11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

మధ్వనవమి

 హిందుతత్వ గురువులలో త్రిమూర్తులుగా పరిగణించబడే వారిలో మొదటి గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా రెండవ గురువైన శ్రీ రామానుజాచార్యుల వారు విష్టాద్వైత సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. ఈ గురువులలో మూడవ గురువు మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 


1317వ సంవత్సరం మాఘమాసం 9వ రోజున శ్రీ మధ్వాచార్యులు కర్ణాటకలోని శ్రీ అనంతేశ్వర ఆలయంలో తన శిష్యులకు ఐతరేయ ఉపనిషద్ భాష్యాన్ని బోధిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆయనపై పూలవర్షం కురిసింది. తర్వాత ఆ పూల కుప్పలో వెతికి చూడగా మధ్వాచార్యులు అదృశ్యమయ్యారు అని శిష్యులు తెలుసుకున్నారు. మధ్వాచార్యులు బదరీకాశ్రమంలో ప్రవేశించిన రోజుగా (మోక్షం పొందిన రోజు) పరిగణించబడుతున్న మాఘమాసంలో 9వ రోజును మధ్వనవమిగా జరుపుకుంటారు. హనుమంతుడు మరియు భీముని తర్వాత మధ్వాచార్యులను వాయు దేవుడి మూడవ అవతారంగా భావిస్తారు. 


మధ్వాచార్యులు కర్ణాటకలోని ఉడిపికి దగ్గరలో గల పజక అనే గ్రామంలో జన్మించారు. శ్రీ మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని లేదా ద్వంద్వ తత్వశాస్త్రాన్ని ప్రతిపాదించారు. ద్వైత సిద్దాంతం ప్రకారం విష్ణువు (పరమాత్మ) మరియు జీవులు (జీవాత్మ) రెండూ వేర్వేరు. మనం చూసే ప్రపంచం నిజమైనది. విష్ణువు మాత్రమే స్వతంత్ర వాస్తవికత. అన్ని జీవులు మరియు నిర్జీవులు విష్ణువుపై ఆధారపడి ఉంటాయి. జీవాత్మలు మరియు ప్రపంచం విష్ణువుపై ఆధారపడి ఉంటాయి మరియు విష్ణువు నుండి వేరుగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అద్వైత సిద్ధాంతానికి పూర్తి భిన్నంగా ద్వైత సిద్దాంతం ఉంటుంది.  


ద్వైత సిద్దాంతం ప్రకారం భక్తి ఒక్కటే మోక్షాన్ని పొందే సాధనం. సర్వసంగ పరిత్యాగం, భక్తి మరియు ప్రత్యక్ష జ్ఞానముతో భగవంతుని సేవించడం, ధ్యానం మోక్షప్రాప్తికి దారి తీస్తుంది. సాధకుడికి భగవంతుని దర్శనం కావాలంటే వేదాల అధ్యయనం, ఇంద్రియాలపై నియంత్రణ, వైరాగ్యం మరియు పరిపూర్ణ స్వీయ శరణాగతితో తనను తాను సిద్ధం చేసుకోవాలని ద్వైత సిద్దాంతం చెబుతుంది.  


శ్రీ మధ్వాచార్యులు ద్వైత సిద్దాంత ప్రతిపాదకులే కాకుండా ఒక సామాజిక మరియు మత సంస్కర్త కూడా. మోక్షం మార్గం అందరికీ తెరిచి ఉందని మరియు కొన్ని వర్ణాలకు లేదా పుట్టుకతో పరిమితం కాదని ప్రకటించారు. శ్రీ మధ్వాచార్యులు ప్రసిద్ధ ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని స్థాపించారు. మధ్వాచార్యుల బోధనలు చాలా మంది అనుచరులను ఆకర్షించాయి మరియు కర్ణాటకలో భాగవత లేదా భక్తి సంప్రదాయాలను పునరుద్ధరించాయి. మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి శ్రీ మధ్వాచార్యుల గురుపరంపరకు చెందిన వారు. 


: నాగరాజు మున్నూరు

కామెంట్‌లు లేవు: