15, జనవరి 2023, ఆదివారం

సంక్రాంతి

 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

             *సంక్రాంతి పర్వము*

శా.

దుష్కర్మౌఘము భోగిమంటఁ బడుచున్ తోడ్తోడ నిఱ్ఱింకగా 

నిష్కామంబె మనోవిలాసమవగా నిత్యానందమయ్యెం దగన్ 

శుష్కాచారవిదూరధీరమతులై శోభించ భూవాసులున్ 

నిష్కర్షం జనె భోగి త్రోవ నిడుచున్ నేస్తమ్ము సంక్రాంతికిన్ 

సీ.

రంగవల్లులలోన లలన పేర్చిన గొబ్బి 

         రక్షణై నిలువ సంక్రాంతి వచ్చె 

హరిదాసుసంకీర్త నాలాపముల మ్రోల 

         గమకమ్ము నిండ సంక్రాంతి వచ్చె 

ఆలకొమ్ముల నిండ నలదు రంగులతోడ 

          లలితమై వెలుగు సంక్రాంతి వచ్చె

పొంగళ్ళు పొంగించ నంగనామణులెల్ల 

          కమనీయమైన సంక్రాంతి వచ్చె

తే.గీ. 

కూతురల్లుళ్ళు సంతుతో కోరి రాగ 

క్రొత్తజంటల వేడ్కలు కొసరి వచ్చె 

తెలుగు లోగిళ్ళ సంక్రాంతి తీర్చవచ్చె 

సంబరములెన్నొ గుమిగూడి సందడించ 

సీ.

ఆవుదూడల పిల్పు లార్తినిండిన మార్పు 

          రైతుబంధువె వేల్పు ప్రగతితాల్పు 

ఏడాది కృషి వెంట ఇంట జేరిన పంట 

          ఆరుగాలము కంట నంటి యుంట 

నందిరాజులబృంద మందెవేసి చంద 

          మందగించగ వంద వందనములు 

అన్నదాతలు వార లన్ని కాలములందు 

          నెన్న నౌనే చిన్న వెన్ని యైన 

తే.గీ.

మకరసంక్రాంతి వేళలో నికరమైన 

యుత్తరాయణ పర్వాన నుత్తముండు 

రైతు మారాజు రసరాజు రాజరాజు 

నతని కృపయె పర్వమ్ము గతియు మనకు 

*~శ్రీశర్మద*

కామెంట్‌లు లేవు: