2, అక్టోబర్ 2021, శనివారం

ధ్వజస్తంభం

 *ధ్వజస్తంభం అనే పేరు ఎందుకు వచ్చింది ? మనం తెలుసుకోవలసిన విషయం*


***


ప్రతిరోజూ మనం మయూరధ్వజుడ్ని చూస్తుంటాము.  

కానీ అతను ఎవరో చాలామందికి తెలియదు.  

అతడి ప్రాశస్త్యం తెలియదు. అలాంటి వారికోసం ఈ కథ.


కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు సింహాసనం అధిష్టిస్తాడు. ఆ ఆనందం లో గొప్ప దాతగా పేరు తెచ్చుకోవాలని తలచి విరివిగా దానధర్మాలు చేస్తుంటాడు. శ్రీకృష్ణుడు ధర్మజునికి దాతృత్వం అంటే ఎలా ఉంటుందో పాఠం చెప్పాలని భావించి అశ్వమేధయాగం చేసి శత్రురాజులను ఓడించి సామ్రాజ్య విస్తరణ చెయ్యమని 

సలహా ఇస్తాడు. ధర్మరాజు అంగీకరించి అశ్వమేధయాగం చేసి యాగాశ్వాన్ని దేశం మీదకి పంపిస్తాడు. దాని వెంట నకుల సహదేవులను సేనలతో సహా పంపిస్తాడు.  

ఏ రాజు అయితే అశ్వాన్ని బంధిస్తాడో ఆ రాజును ఓడించి రాజ్యం వశపరుచుకోవడం ఈ యాగం యొక్క లక్ష్యం.  

అలాకాకుండా అశ్వం ఒక రాజ్యం లోకి ప్రవేశించగానే 

ఆ రాజు లొంగి పోయి సామంతానికి ఒప్పుకుంటే 

పేచీయే లేదు.


ఆ విధంగా ఆ అశ్వం మణిపుర రాజ్యం చేరుతుంది.  

ఆ రాజ్య అధినేత మయూరధ్వజుడు. గొప్ప బలశాలి.  

అతని కుమారుడు తామ్రధ్వజుడు మరింత గొప్ప 

పరాక్రమవంతుడు. తామ్రధ్వజుడు యాగాశ్వాన్ని 

బంధిస్తాడు. అతనితో యుద్ధం చేసిన నకుల సహదేవులు ఓడిపోయారు. వెంటనే భీమార్జునులు కూడా వచ్చి 

యుద్ధం చేస్తారు. వారిని కూడా ఓడించి బంధిస్తాడు 

తామ్రధ్వజుడు.


దాంతో మయూరధ్వజుడు ని యుద్ధం లో ఓడించడం కష్టమని గ్రహించిన శ్రీకృష్ణుడు ధర్మరాజు తో కలిసి మాయోపాయంతో మయూరధ్వజుని ఓడించాలని వృద్ధ బ్రాహ్మణుల వేషాల్లో మణిపురం వెళ్తారు. "దానం కావాలి" అని అడుగుతాడు శ్రీకృష్ణుడు. "ఏమి కావాలో కోరుకోండి విప్రోత్తములారా" అడుగుతాడు మయూరధ్వజుడు.


"మహారాజా... మేము నీ దర్శనం కోరి వస్తుండగా అడవిలో ఒక సింహం ఈ బ్రాహ్మణుని సుతుడిని పట్టుకుని చంపపోయింది. బాలుడిని వదలమని మేము ప్రార్ధించగా మయూరధ్వజుని శరీరం లో సగభాగం కోసి తెచ్చినట్లయితే 

ఈ బాలుడిని విడిచిపెడతాను అన్నది. కనుక మీ శరీరంలో సగభాగం కావాలి. అది కూడా నీ భార్యా పిల్లలే నీ శరీరాన్ని కోసి ఇవ్వాలి" అన్నాడు శ్రీకృష్ణుడు.


మయూరధ్వజుడు చిరునవ్వు నవ్వి "అలాగే విప్రులారా" అని పడుకుని తనను రెండు భాగాలుగా కొయ్యమని భార్యను, తామ్రధ్వజుడ్ని ఆదేశిస్తాడు. ఆ మాట విని ధర్మజుడు అతని దానగుణానికి నివ్వెరపోయాడు. భార్య కొడుకు తన శరీరాన్ని ఖండిస్తుండగా మయూరధ్వజుని ఎడమ కంటినుంచి నీరు కారింది. వెంటనే శ్రీకృష్ణుడు "నువ్వు బాధపడుతూ దానం చేస్తున్నావు. కనుక మాకు వద్దు" అన్నాడు.


అందుకు మయూరధ్వజుడు "మహానుభావా... అది బాధ కాదు. కుడి వైపు శరీరం దానానికి ఉపయోగపడుతున్నది. నాకు ఆ అదృష్టం లేదు అని ఎడమ వైపు శరీరం బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అన్నాడు.


మయూరధ్వజుడి త్యాగానికి, దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు, ధర్మజుడు తమ నిజరూపాలను చూపించి మయూరధ్వజుడ్ని అనుగ్రహించారు. "మయూరధ్వజా.. 

నీ దానగుణం నిరుపమానం. ఏదైనా వరం కోరుకో"  

అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు మయూరధ్వజుడు 

"మహాత్మా. నా శరీరం నశించినా సరే.. నా ఆత్మ 

పరోపకారార్ధం ఉపయోగపడేలా అనునిత్యం నీ ముందు 

ఉండేలా వరం ఇవ్వు" అంటాడు.


అప్పుడు శ్రీకృష్ణుడు "తధాస్తు...నేటినుంచి ప్రతి 

దేవాలయం ముందు నీపేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి.  

నిన్ను దర్శించి నీ చుట్టూ ప్రదక్షణం చేసిన తరువాతే 

భక్తులు తమ ఇష్టదైవాలను దర్శిస్తారు. అలాంటి భక్తుల 

కోరికలే నేను తీరుస్తాను. నీ ముందు దీపం వెలిగించిన 

తరువాతే నా ముందు దీపం వెలిగిస్తారు." అని వరం 

ఇచ్చాడు.


గుడి లోకి వెళ్ళినపుడు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి, ప్రదక్షణలు చేసిన తరువాత చేసుకున్న దైవదర్శనమే నిజమైన దర్సనంగా అప్పటినుంచి ఆచారంగా స్ధిరపడ్డది. దేవుడు లేని దేవాలయం ఉండొచ్చు కానీ ధ్వజస్తంభం 

లేని దేవాలయం మాత్రం ఉండదు. ఇది జైమినీభారతం 

లోని గాథ.


@@@


ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?


ప్రజలసొమ్ము ను ఇష్టారాజ్యంగా దానధర్మాలకు ఉపయోగించకూడదు. కేవలం కీర్తికాంక్ష తో దానాలు చెయ్యకూడదు.


ఆడినమాట తప్పకూడదు. ప్రాణం పోతుందని తెలిసినా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి.


ఇలాంటి నీతి కథలు పిల్లలకు బోధిస్తే వారు విలువలు నేర్చుకుని వారి బుద్ధికుశలత ధ్వజస్తంభం లా నిటారుగా నిలబడుతుంది. ప్రతిఒక్కరూ పూజిస్తారు.

కామెంట్‌లు లేవు: