26, జులై 2021, సోమవారం

*శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ - 297*

 *శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ - 297*

🙏🌻🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻🙏


 *వడివేల్ - వెణ్ పొంగల్* 


చాలా సంవత్సరాల క్రితం తిరుత్తణి కొండపై బైరవ సుబ్రమణ్య అయ్యర్ ప్రసాదందుకాణం నిర్వహించేవారు. ఆ దుకాణంలో పనిచేసేవాళ్ళల్లో నేను కూడా ఒకణ్ణి. విపరీతమైన పని వల్ల నాకు ఒకసారి జ్వరం వచ్చింది. సమయం గడుస్తున్న కొద్దీ జ్వరం చాలా ఎక్కువ అయ్యింది. రాత్రి పదింటికి ఇంటికి చేరుకోగలను అనుకుని చిన్నగా మెట్లు దిగడం మొదలుపెట్టాను. నిదానంగా నడుస్తూ అక్కడక్కడ కూర్చుంటూ ఎలాగైతేనేమి చివరి మెట్టు వద్దకు వచ్చాను.


దేవాలయ పుష్కరిణి వద్ద ఒక మేనా నిలిపి ఉండడం గమనించాను. ఆ వైపు నుండి ఒక వ్యక్తి నాకేసి వస్తున్నాడు. అతను నన్ను “కొండపై నుండి వస్తున్నారా?” అని అడిగాడు. నేను అవునన్నాను. సరే నాతో రండి అని మేనావద్దకు తీసుకునివెళ్ళాడు. నేను కొద్దిగా మేనాలోపలికి తొంగిచూసాను. పరమ శాంత స్వరూపంతో మహాస్వామివారు నాకు దర్శనమిచ్చారు. నన్ను నేను మరచిపోయి భక్తితో చేతులు జోడించి నిలబడిపోయాను. 


“నీవు కొండపైనుండి వచ్చావా? దేవాలయం తెరిచి ఉన్నదా?” అని అ మహాస్వామి వారు అడిగారు. చాలా వినయంతో, “దేవాలయం మూసివేసారు స్వామి” అని బదులిచ్చాను. “అక్కడ ప్రసాదాల దుకాణం ఉన్నదా?” అని అడిగారు. నేను “అది కూడా మూసివేసారు” అని చెప్పగా వారు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత మహాస్వామి వారు నాతో, “నన్ను మోసిన వీరందరూ ఆకలిగా ఉన్నారు. వారికి పుత్తూరులోను, నగరిలోను అహారం దొరకలేదు. నేను వారికి తిరుత్తణిలో ఖచ్చితంగా ఆహారం దొరుకుతుంది అని చెప్పాను. ఇక్కడికి రాగానే పుష్కరిణి గట్లపై ఉన్న హోటళ్లలో కూడా వారికి ఆహారం దొరకలేదు” అని మహాస్వామివారు చెప్పగా నాకు ఏమి చేయాలో తోచలేదు.


నేను జ్వరంతో బాధపడుతున్నప్పటికి దీని గురించి తరువాత అలోచిద్దాం అనుకుని స్వామివారితో, “మహాస్వామివారు ఆజ్ఞాపిస్తే నేనే స్వయంగా వారికి ఆహారం తయారుచేస్తాను” అని చెప్పాను. స్వామివారు ఆశ్చర్యంతో “ఈ రాత్రప్పుడు నువ్వు ఏమి చెయ్యగలవు?” అని అడిగారు. ”నేను కొండపైనున్న ప్రసాదాల దుకాణంలో పనిచేస్తాను. వాళ్ళకోసం వెణ్ పొంగల్ (వెన్న పొంగలి) తయారుచేస్తాను” అని చెప్పాను. మహాస్వామివారు ”అలా అయితే సరే. నేను మెట్లమార్గం గుండా కొండ ఎక్కుతాను. వాళ్ళని మామూలు మార్గం ద్వారా రమ్మని చెప్తాను. నువ్వు వెళ్ళి త్వరగా అహారం సిద్ధం చెయ్యి. వెళ్ళు!!”


స్వామివారు ఆ చివరి పదం “వెళ్ళు” అని అనగానే అప్పటిదాకా ఉన్న జ్వరం, అలసట మాయమయ్యాయి. ఎక్కడాలేని ఉత్సాహం వచ్చేసింది. ఏదో పరుగుపందెంలో పాల్గొంటున్న వాడిలా ఒక్క ఉదుటున వెళ్ళి పైకి చేరుకున్నాను. ఆరోజు మా యజమాని లేరు. నేను విషయమంతా వారి భార్యకు చెప్పాను. ఆ సాధ్వి నాతో, “నువ్వు కిందకు వెళ్ళినది డాక్టరుకు చూపించుకోవాడానికే కదా! ఆ వైద్యనాథుడే నీ జ్వరాన్ని పోగొట్టి నీకు అనుజ్ఞ ఇచ్చిన తరువాత నన్ను అడగడం దేనికి? ఇది మనందరి ఉన్నతి కొరకు జరిగిన సంఘటన. నువ్వు సంతోషంగా వెళ్ళి ఆహారం తయారుచెయ్యి” అని చెప్పారు. వెంటనే నేను పొయ్యి వెలిగించి ఆహారం తయారు చెయ్యడం మొదలుపెట్టాను. అక్కడ పడుకొని ఉన్న అతణ్ణి లేపి ఆహారం, చెక్క తెడ్డు, తినడానికి మందార ఆకులు, పొంగల్ లో నంచుకోవడానికి పులికైచల్ (చింతపండు పులుసు) తీసుకుని వెళ్ళడానికి సహాయం తీసుకుని దేవాలయ ధ్వజస్థంభం దగ్గరకు వెళ్ళాము. 


కొన్ని నిముషాల తరువాత పరమాచార్య స్వామివారు వచ్చారు. మొత్తం దేవాలయ ప్రాకారాలు అన్ని విద్యుత్ వెలుగులతో నిండిపోయాయి. మేళతాళాల మధ్య పూర్ణకుంభంతో దేవస్థానం అధికారి కృష్ణ రెడ్డియార్, ఆలయ పరిపాలనాధికారి కులశేఖర నాయుడు, ఆలయ ఉద్యోగులు, పండితులు మహాస్వామివారికి ఘనస్వాగతం పలికారు. స్వామివారు చుట్టూ చూసారు. నేను వెళ్ళి వారిముందు చేతులు కట్టుకుని నిలబడ్డాను. 


స్వామివారు “ఆహారం తయారు అయ్యిందా?” అని అడిగారు. నేను, “తయారు చేసి ఇక్కడకు తీసుకుని వచ్చాను” అని బదులిచ్చాను. “సరే నువ్వు వీరికి వడ్డించిన తరువాత లోపలికి రా” అని అన్నారు. నేను మేనా మోసే బోయీలను కూర్చోమని చెప్పి ఆకుల్లో వేడి వెణ్ పొంగలి వడ్డించాను. “ఇది మీకోసమే తయారుచేశాను. నంచుకోవడానికి పులికైచల్ కూడా ఉంది. కడుపునిండుగా తినండి. నేను ఆలయంలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటాను” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాను. 


పరమాచార్య స్వామివారు గర్భాలయం వద్ద నిలబడి ఉన్నారు. నేను వారిని దర్శించగనే కళ్ళు నులుముకుని తేరిపారగా చూసాను తనిగైమలై మురుగన్ ఎవరు పరమాచార్య స్వామి ఎవరు అని నిర్ధారించుకోవడానికి. మహాస్వామిని అలా దైవగురువు, జగద్గురువుగా చూడడంతో కళ్ళ నీరు ఆపుకోలేకపోయాను. దర్శనానంతరం స్వామివారు బయటకు వచ్చారు. 


నేను వెళ్ళి వారి ఎదురుగా చేతులుకట్టుకుని నిలబడ్డాను. స్వామివారు నాతో, “వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వు రుచిగా బాగా చేశావు. వాళ్ల కడుపు నింపావు” అని అన్నారు. నేను స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసాను. నన్ను చెయ్యెత్తి ఆశీర్వదించారు స్వామివారు. 


”ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు రామనామం జపించు” అని చెప్పి నన్ను ఆశీర్వదించినప్పుడు సమయం రాత్రి ఒంటి గంట అయ్యింది.


--- యస్. బలరామ రావు, మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1



*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।*

🙏🌻🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻🙏

కామెంట్‌లు లేవు: