7, జూన్ 2022, మంగళవారం

గుండె - గంధం

 గుండె - గంధం


1959లో పరమాచార్య స్వామివారు మద్రాసు దగ్గర్లోని నజరత్ పేట్ లో మకాం చేస్తున్నారు. పూజకు గంధం కావాల్సిరావడంతో కైంకర్యం వాళ్ళల్లోని రామమూర్తి అనే అతణ్ణి పిలిచి గంధం తీయమన్నారు. అప్పటికప్పుడు పూజకు సరిపడా గంధం అరగదీసి స్వామివారికి ఇచ్చాడు.  


రామమూర్తి సాయింత్రం సమయంలో గుండెల్లో కొద్దిగా భారంగా తోచి వెంటనే డాక్టరు వద్దకు పరిగెత్తాడు. “డాక్టరు గారు నాకు గుండెల్లో ఏదో ఇబ్బందిగా, భారంగా ఉంది. ఉదయం నుండి బాగానే ఉంది. పరమాచార్య స్వామివారి కైంకర్యంలో భాగంగా ఈరోజు గంధం కావాలంటే అరగదీసి ఇచ్చాను. సాయింత్రం నుండి కాస్త ఇబ్బందిగా తోస్తోంది” అని చెప్పాడు. 


డాక్టరు గారు అతణ్ణి పరీక్ష చేసి అతనితో, ”నీ గుండె చలా బలహీనంగా ఉంది. పెద్ద పెద్ద బరువులు మోయడము, ఒత్తిడి ఉన్న పనులు చేయడము మానుకోవాలి. ముఖ్యంగా గంధం తీయడం వంటి పనులు అస్సలు చేయకూడదు” అని అన్నారు.


రామమూర్తి డాక్టరు వద్ద నుండి తిరిగొచ్చి మహాస్వామి వారితో తన ఆరోగ్య పరిస్థితి గురించి, జరిగిన విషయమంతా చెప్పాడు. రేపటి పూజకు కూడా గంధం అవసరం ఉండడంతో స్వామివారు మరలా అతణ్ణే పిలిచి గంధం తీయమన్నారు. 


మహాస్వామివారు అతనితో, “అంతా చంద్రమౌళీశ్వరుడు చూసుకుంటాడు. నువ్వు గంధం అరగదీసి ఇవ్వు” అని ఆజ్ఞాపించారు. 


పరమాచార్య స్వామివారి మాటలను కాదనలేక రామమూర్తి గంధం తీసి ఇచ్చాడు. మరలా అతనికి గుండెల్లో ఇబ్బందిగా అనిపించి మహాస్వామి వారితో డాక్టరు తనకు చెప్పిన విషయం చెప్పాడు. 


”అది గుండేపోటు అయితే మాత్రమే ప్రమాదమైనది. గుండె బలహీనంగా ఉన్నవారు శతాయుష్కులై జీవించారు. నీ పని నువ్వు చెయ్యి. దిగులు పడవద్దు” అని అనునయించారు. 


ఇవి సాక్షాత్ భగవంతుని పలుకులు కదా? 


అప్పటి నుండి చాలాకాలం పూజకై స్వామివారికి గంధం తీసి సమర్పించే భాగ్యం రామమూర్తికి దక్కింది. కాని మరలా ఎప్పుడూ తనకి అలా ఇబ్బంది కలగనేలేదు.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: