9, మే 2021, ఆదివారం

వృద్దాశ్రమం

 *వృద్దాశ్రమం (చిన్న కథ)* 


🌸🌸🌸🧘🏻🧘🏻🧘🏻🌸🌸🌸


యశోదమ్మకు రాత్రంతా నిద్ర పట్టలేదు.. కొడుకు అన్న మాటలు విని నెత్తిన పిడుగు పడ్డట్టయిందీ.. పాపం.. మరి నిద్ర ఐనా ఎలా వస్తుంది... అక్కడ, ఇక్కడ కొన్నిచోట్ల తాను కూడా విన్నది.. పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్దాశ్రమంలో వదులుతారని... 


       కానీ తనకు కూడా అటువంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించుకోలేదు.. కొడుకు చాలా మంచివాడు.. కోడలిదే అంతా పెత్తనం.. ఐనా ఇన్ని రోజులు చూపించిన ప్రేమ అంతా నాటకమా...?  అనుకుంది.. 

 

    రాత్రి భోజనం సమయంలో కొడుకు తల్లితో చెప్పాడు.. అమ్మా.. రేపు ఉదయం తొందరగా తయారవ్వు..వృద్దాశ్రమానికి వెళ్ళాలి..అన్ని ఏర్పాట్లు చేసాను.. వాళ్లు కూడా తొందరగా రమ్మన్నారు... అని చెప్పాడు.. యశోదమ్మకు గొంతులో ముద్ద దిగలేదు.. ఆ రాత్రంతా ఒక యుగంలా గడిచింది యశోదమ్మకు... 


      ఉదయం కోడలు యశోదమ్మ దగ్గరకు వచ్చి అత్తయ్య తొందరగా రెడీ అవ్వండి.. నేను అన్ని సర్దేశాను.. తొందరగా బయలుదేరాలి అని చెప్పింది.. యశోదమ్మకు గట్టిగా ఏడ్వాలనిపించింది.. కానీ కోడలి ముందు తన దౌర్బల్యము చూపించడం ఇష్టం లేక., తనను తాను సముదాయించుకుని.. వాళ్ళకు ఇష్టం లేనప్పుడు నేను ఎక్కడ ఉంటే ఏంటి ?  అని మనసు ధృడం చేసుకుంది.. మనసు భారంగా ఉంది... నాలుగు సంవత్సరాల క్రితం మరణించిన భర్త గుర్తుకు వచ్చి కళ్ళలో నీళ్లు పెట్టుకుంది.. 


      ఇంతలో కొడుకు వచ్చి అమ్మా.. పద వెళదాం... ఇప్పటికే ఆలస్యం అయింది అంటూ పిలిచినపుడు యశోదమ్మ మనసు భారంతో బయలుదేరింది.. ఇంతలో కోడలు ప్యాక్ చేసిన అన్నింటినీ కారు డిక్కీలో సర్దేశింది.. అరగంటలో ఆశ్రమానికి చేరుకున్నారు.. 


     వెనక సీట్లో కూర్చున్న యశోదమ్మను దించి భుజాలపై చేతులు వేసి ప్రేమగా పదమ్మా.. అంటూ ఆఫీస్ రూం వైపు నడిచారు.. ఆ సమయంలో యశోదమ్మకు ఈ ప్రేమంతా నాటకమా... అనుకుంది.. కళ్ళలో నీళ్లు తిరిగాయి.. 


     ఆఫీసు రూంలో కొడుకు వాళ్ళతో ఏవేవో మాట్లాడాడు... అంతా ఇంగ్లీష్ లోనే.. యశోదమ్మకు అర్థం కాలేదు.. 


   అక్కడినుండి అందరూ ఆశ్రమంలోనికి వెళ్ళారు.. అక్కడ ఒక పెద్ద హాలు.. సుమారు నూటయాబై మందికి పైగా తనలాంటి వృద్దులు ఉన్నారు.. బహుశా తనని వాళ్ళకు పరిచయం చేస్తారేమో అనుకుంది.. 


    కానీ తన ఊహకు భిన్నంగా అక్కడ ఉన్న వాళ్లందరూ ఒక్కసారిగా "హ్యాపీ బర్త్ డే టూ యూ" అంటూ రాగయుక్తంగా అనేసరికి  ఆశ్చర్యపోయింది.. 


      వెంటనే కొడుకు తేరుకొని అమ్మ కాళ్లకు నమస్కరించి... 

అమ్మా.. క్షమించమ్మా.. నీకొక చిన్న సర్ ప్రైజ్ ఇవ్వాలనే ముందుగా నీకు తెలుపలేదు.. నీ కోడలుకు విషయం చెప్పవద్దని మాట తీసుకున్నా.. అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాడు.. ఇంతలో కోడలు కూడా వచ్చి "జన్మదిన శుభాకాంక్షలు అత్తయ్య" అంటూ ఆప్యాయంగా హత్తుకుంది.. 


     అమ్మా.. నీ జన్మదినాన్ని వృద్దాశ్రమంలో చేసుకుని.. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నీ చేతులతో కొత్త బట్టలు ఇచ్చి, స్వీట్లు ఇచ్చి.. వారితో పాటు మనమూ ఇక్కడే భోంచేసి వెళదామని ప్లాన్ చేసానమ్మా అంటూ కొడుకు అనేసరికి యశోదమ్మకు ఎక్కడ లేని సంతోషంతో కళ్ళలో ఆనంద భాష్పాలు రాలాయి... 


కన్న ప్రేమ గొప్పదనం పై చాగంటి వారి మనస్సు కదిలించే ప్రసంగం 


      ఆ రోజంతా అందరూ అక్కడే గడిపి హాయిగా ఇంటికి చేరుకున్నారు.. 

 *లోకాన్ సమస్తాన్ శుఖినోభవంతూ* 

 🌸🌸🌸🧘🏻🧘🏻🧘🏻🌸🌸🌸

కామెంట్‌లు లేవు: