దశోపనిషత్తులలో ఋగ్వేదానికి సంబంధించిన 'ఐతరేయోపనిషత్తు'లో బోధింపబడిన సాధనా 'ప్రజ్ఞానం బ్రహ్మ' అనే మహావాక్యాన్ని 'సాధనావాక్యం' అని అంటారు.
ఈ సృష్టిలోని అన్ని ప్రాణులలో మానవుడు శ్రేష్ఠుడు ఎందుకు అయ్యాడంటే దానికి కారణం అతనిలోని ప్రజ్ఞయే. మానవులందరిలోని ప్రజ్ఞ భగవంతుని ప్రసాదమే. ఈ విషయాన్ని ఎవరు మరచిపోతారో వారిలో గర్వం మొలకెత్తి అది అహంకారానికి దారితీస్తుంది.
మనందరిలోని తెలివితేటలకు మూలకారణం భగవంతుడు మనకు ప్రసాదించిన 'ప్రజ్ఞయే'. భగవంతుడు మనకు ప్రసాదించిన ప్రజ్ఞతో మనలోని భగవంతుని తెలుసుకుంటేనే మనకు శాంతి. అలా కాక మనలోని ప్రజ్ఞ బహిర్ముఖమై ఎంత ఎదిగినా, ఎన్ని విజయాలు సాధించినా మనిషికి శాంతి లేదు.
మానవ శరీరంలో ఎన్ని భాగాలున్నా అన్నింటికి మించినది ప్రజ్ఞ. అసలీ ప్రపంచం నడుస్తున్నది ప్రజ్ఞతోనే. ప్రజ్ఞావంతుడే బలవంతుడు, ఉన్నతుడు. ప్రజ్ఞను దుర్వినియోగం చేస్తే చేజేతులా మన మనుగడను మనమే ప్రశ్నార్థకం చేసుకున్నవారమౌతాము. గనుక గొప్పదైన, శక్తివంతమైన ప్రజ్ఞతో భగవంతుని తెలుసుకొనమని మన ఋషులు ఉపనిషత్తులద్వారా మనకు ప్రబోధం చేస్తున్నారు.
స్వామి సత్యాత్మానంద,
చిన్మయమిషన్, ఒంగోలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి