2, జులై 2024, మంగళవారం

యోగినీ ఏకాదశి వ్రతం

 *నేటి యోగినీ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి...?*


*యోగినీ ఏకాదశి..!*





ఈ యోగినీ ఏకాదశి గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. హిందూ మతంలో, ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున ఉపవాసం పాటించి, నియమ నిబంధనలకు అనుగుణంగా పూజలు చేయడం ద్వారా అన్ని రకాల పాపాల నుండి ,జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతారని చెబుతారు. భక్తులు ఉపవాసం పాటించి, జీవితంలో సకల సంతోషాలు, సంపదలు మరియు శ్రేయస్సు పొందగలిగే ఈ పవిత్రమైన రోజున విష్ణువును పూజిస్తారు.ఈ ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను స్కాంద పురాణంలో కూడా చెప్పబడింది. 


యోగినీ ఏకాదశిపై పురాణ కథ

కుబేరుడు పరమ శివభక్తుడు. నిత్యం శివార్చన సాగించనిదే రోజు గడిచేది కాదు. తన పూజ కోసం కావల్సిన పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు. హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు. తనకు అప్పగించిన పనిని హేమమాలి పరమ నిష్టతో ఆచరించేవాడు. హేమమాలికి, స్వరూపవతి అనే యక్షిణితో వివాహం జరిగింది. ఆమె సౌందర్యారాధనలో మునిగిపోయి ఉన్న హేమమాలి ఒకనాడు కుబేరుని శివారాధన గురించే మర్చిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఉన్న కుబేరుడు ఎంతకీ పుష్పాలు తీసుకు రాకపోయేసరికి అసహనం కలిగింది. హేమమాలి ఎందుకు రాలేదో కనుక్కుని రమ్మంటూ సేవకులను ఆదేశించాడు. తిరిగొచ్చి సేవకుడు చెప్పిన మాటలను విన్న కుబేరుని అసహనం కాస్తా క్రోధంగా మారిపోయింది. తక్షణమే హేమమాలిని తీసుకురమ్మని ఆదేశించాడు కుబేరుడు.















*కుబేరుడి శాపం*

నీ శరీరం మీద మోహంతో, మనసు సైతం మలినమైపోయింది. అందుకు ప్రతిఫలంగా కుష్టు వ్యాధిగ్రస్తుడవై భార్యకు దూరంగా భూలోకంలో జీవించు అని శపించాడు. కుబేరుని మాటలకు హేమమాలి గుండెపగిలిపోయింది. తొలి తప్పుని మన్నించమంటూ తన స్వామిని ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. ఇన్నాళ్లుగా శివారాధనలో పాల్గొన్న పుణ్యఫలంవల్ల హేమమాలికి మార్కండేయ రుషి ఆశ్రమం కనిపించింది. జరిగిన విషయం మొత్తం రుషికి వివరించి శాపవిమోచనం చెప్పమని అర్థించాడు. యోగినీ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే నువ్వు శాపవిమోచనాన్ని పొందుతావని సెలవిచ్చారు మార్కండేయ రుషి. అలా జ్యేష్ఠబహుళ ఏకాదశినాడు వచ్చే యోగినీ ఏకాదశి రోజున ఉపవాసమాచరించి మనసులో దైవాన్ని ప్రార్థించి శాపవిమోచనాన్ని సాధించాడు హేమమాలి. 


ఎవరైతే యోగినీ ఏకాదశినాడు ఉపవాసాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారో వారు పాపకర్మల నుంచి విమోచనం పొందుతారని శ్రీ కృష్ణుడు వివరించాడు. హేమమాలి వృత్తాంతం కేవలం ఒక గాథ మాత్రమే కాదు. జీవికి తన శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని విడనాడాలన్న హెచ్చరిక కూడా. అందుకే శరీరం, మనసుని అదుపుచేసుకునేందుకు ఉపవాసాలు, పూజలు, వ్రతాలు. యోగినీ ఏకాదశి రోజున తెల్లవారుజామునే స్నానమాచరించి శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి ఘడియలు పూర్తయ్యేలోగా దానధర్మాలు చేసి భోజనం చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యం, ఆనందంతో పాటూ ఇంట్లో సానుకూల శక్తి, వుంటుంది అని పురాణాలు చెబుతున్నాయి.


ప్రయోజనాలు

యోగిని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన అన్ని పాపాలను ప్రక్షాళన చేయవచ్చు మరియు ప్రస్తుత జీవితంలో అన్ని విలాసాలను అందిస్తుంది. యోగిని ఏకాదశి ఉపవాసం పాటించిన తర్వాత స్వర్గ లోకానికి చేరుకోవచ్చు. యోగినీ ఏకాదశి మూడు లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది. యోగినీ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం 88 వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టడంతో సమానమని నమ్ముతారు.

కామెంట్‌లు లేవు: