7, జూన్ 2022, మంగళవారం

ఓం సహనా వవతు

 *పూర్వం గురుశిష్యులు చెప్పుకునే మంత్రం.!*


*ఈ మధ్య ఎక్కడ మనం వినడం -చూడటంలేదు..*


ఓం సహనా వవతు

సహనౌ భునక్తు

సహవీర్యం కరవావహై

తేజస్వినావధీతమస్తు

మా విద్విషావహై

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః


పాఠం చెప్పుకునే ముందు గురుశిష్యులు చెప్పుకునే శాంతిమంత్రమిది. 


భగవంతుడు మన ఇద్దరినీ రక్షించుగాక. 

మన ఇద్దరినీ వృద్ధి చేయుగాక. 

ఈ అధ్యయనానికి అవసరమైన శక్తి మన ఇద్దరికీ అబ్బునుగాక. 

మనం చదివేది మన ఇద్దరికీ వెలుగుని ఆపాదించు గాక. మన మధ్యలో విభేదాలు తలయెత్తకుండు గాక. 

టూకీగా ఇదీ అర్ధం.


*భావము.*


ఈశ్వరుడు మనల నిరువురుని రక్షించుగాక. 

అతడు మనల నిరువురను పోషించుగాక.  

మనము గొప్ప శక్తి తో(దివ్య బలముతో) కలసి 

పని చేయుదుముగాక. 

అధ్యయనము చే మనమిరువురమును 

మేథా సంపదను పొందుదుము గాక! 

           

మనమితరులను ద్వేషింపకుందుము గాక. 

శాంతి, శాంతి, శాంతి సర్వత్ర ఉండుగాక.  

(ఈ వైదిక ప్రార్థన ప్రేమ సౌభ్రాబ్రత్వము,  పరస్పరావగాహన ,శాంతి సామరస్యము అను ఉదారములైన ఆశయములను ప్రకటించును. )


*వివరణ:.💐*


పాఠం చెప్పుకునే ముందు గురుశిష్యులు చెప్పుకునే శాంతిమంత్రమిది. 

భగవంతుడు మన ఇద్దరినీ రక్షించుగాక. మన ఇద్దరినీ వృద్ధి చేయుగాక. ఈ అధ్యయనానికి అవసరమైన శక్తి మన ఇద్దరికీ అబ్బునుగాక. మనం చదివేది మన ఇద్దరికీ వెలుగుని ఆపాదించు గాక. మన మధ్యలో విభేదాలు తలయెత్తకుండు గాక. 

టూకీగా ఇదీ అర్ధం.


పాఠం, అధ్యయనం మాత్రమే కాదు, 

ఏ ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకునే సందర్భమైనా ఈ ప్రార్ధన సముచితమే కాక, 

ఇప్పటి రోజుల్లో అయితే మరీ అవసరం కూడాను. ఆధునిక జీవితంలో మనుషుల మధ్య సంబంధాలు ఎలాగైనాయంటే - 

నేను చెబితే నువ్వు వినాలి, 

నేను గెలిస్తే నువ్వు ఓడాలి, 

నాది పైచెయ్యి నీది కింది చెయ్యి, 

నేను అంటాను నువ్వు పడు. 

ఉద్యోగ వ్యాపారాల్లోను, స్నేహాల్లోను, 

ఇంట్లో మనుషుల్తోను ఇదే తంతు. 


తరవాత్తరవాత కాలం కొంచెం మారింది. 

కొత్త ఆలోచనలు బయల్దేరినై. 

వాణిజ్య లావాదేవీల్లోను, ఉద్యోగ శిక్షణల్లోను, 

మానవ సంబంధాల్లోను - Win win mentality, 

Active listening, Empathetic listening 

వంటి concepts ప్రాచుర్యం పొందుతూ వచ్చాయి. 


పూర్వకాలంలో నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని సామెత. 

కానీ ఎంతటి వాడికైనా ఎల్లవేళలా నోరు అంతమంచిగా పెట్టుకోవడం సాధ్యమా? 

ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటేనే ఇన్నేసి విభేదాలు తలెత్తుతున్నాయే, మరింక ప్రత్యక్షంగా కాకుండా ఫోన్‌లలో, ఈమెయిళ్లలో, మెసేజుల్లో, బ్లాగుల్లో .. ఎలా సాధ్యం? 

మన మనసులో ఏ దురుద్దేశం లేకపోయినా అవతల వినే వ్యక్తికి మనమాటలో ఏ విరుపు వినబడుతుందో, మనరాతలో ఏ వగరు కనబడుతుందో?


అప్పుడే అనిపిస్తుంది, 

ఈ మంత్రం ఇప్పటి జీవితంలో మరీ అవసరమని. మంత్రాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. 

మంత్రార్ధాన్ని మననం చేసుకోండి. 

ఆ అర్ధాన్ని ధ్యానం చెయ్యండి. 

మంచి జరగాలి అనుకుని ఊరుకోవడం కాదు - 

చెడు జరగకూడదని స్పష్టంగా వ్యక్తపరచడం ఎంత గొప్ప ఆలోచన అది. 

మనిద్దరం కేవలం బాగుండాలి అని కోరుకోవడమే కాదు. వృద్ధి పొందాలి. 

ఎదురుగా ఉన్న పని తేలికైనది కాదు, 

దాన్ని సాధించగలిగే శక్తి మాకు కలగాలి. 

అటుపైన ఆ చేసిన పని మా యిద్దరికీ వెలుగునివ్వాలి. నాకు నేను ఏమి కోరుకుంటున్నానో, 

నా ఎదురుగా ఉన్న వ్యక్తికికూడా మనస్పూర్తిగా అదే కోరుకుంటున్నాను. 

అంతరాంతరాల్లో ఈ నిజాన్ని పూర్తిగా జీర్ణించుకుంటే 

స్వ-పర భేదం మాయమవుతుంది. 

త్వమేవాహం. 

ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః


*సర్వే జనా సుఖినోభవంతు..!!

కామెంట్‌లు లేవు: