16, జనవరి 2023, సోమవారం

పొంగల్ - మాట్టు పొంగల్

 పొంగల్ - మాట్టు పొంగల్


పరమాచార్య స్వామి దర్శనానికి న్యాయవాది చంద్రశేఖర్ ప్రతి భోగి రోజు వచ్చేవారు. అలాగే 1989లో మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, శ్రీమఠం గోశాల నిర్వాహకుడు చిన్న కాళీయన్ కూడా స్వామిదగ్గర నిలబడి ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నాడు. “అతనికి ఏమి కావాలో కనుక్కో?” అని శిష్యులను అడిగారు.


”ఎల్లుండి మాట్టు పొంగల్(కనుమ) పెరియవ. గోవుల కొమ్ములకు రంగులు వెయ్యాలి. వాటిని పూలదండలతో అలంకరించాలి. . .” అంటూ కాస్త నసుగుతూ ఇంకా చెప్పబోతుండగా, మహాస్వామివారే “ఓహ్ అలాగా అలాగైతే. అతని వద్ద ద్రవ్యం లేదా?” అని అడిగారు. కాళీయన్ అవునని తలూపాడు.


”ఎవరు వచ్చారు?” అని శిష్యులను అడిగారు స్వామివారు.


”తిరువారూర్ వచ్చారు” అని చెప్పారు.


న్యాయవాది చంద్రశేఖర్ తిరువారూర్ నుండి బయలుదేరుతున్నప్పుడు, అతని క్లైయింట్ ఒకరు స్టాంపు, కోర్టు ఖర్చులకు గాను ఇచ్చిన 4000 రూపాయలను అతని చేతిసంచిలో ఉంచుకొని కాంచీపురం బయలుదేరాడు. కేవలం తిరుగు ప్రాయాణానికి బస్సు చార్జీలకు సరిపడు డబ్బు ఉంచుకొని తక్కిన సొమ్ము మొత్తం కాళీయన్ కు ఇవ్వమని పరమాచార్య స్వామివారు ఆదేశించారు. ఆ డబ్బు తీసుకుని కాళీయన్ ను వెళ్లమన్నారు.


తరువాత స్వామివారు ఆ న్యాయవాదితో, “ప్రతి మాట్టు పొంగల్ కి శ్రీమఠానికి నీకు ఇవ్వగలిగినంత సొమ్ము తీసుకునిరా. అలాగే బెల్లం పొంగలి చేసుకొని వచ్చి మీ చేతులతోనే గోవులకు పెట్టండి” అని చెప్పారు. అతను అలాగే అని స్వామి వారి వద్దనుండి ప్రసాదం స్వీకరించి వెల్లిపోబోతుండగా, “తిరువారూర్ వెళ్ళిపొయాడా?” అని అడీగారు.


స్వామివారు మరలా వారిని పిలిపించి “బెల్లం పొంగలి ఎలా తయారు చేస్తారో తిరువారూర్ భార్యని అడగండి” అని శిష్యులను ఆదేశించారు. ఆమె తయారు చేసే విధానాన్ని చెబుతుండాగా, స్వామివారు అందుకొని “లేదు. లేదు. ఆవులకు పెట్టడం కోసం తయారు చేసేప్పుడు గోవుల నుండి వచ్చిన పదార్థాలను అందులో కలపకూడదు. అలా చేస్తే పాలిచ్చే ఆవు వట్టిపోతుంది” అని చెప్పారు.


ఇంకా ఇలా చెప్పారు, “అన్నాన్ని ఉడికించి, బెల్లం కరిగించి అవక్షేపాలు తొలగించాలి. ఆ అన్నాన్ని బెల్లాన్ని బాగా కలిపి గోవులకు తినిపించాలి”. పాలు, పెరుగు, నేయి, వెన్న - ఇవి ఏవి దానికి కలపకూడదు. వాటిని కలిపి పెడితే ఆవులు పాలు ఇవ్వవు. ”క్షేమంగా ఉండండి” అని స్వామివారు ఆ దంపతులను ఆశీర్వదించారు. ముగ్గురు అన్నదమ్ముల ఆ తిరువారూర్ కుటుంబం 1990 నుండి ప్రతి సంవత్సరము మాట్టు పొంగల్ రోజు పరమాచార్య స్వామివారు విధంగా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: