులో జల పడకపోగా రాయి తేలిందేమిటా అని ఒకటే ఆలోచన..ప్రభావతి గారి నాన్నగారు అడగనే అడిగారు.."అమ్మా!..మీరిద్దరూ ఏదో బాధలో ఉన్నట్లు వున్నారు.." అని.."ఏమీ లేదు.." అని బుకాయించారిద్దరూ..అక్కడ ఆ కార్యక్రమం చూసుకొని రాత్రి పది గంటలకు ఆఖరి బస్సు లో మొగలిచెర్ల చేరారు..


బస్సు దిగి ఇంటి వరండాలోకి అడుగుపెట్టగానే..బావి త్రవ్వుతున్న పనివాళ్ళు నలుగురైదుగురు కూర్చుని వున్నారు...


"ఒరేయ్ శ్రీధరా..పాపం సాయంత్రం నుంచీ మీకోసం వీళ్ళు కాచుక్కూర్చున్నారు..స్వామి వారి బావిలో నీళ్లు పడ్డాయట!.." అని శ్రీధరరావు గారి తల్లి గారు చెప్పారు..


వీళ్ళను చూడగానే..ఆ వడ్డెర వాళ్ళు ఒక్క ఉదుటున లేచి.."అయ్యా!..మీకోసమే ఇక్కడున్నాము స్వామీ..నిన్న బావి త్రవ్వలేమని చెప్పి వెళ్ళామా..ఈరోజు పొద్దున్న ..అయినా ఒకసారి చూద్దామని వెళితే..ఆ చట్టుబండ చీలిక లోంచి జల వస్తోంది..గునపంతో కొద్దిగా పెళ్లగించ గానే.. పైకి చిమ్మాయి నీళ్లు..ఆ జల ఆగలేదు స్వామీ..తీయటి నీళ్లు!..మీకోసం ఒక చెంబులో పట్టుకొచ్చాము..రేపుదయం మీరిద్దరూ అక్కడికి రండి..కళ్లారా చూద్దురు గానీ.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఒక్కసారిగా మనసు తేలికపడింది..శ్రీ స్వామివారు నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది.. సిద్ధపురుషుల మాటలు పొల్లుపోవు!..ఫకీరు మాన్యం లో మొట్టమొదటి జలధార అదే!..


ప్రక్కరోజే ప్రభావతి గారు ఆ నీటితోనే పొంగలి వండి..దైవానికి నివేదించి..పనివాళ్లకు పెట్టి..తామూ ప్రసాదంగా తీసుకున్నారు..


మందిర నిర్మాణం..మీరాశెట్టి దంపతుల కృషి..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: