4, సెప్టెంబర్ 2024, బుధవారం

5. " మహా దర్శనము

 5. " మహా దర్శనము "--- ఐదవ భాగము---దర్శనమైనది


5. దర్శనమైనది 



         శ్రావణ శుద్ధ పౌర్ణమి , సోమవారము . దేవరాత దంపతులు పూర్ణమాస యాగమును చేసినారు . యజ్ఞేశ్వరుడు మూడు కుండములలో కూర్చొని ప్రసన్నముగా హవ్యమును స్వీకరించినాడు . దేవరాతునికి ఏదో ఒక విచిత్రమైన ప్రసన్నత వచ్చింది . గడచిన తొమ్మిది పది రోజులనుండీ , దినదినమూ , " ఈ దినము తప్పక సంయమము చేసి గర్భస్థ శిశువును మాటలాడించవలెను " అనుకుంటాడు . కానీ ఏదో దిగులు వంటి భయము . తనకన్నా ఉత్తములు అని మనసు ఒప్పుకొన్న వారి సమక్షమునకు పోవుటకు బెదరునట్లు , దేవరాతుడు ఏవో కుంటి సాకులను ముందుంచుకొని ఊరికే ఉంటాడు . ఈ దినము దృఢముగా నిర్ణయించుకున్నాడు . " ఏమైనా కానీ , ఈ రోజు మాట్లాడించియే తీరవలెను . ఇంకెన్ని దినములు ఊరకే ఉండవలెను ? ఇంకెన్ని దినములు ఊరకే ఉండేది ? ఊరకే ఉంటే , బిడ్డకు ఏమి చెప్పాలన్నది భార్యకు తెలియక ఆమే , ఆమె వలన తానూ , ఇద్దరూ కర్తవ్య భ్రష్ఠులవుతాము . అది సరియైనది కాదు . " అయినా బెదురు పోలేదు . సంయమము చేస్తేనేమి ? చేయకున్ననేమి ? అనే సంశయము ఇంకా ప్రబలముగా నున్ననూ , సంయమము చేసే తీరవలెనన్న సిద్ధాంతమే ప్రబలమైనది . చలితో ఒణుకుతున్ననూ , చన్నీరన్న భయమున్ననూ , స్నానము చేసే తీరవలెనన్న హఠముతో , నీటిలోనికి దిగు వైదీక బ్రాహ్మణుని వలె అతడు కూడా సంయమానికి సిద్ధుడైనాడు . 


        పగలు గడచి సాయంత్రమైనది . స్నానమయినది , సంధ్యాకర్మ కూడా అయినది . అగ్నిహోత్రమయినది , ఫలహారమయినది . అప్పుడు దేవరాతుడు భార్యను పిలచి , " ఈ దినము ఇంటి పనులను వేగిరముగా ముగించుకో , వేరే పనిఉన్నది " అన్నాడు . ఆమె , " అటులనే , నాకు కూడా పొద్దుటి నుంచీ గిలకలా తిరుగుతూ పని చేసి , ఒళ్ళంతా పండినట్లైనది . మీ ఆజ్ఞ నాకు కూడా అనుకూలమే . ఎప్పుడెపుడు శయ్యపై వాలుదామా అన్నట్లుంది , అటులనే " అని , ఆత్రముగా చేతికి దొరికిన పనిని చేస్తున్నది . అంతలోనే దేవరాతుడు మళ్ళీ వచ్చి , ’ ఆతరపడి భోజనము వదిలేస్తావేమో , ఒద్దొద్దు , రెండు ప్రాణాల దానవు , " అంటాడు . ఆమె నవ్వుతూ , " మీ అనుజ్ఞ అయినాక ఇంకేమి ? ఏదో ఫలహారము చేసి రెండు అరటి పళ్ళుతిని , పాలు మాత్రమే తాగాలనుకున్నాను , ఇప్పుడు ఏకంగా భోజనమే చేసి , పళ్ళూ పాలూ స్వీకరించి వస్తాను " అని తన పనిలో తాను నిమగ్నమైంది .  . 


         దేవరాతుడు శయ్యా గృహములో భార్యకై వేచియున్నాడు . ఆమె కూడా వేగిరమే వచ్చినది . ఈ దినము భర్తకు తాంబూలపు ఉపచారము లేదు కాబట్టి , తాను వచ్చేటప్పుడే తాంబూలము వేసుకొనే వచ్చినది . తాను పడుకొనే వరకూ ఆమె పడుకోదని , దేవరాతుడు మంచానికి అడ్డము పడినాడు . " ఆమె పడుకోనీ , నిద్ర పోనీ , సుమారు అర్ధరాత్రికి సంయమము చేయవలెను " అనుకున్న దేవరాతునికి భార్య పరుండినపుడైతే మెలకువ ఉండినది , ఇంకో ఘడియలోపలే ఆమెకన్నా ఎక్కువగా గాఢనిద్రలోకి జారిపోయినాడు . 


        సుమారు మూడవ ఝాము . దానిలో కూడా సగము గడచినది . అప్పుడు దేవరాతునికి ఒక స్వప్నము . ఆ కలలో దేవరాతుడు అగ్నిగృహము నుండీ వచ్చి బచ్చలి ఇంటికి వెళ్ళి కాలూ చెయ్యీ కడుక్కుని వచ్చి శుద్ధాచమనము చేస్తున్నాడు . ఎవరో ముఖద్వారము నుండీ లోపలికి వచ్చి , " ఆచార్యా , అభివాదయే ! " అంటున్నారు . నోటిమాటకు తగ్గట్టుగా అభివాదము కూడా చేసినారు . వారిని  , " ఆయుష్మాన్ భో విధి " అని ఆశీర్వాదము చేయవలెను . అయితే వారి పేరు తెలియదు . కాబట్టి పేరు చెప్పవలసిన చోట ఏదో శక్తి వలన ప్రేరితుడై , తాను ఏమి చేయుచున్నానన్న దానిపై గమనమే లేకుండా , ’ యాజ్ఞవల్క్య విధి ’ అంటాడు . ఇతడు , ’ ఇదేమి నేను ఇలా చేసితిని ’ అనుకొనేలోపలే , ఆ అభివాదకుడు " తమరు చెప్పినది సరిగ్గానే ఉన్నది . అదే నా పేరు కానివ్వండి . నామ రూపములు సత్యము కాదు అని తెలిసినప్పుడు , వ్యవహారమునకు ఏ పేరైతేనేమి ? " అని నవ్వుతాడు . దేవరాతుడికి , ’ ఇతడేనేమో మా కడుపున వచ్చి పుట్టి మా పుత్రుడగువాడు ? ’ అని తోచినది . ఎవరో , ’ అవును , ఇతడే ! మొదట నమస్కారము చేయి . ఆ తేజస్సు చూచినావా ? యజ్ఞేశ్వరుని వలె ప్రకాశిస్తున్నాడు . ’ అంటారు . దేవరాతునికి బుడిలుడు చెప్పినది జ్ఞాపకమునకు వచ్చి , అతనికి మనసా నమస్కరిస్తాడు . ఆగంతకుడు అది తెలుసుకొని , ’ ఎంతైనా నేను మీ కొడుకుని . నాకెందుకు నమస్కారము ? మీ జ్యోతి వలన ప్రయోజనమును పొందుటకు వచ్చినవాడను ’ అంటాడు . దేవరాతుడు , ’ మీరు ఎక్కడి నుండీ వచ్చినారు ? " అని అడగవలె ననుకుంటాడు . మాట నోటి నుండీ వెలువడుట కన్నా ముందే , అతడు దానిని తెలుసుకున్నవాడివలె , ’ నేనే చెప్పవలెనని యుంటిని , మీరే అడిగినది మంచిదే అయినది . ఇకపైన నన్ను ఏకవచనములో యాజ్ఞవల్క్య అనియే సంబోధించండి . తమ బిరుదు ’ యజ్ఞవల్క్య ’ అని ! తమరి పుత్రుడనని నాకు ఆ పేరు కానివ్వండి . నేను తపో లోకమునందు ఉంటిని . అక్కడ ఎవరూ నామ రూపములను అంతగా గౌరవించరు . ఒక దినము , నేను తమ దంపతుల దర్శనము చేసి , గర్భమును చేరితిని కదా , దానికి ముందే దేవతలూ , ఋషులూ , తమరి పితరులూ మా ఆశ్రమమునకు వచ్చి , ’ నువ్వు భూలోకమునకు వెళ్ళి రావలసియున్నది . ’ అన్నారు . ’ నేను అక్కడ ఎన్ని దినములు ఉండవలెను ? ’ అని అడిగితిని . దానికి వారు , ఒక పురుషమానము ఉండవలెను . అక్కడ విశ్వోద్ధారమునకు ఒక సంహిత , ఒక బ్రాహ్మణము , ఒక ఉపనిషత్తు యొక్క అవతారము కావలసియున్నది . దానికోసమై నువ్వక్కడికి వెళ్ళవలెను ’ అన్నారు . ’ నేను ఇక్కడ ఒక రూపములోనుండి , అక్కడ ఇంకొక రూపముతో ఉండవచ్చు కదా ? ’ అని నేను అడిగితిని . వారు , " కాదు , మహా విష్ణువు యొక్క ఆజ్ఞ అయిన దేమనగా నీ సంపూర్ణ తేజస్సుతో నువ్వు అక్కడ పుట్టవలెను అని ! అందుకే మేము ముగ్గురమూ వచ్చినాము ." అన్నారు . మహా విష్ణువు యొక్క ఆజ్ఞ అన్న తర్వాత ,నేను మారు మాట్లాడక ఒప్పుకున్నాను . "  


         దేవరాతునికి ఈ వేళకు అతడి సామీప్యము వలన పరిచయము బలమై మాటలాడుటకు ధైర్యము వచ్చినది . " ఆ దినము ఎందుకో ఆత్రాత్రముగా వచ్చుచుంటిరి ? " అని అడిగినాడు . " అవును , దానికీ కారణము ఉన్నది . మొదట మీరు నన్ను బహు వచనములో సంబోధించుట మానవలెను . నేను , ఆరు నెలలు నిండినాయి , గర్భము పెరిగినది , అనుకొని వచ్చినాను . తపోలోకమున మేము పున్నమి నుండీ పున్నమికి లెక్క వేసుకుంటే , మీరు అమావాశ్య నుండీ అమావాశ్యకు లెక్క వేసెదరు . దానివలన పదునైదు దినములు వెనుక ముందు అయినది . దానివలన మీకేమీ ఇబ్బంది కాలేదు కదా ? నేను అటుల అకాలము నందు వచ్చినందు వలన మీతో మాట్లాడుటకు  మరలా తమరింటిలో సీమంతము జరుగు వరకూ వేచి ఉండవలసి వచ్చినది . ఆ దినము  తమరి పితృ పితామహులు నాతో పాటు వచ్చి నన్ను అనుగ్రహించినారు . ఆదినము ఆ వృద్ధులొకరు మమ్ములను చూచినారు . వారు మీ తండ్రిగారి స్నేహితులని తెలుస్తున్నది . వారుకూడా ’ నీపేరేమి ? ’ అని అడుగవలె ననుకొను లోపల మేము అంతర్థానమైతిమి . మీకది తెలిసియే ఉండవలెను . " 


దేవరాతుడు , " ఔను ,ఔను . " అని తలాడించినాడు . 


        యాజ్ఞవల్క్యుడు కొనసాగించి అన్నాడు , " అప్పటినుండీ మీరు నన్ను చూడవలెనని సంయమము చేయుచుండినదీ నాకు తెలుసు . నేనే వచ్చి మిమ్ములను చూచుట విహితము  కానీ అప్పటికింకా గర్భము నందున్న పిండములో ప్రాణము  సరిగ్గా చేతికి దొరకునట్లే లేదు , అక్కడున్న కరణములూ నాడులూ ఇంకా సమాహితముగా లేనందు వలన , నేనే మీకు ఈ గడచిన పది రోజులుగా అవకాశము ఇవ్వలేదు . అది తప్పయినచో మన్నించవలెను . " 


" ఒక వేళ అలాగ సంయమము చేసినచో యేమయ్యెడిది ? " 


" ఈ పిండము సడలి , పడిపోయెడిది . ఇంకొక గర్భ కాలము వరకూ వేచి ఉండవలసి వచ్చేది . " 


         " మంచిది , ఇంకొక సంహిత , బ్రాహ్మణము , ఉపనిషత్తు లను లోకానికి ఇవ్వవలెనని జన్మమెత్తుతున్నావు కదా ! అంటే అప్పుడు వేదములు అయిదు అవుతాయా ? " 


        " లేదు , ఎప్పటికీ వేదములు నాలుగే ! బహుశః నేను తేబోయే వేదము ఇప్పటి యజుర్వేదములో చేరిపోయి ఇంకొక పేరుతో వ్యవహరింప బడవచ్చు . బ్రాహ్మణములోనే ఉపనిషత్తు ఉండటము వలన , వాటివలన ఎట్టి బాధా కలుగునట్లు లేదు . " 


" ఇటుల సంహిత , బ్రాహ్మణోపనిషత్తులను కరుణించు నీకు మేము ఎటువంటి శిక్షణను ఇవ్వవలెను ? " 


          యాజ్ఞవల్క్యుడు నవ్వి అన్నాడు , " ఈ జన్మము దేవకార్యార్థమై కలుగుతున్నది . అటులన్ననేమి ? అని మీ సంశయము !  ఈ జగత్తు , కాల -దేశములకు అంకితమై నడుస్తున్నది . కాలము ఎప్పుడునూ పాకము చేయు స్వభావము కలది . దాని పాకము వలన ప్రతియొక్క చేతనమూ తన తేజస్సులోనూ , సామర్థ్యములోనూ క్షీణతను చూడవచ్చును . వీణను శృతి చేసి వదలితే , మ్రోగించినా , మ్రోగించకున్నా శృతి తగ్గుట లేదూ ? అటుల ! అప్పుడు దేవతలు ఆ క్షీణతను తీసివేసి మరలా మొదటివలె చేయుదురు . ఇప్పుడు జగత్తు అటులనే క్షీణతను పొందియున్నది . అది వక్రమగులోపల దానిని సరితూకము చేయు సాధనము నొకదానిని సిద్ధము చేయవలెనని దేవతలు ఆలోచించి , ఆ పనికి నన్ను దర్విగా చేసుకున్నారు . కాబట్టి ఈ జన్మమును , లేదా కర్మ కరణమును సరిగ్గా ఉంచుకొనుట దేవతల పని . అదీగాక , ’ వయమగ్నేర్హి మానుషాః ’ అంటే మేము అగ్నిని నమ్ముకున్నవారము . అయినా మీరు అడిగినందుకు చెప్పెదను , మా కాబోయే తల్లికి మీరు ’ పూర్ణమదః పూర్ణమిదం ’ అను ఒక మంత్రమును నేర్పండి . ఆమె అదొక్క దానినే ప్రసవమగు వరకూ జపము చేస్తూ ఉండనీ , ఆ తర్వాత నన్ను తొట్లలో వేసినపుడు , దానితో పాటు ’ భద్రం కర్ణేభిః ’ మంత్రమును చెప్పితే చాలు . ఆమె మడి , మైల యను ఆలోచనలే లేకుండా , సర్వ కాలము లందూ ఈ మంత్రములను వీలయినంతగా పారాయణము చేస్తూ ఉండనీ . " 


         దేవరాతుడు తన సంశయము గురించి అడుగవచ్చునో లేదో అని మనసులో ఆలోచించాడు . యాజ్ఞవల్క్యుడు దానికి కూడా ఉత్తరము నిచ్చాడు , " తమరు , ’ నా పుత్రుడు బ్రహ్మవాదియై బ్రహ్మను ఎంచుకొని కర్మలను వదలివేస్తే ఏమి గతి ? ’ అని సంశయము పడ నవసరము లేదు . నేను అప్పుడే చెప్పితిని కదా , సంహిత , బ్రాహ్మణములను జగత్తుకు ఇచ్చుటలో కర్మముల నన్నిటినీ అద్దము వలె స్వచ్ఛ పరుస్తాను . ఈ కురు , పాంచాల , కాశీ , మద్ర దేశము లన్నిటిలోనూ తమరి కీర్తి గర్జించునట్లు చేస్తాను . ఆ పిమ్మట ఇంకా అవకాశమున్న , సన్యాసమును తీసుకొనెదను , సమ్మతమే కదా ? " 


         దేవరాతుడికి ఏమి చెప్పుటకూ మాట రాలేదు . కొడుకు చెప్పిన దాంట్లో అతనికి కొంచము కూడా సందేహము రాలేదు . సూర్యుడిని చూసినపుడు అతడు తేజోరాశి యనుదానికి ప్రమాణాంతరము ఏమీ అవసరము లేనట్టే , అతని మాటలలోనే స్వతహాగా ఏదో ప్రమాణమున్నట్లే అనిపించి , అతడిని అది ఒప్పించినది . 


         యాజ్ఞ వల్క్యుడు లేచి , ’ నేను వెళ్ళి వచ్చెదను , కాలాతీతమగుతున్నది . నేను చెప్పినది నిజము అనుటకు సాక్షిగా కార్తీక శుక్ల సప్తమి దినము నా జననమగును . అప్పుడు తప్పకుండా మేధా జననమును చేయండి . మిగిలినదంతా శాస్త్ర ప్రకారము జరగనివ్వండి . " అని చెప్పి అభివాదనము చేసినాడు . దేవరాతుడు కూడా వేదోక్తముగా కొడుకుకు ఆశీర్వాదము చేస్తుండగా , మంత్రము ముగిసే దానికన్నా ముందుగనే మెలకువ అయినది . మెలకువ అయినా కూడా మంత్రము తానే పలుకుతూ పూర్తి అయినది . 


        ఆలంబినీ దేవి కూడా ఆ మంత్ర శ్రవణము చేత మేలుకొని , ’ ఇదేమి ? పడక పై పరుండియే మంత్రమును చెప్పుతున్నారు , బాగున్నది వరస ! ’ అంది . 


        దేవరాతుడు నవ్వుతూ , " అంతా నీ పుత్రుని ప్రభావము ! " అని కల గురించి చెప్పినాడు . ఆమె , ’ అదేమిటి , కల అంటారు ? మీరు ఎవరితోనో మాట్లాడుచుండుట నాకు అర్థమయింది . అదంతా నేను కూడా విన్నాను కదా ? " అని ఆశ్చర్యపోయింది . 


          దేవరాతుడు , ’ నువ్వే ముఖ్యముగా ధన్యురాలవు . కృతార్థురాలవు . నీ పుణ్యము వలన ఈ ఇంటిలో ఇంకా ఏమేమో విచిత్రములు , నమ్మశక్యము గానివి , జరుగుతాయి . నిన్ను చేపట్టి నేను కూడా ధన్యుడనైనాను  అను కాలము వచ్చినది " అని విచిత్రమైన తృప్తి ధ్వనించు పలుకు పలికాడు . 


       ఆలంబిని , ’ ఆ ? ఇదేమి చమత్కారము ? మీ చేయి పట్టి మీవంటి విద్వాంసుల ఇల్లు చేరి నేను కృతార్థురాల నైనానని రాత్రింబవళ్ళూ అనుకుంటున్నాను . " అంది .


         దేవరాతుడు భార్యపై విశ్వాసముతో ఆమెను ఆలింగనము చేసుకొని ,"  బీజము ఎంత మంచిదైతేనేమి ? దానికి తగ్గట్టు సంపన్నమైన క్షేత్రము కూడా కావలెను ." అని చుంబించాడు . ఆమె కూడా భర్త యొక్క ఆ స్తుతినీ , మోహన కార్యమునూ వద్దనకుండా విశ్వాసముతో  స్వీకరించినది .

కామెంట్‌లు లేవు: