*2.10.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదియవ అధ్యాయము*
*లౌకిక - పారలౌకిక సౌఖ్యములన్నియును నిస్సారములు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*10.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*యద్యధర్మరతః సంగాదసతాం వాజితేంద్రియః|*
*కామాత్మా కృపణో లుబ్ధః స్త్రైణో భూతవిహింసకః॥12603॥*
*10.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*పశూనవిధినాఽఽలభ్య ప్రేతభూతగణాన్ యజన్|*
*నరకానవశో జంతుర్గత్వా యాత్యుల్బణం తమః॥12604॥*
మానవుడు దుష్టసాంగత్యము చేత అధర్మనిరతుడై, ఇంద్రియసుఖములకు వశుడై విశృంఖలముగా ప్రవర్తించును. ధనాశాపరుడై, లుబ్ధుడు, స్త్రీలోలుడు ఐన అతడు దుష్టజనుల ప్రోద్బలముచే విచక్షణ లేకుండా పశువులను హింసించుచుండును. భూతప్రేతములను ఉపాసించును. తాను చేసిన దుష్కర్మల ఫలితముగా ఘోరాంధకారమయమైన నరకమున ప్రవేశించును.
*10.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*కర్మాణి దుఃఖోదర్కాణి కుర్వన్ దేహేన తైః పునః|*
*దేహమాభజతే తత్ర కిం సుఖం మర్త్యధర్మిణః॥12605॥*
సకామకర్మలఫలము దుఃఖమే. దేహాత్మభావముగల జీవుడు అహంకారమమకారములలో తగుల్కొని, దుఃఖకారకములైన కర్మలను పదేపదే ఆచరించుచు మరల దేహమును (జన్మము) పొందుచుండును. అట్లు జననమరణ చక్రములో పరిభ్రమించుచుండువానికి (మరణశీలునకు) ఇంక సుఖమెక్కడిది?
*10.30 (ముప్పదియవ శ్లోకము)*
*లోకానాం లోకపాలానాం మద్భయం కల్పజీవినామ్|*
*బ్రహ్మణోఽపి భయం మత్తో ద్విపరార్ధపరాయుషః॥12606॥*
లోకములయొక్క లోకపాలురయొక్క ఆయుఃప్రమాణము కేవలము ఒక కల్పమువరకే పరిమితమైయుండును. వారును నాకు భయపడుచుందురు. బ్రహ్మయొక్క ఆయుఃప్రమాణము రెండుపరార్ధముల వరకే యుండును. అంత దీర్ఘాయువు గల ఆ బ్రహ్మదేవుడుగూడ నాకు భయపడు చుండును. ఇక సామాన్యమానవుల విషయము చెప్పనేల?
*10.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*గుణాః సృజంతి కర్మాణి గుణోఽనుసృజతే గుణాన్|*
*జీవస్తు గుణసంయుక్తో భుంక్తే కర్మఫలాన్యసౌ॥12607॥*
*10.32 (ముప్పది రెండవ శ్లోకము)*
*యావత్స్యాద్గుణవైషమ్యం తావన్నానాత్వమాత్మనః|*
*నానాత్వమాత్మనో యావత్పారతంత్ర్యం తదైవ హి॥12608॥*
సత్త్వరజస్తమోగుణములు ఇంద్రియములను కర్మలయందు ప్రేరేపించును.ఇంద్రియములు కర్మలను ఆచరించును. జీవుడు అజ్ఞానవశమున సత్త్వాది గుణములను, ఇంద్రియములను తన స్వరూపములుగా భావించును. తద్ద్వారా ఆ కర్మలతో సంబంధము ఏర్పడుటవలన సుఖదుఃఖములను అనుభవించును. గుణవైషమ్యము ఉన్నంతవఱకు (అనగా శరీరాదులయందు 'నేను, నాది' అను అభిమానము ఉన్నంత వఱకు) ఆత్మయొక్క ఏకత్వము అనుభవమునకు రాదు. నానాత్వభ్రమ తొలగిపోదు. అజ్ఞానమూలకమైన ఈ భ్రమ నివృత్తికానంతవరకు జీవుడు పరతంత్రుడే యగును.
*10.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*యావదస్యాస్వతంత్రత్వం తావదీశ్వరతో భయమ్|*
*య ఏతత్సముపాసీరంస్తే ముహ్యంతి శుచార్పితాః॥12609॥*
జీవుడు ఈ విధముగా పరతంత్రుడుగా ఉన్నంతవరకు పరమేశ్వరుడనైన నా వలన భయము ఉండియే తీరును. లేశమాత్రసుఖముగా కన్పించు అధికమైన సంసారభయమును నేను కల్పించుచునే యుందును. ఇట్లు గుణప్రేరితములైన కర్మలయందు నిరతుడగుటవలన జీవునకు శోకమోహములు ప్రాప్తించుచునేయుండును.
*10.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*కాల ఆత్మాగమో లోకః స్వభావో ధర్మ ఏవ చ|*
*ఇతి మాం బహుధా ప్రాహుర్గుణవ్యతికరే సతి॥12610॥*
ఉద్ధవా! మాయకు సంబంధించిన త్రిగుణములయందు సంక్షోభము ఏర్పడినప్పుడు వ్యావహారికముగా అది అనేక రూపములలో భాసిల్లును. కాలము, జీవుడు, వేదములు, లోకము, స్వభావము, ధర్మము - ఇవి అన్నియును నా స్వరూపములే. వీటియందు నానాత్వభావమును కలిగియుండక వీటిని అన్నింటిని నా రూపములుగనే చూడవలెను.
*ఉద్ధవ ఉవాచ*
*10.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*గుణేషు వర్తమానోఽపి దేహజేష్వనపావృతః|*
*గుణైర్న బధ్యతే దేహీ బధ్యతే వా కథం విభో॥12611॥*
*ఉద్ధవుడు పలికెను* ప్రభూ! ఈ జీవుడు దేహమునుండి ఏర్పడిన త్రిగుణములయందు ఉన్నప్పటికిని అతడు వాటినుండి ముక్తుడై జీవనమును ఎట్లు కొనసాగింపగలడు? గుణములచే బాధితుడు కాకుండ ఎట్లుండును? గుణములచే బద్ధుడు ఐనవాడు ఎట్లుండును?
*10.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*కథం వర్తేత విహరేత్కైర్వా జ్ఞాయేత లక్షణైః|*
*కిం భుంజీతోఽత విసృజేచ్ఛయీతాసీత యాతి వా॥12612॥*
బద్ధుడు లేక ముక్తుడు ఐన పురుషుడు ఎట్లు ప్రవర్తించును? ఎట్లు సంచరించును? ఏ లక్షణములను బట్టి అతనిని గుర్తింపవచ్చును? అతడు ఎట్లు భుజించును? మలమూత్రాదులను ఎట్లు త్యజించును? ఎట్లు శయనించును? ఎట్లు కూర్చుండును? ఎట్లు నడచును?
*10.37 (ముప్పది ఏ శ్లోకము)*
*ఏతదచ్యుత మే బ్రూహి ప్రశ్నం ప్రశ్నవిదాం వర|*
*నిత్యముక్తో నిత్యబద్ధః ఏక ఏవేతి మే భ్రమః॥12613॥*
అచ్యుతా! ఈ ప్రశ్నల ఆంతర్యమును ఎరిగిన సమర్థుడవు నీవు. ఒకే ఆత్మ నిత్యబద్ధమెట్లగును? నిత్యముక్తమెట్లగును? ఈ విషయమున నేను భ్రమపడుచున్నాను. కావున వీటిని విశదపరచి నా భ్రమను తొలగింపుము.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే దశమోఽధ్యాయః (10)*
ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *లౌకిక - పారలౌకిక సుఖములన్నియును నిస్సారములు* అను పదియవ అధ్యాయము (10)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి