మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*అజ్ఞాతభక్తుని అన్నదానం..*
"శ్రీ స్వామివారి మందిరం వద్ద వచ్చేనెల మొదటివారం లో శ్రీ భరద్వాజ మాస్టారు గారు వ్రాసిన గురుచరిత్రను పారాయణం చేద్దామని మాష్టారుగారి శిష్యబృంద సభ్యులం నిర్ణయించుకున్నాము..సుమారు యాభై మందిమి వస్తాము..ఇబ్బందేమీ లేదు కదా?.." అని ఒంగోలు నుంచి శ్రీ శ్రీనివాస్ గారు ఫోన్ చేసి అడిగారు..
మందిరం వద్ద అన్ని ఏర్పాట్లూ చేస్తాను..నిరభ్యంతరంగా రండి అని చెప్పాను..
2012 వ సంవత్సరం మధ్యలో జరిగిన సంభాషణ ఇది..అనుకున్న విధంగానే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాష్టారు గారి శిష్యబృంద సభ్యులు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..గురుచరిత్ర పారాయణం పూర్తి చేసి..శ్రీ స్వామివారి సమాధిని దర్శనం చేసుకొని తిరిగి సాయంత్రానికి వెళ్లిపోయారు..వెళ్ళేముందు..శ్రీ స్వామివారి మందిరం వద్ద సామూహిక పారాయణానికి అనువైన వాతావరణం ఉన్నదని.. తమకు ఎంతో సంతోషం కలిగిందనీ చెప్పి మరీ వెళ్లారు..కార్యక్రమం సాఫీగా జరిగిపోయినందుకు మేమూ సంతోషించాము..
ఆ ప్రక్కరోజు ఉదయం ఒక సంఘటన జరిగింది..యాభై ఏళ్ళ పైబడిన మధ్యవయస్కుడు ఒకాయన వచ్చి.."ఏమండీ..నేను చాలా దూరం నుంచి వస్తున్నాను..నిన్న ఈ మందిరం లో గురుచరిత్ర పారాయణ జరిగిందట కదా..నిజానికి నేను కూడా పాల్గొని ఉండాల్సింది..కానీ నాకు కుదరలేదు..నా పేరు సీతారామారావు..గుంటూరు జిల్లా వాడిని..ఈరోజు శుక్రవారం కదా..ఈరోజు నుంచి మూడురోజుల పాటు ఇక్కడే వుండి.. నేనూ పారాయణం చేసుకుంటాను..మీకేమీ అభ్యంతరం లేదు కదా?.." అన్నాడు..
ఆయనను చూడడానికి నెమ్మదస్తుడు లా అనిపించాడు..ఆయన పాటికి ఆయన పారాయణం చేసుకోవడానికి ఇబ్బందేముంది?..ఎలాగూ అన్నదానం జరుగుతున్నది..ఆయన కొరకు ప్రత్యేకంగా చేయాల్సిన ఏర్పాట్లేవీ లేవు..అందువల్ల పెద్దగా ఆలోచించకుండా..సరే అన్నాను..ఒక గది ఆయనకు కేటాయించాము..ఆయన సంతోషపడి..స్నానం చేసి వచ్చి..శ్రీ స్వామివారి సమాధి ముందు నిలబడి నమస్కారం చేసుకొని..మంటపం లో ఓ మూల కూర్చొని పారాయణం చేసుకోసాగారు..ఆరోజు గడిచిపోయింది..ఆ ప్రక్కరోజు శనివారం తెల్లవారుఝామునే తయారైపోయి మంటపంలో పారాయణం మొదలుపెట్టారు..మేము మా పనులు మేము చేసుకుంటూ వారిని పెద్దగా పట్టించుకోలేదు..ఆయన ఆరోజు మధ్యాహ్నం భోజనం చేయలేదు..సాయంత్రం జరిగిన పల్లకీసేవ లో శ్రద్ధగా పాల్గొన్నారు..అన్నదాన సత్రానికి వెళ్లి..అన్నదానం జరిగే తీరును కూడా అత్యంత కుతూహలం తో పరిశీలించారు..
ఆదివారం ఉదయం నాలుగున్నరకు నేను మందిరం లోకి వెళ్ళేసరికి..ఆయన వచ్చి మంటపం లో నాకోసం వేచి చూస్తున్నారు..నన్ను చూడగానే..గబ గబా నా దగ్గరకు వచ్చి.."ప్రసాద్ గారూ..ఈరోజు నా పారాయణం పూర్తి అవుతుంది..పూర్తి కాగానే అన్నదానం చేయించాలని నా మనసుకు తోచింది..ఈరోజు మధ్యాహ్నం కూడా మీరు భక్తులందరికీ అన్నదానం చేస్తారట కదా?..ఆ ఖర్చు మొత్తం ఎంత అవుతుందో చెప్పండి..నేను ఇస్తాను.."అన్నారు..
నేను కొద్దిగా తటపటాయించాను..ఎందుకంటే..ఆయన వద్ద అంత మొత్తం ఉంటుందో లేదో తెలీదు..ఆమాటే ఆయనతో అన్నాను..ఎందుకనో ఫక్కున నవ్వారు.. నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది..ఇక తాత్సారం చేయకుండా ఖర్చు వివరాలు చెప్పాను..వెంటనే జేబులోంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టారు..ఒక్క మాట మాట్లాడకుండా వెనక్కు వెళ్లి పారాయణం లో కూర్చున్నారు..సరిగ్గా మధ్యాహ్నం అన్నదానం సమయానికి..ఆయన ఆ సత్రం దగ్గరకు వెళ్లి..తాను కూడా వడ్డన చేసి వచ్చారు..సాయంత్రం నాలుగు గంటలకు నా దగ్గరకు వచ్చి..అన్నదానానికి తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పి..ఊరికి వెళుతున్నాననీ చెప్పారు..ఆయన చిరునామా అడిగాను..నవ్వి.."మళ్లీ వచ్చి చెపుతాను.." అన్నారు..రూముకు వెళ్లొచ్చి చూపుతారేమో అని అనుకున్నాను..ఎదురుచూస్తూ వున్నాను..కొంచెం సేపటి తరువాత అర్ధం అయిందేమిటంటే..ఆయన..నేరుగా బస్ ఎక్కి వెళ్లిపోయారని..
ఈరోజు దాకా..ఆ సీతారామారావు గారి గురించి ఎటువంటి వివరాలూ తెలియలేదు..కేవలం అన్నదానం చేయడానికి వచ్చారేమో అనిపించింది..అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.. ఎవరో పిలిచినట్లు వచ్చి..పారాయణం చేసుకొని..అన్నదానం చేసి..ఏమీ చెప్పకుండా వెళ్ళేవాళ్ళు ఈరోజుల్లో ఎందరుంటారు?..అని..ఆ సీతారామారావు గారు ఏ ప్రాంతం వారో కానీ..ఈనాటికీ మాకు గుర్తువస్తూ వుంటారు..
సర్వం..
శ్రీ దత్తకృప.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి