నేనే బాలాజి
పరమాచార్య స్వామి వారు అప్పుడు మహారాష్ట్రలో మకాం చేస్తున్న కాలం. ఒక జమీందారు(సంపన్నుడైన భూస్వామి), స్వామి వారికి సౌకర్యవంతమైన విడిది కోసం వారి అవసరాలన్నీ జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆయన దగ్గర పనిచేసే ఒక సేవకుణ్ణి ఈ ఏర్పాట్లలో ఏమి లోపం రాకుండా స్వామివారి నిత్య అవసరాలు చూసుకోవడానికి ఉంచాడు.
ఆ యువకుని పేరు పవార్. ఆ యువకుడు స్వామివారు అక్కడున్నన్ని రోజులు స్వామి వారికి అనన్యమైన సేవ చేసాడు. పరమాచార్య స్వామి వారు ఆ యువకుని భక్తికి, సేవానిరతికి ఎంతో ఎంతో ప్రీతి చెందారు. అక్కడి విడిది ముగియ బోతుండగా, స్వామి వారు ఇక బయలుదేరవలసిన సమయంలో ఆ భూస్వామితో, “ఈ యువకుడిని నాతో తీసుకుని వెళ్ళనా?” అని అడిగారు. ఆ భూస్వామి చాలా సంతోషించాడు. అతని ఆనందానికి అవధులు లేవు. అతని దగ్గర పనిచేసే సేవకుడు, మహాస్వామి వారి వద్ద సేవకుడిగా ఉండబోతున్నాడు. పరమాచార్య స్వామి వారిని సేవించబోతున్నాడు.
వెంటనే ఆ భూస్వామి, “సంతోషంగా మీతో తీసుకుని వెళ్ళండి. అతని కుంటుంబాన్ని నేను చూసుకుంటాను. వారి అవసరాలన్నీ నేను తీరుస్తాను. కాబట్టి అతను తన కుంటుంబం గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు” అని అన్నాడు. ఆనాటినుండి ఆ ఉత్తర భారతీయ యువకుడు శ్రీమఠంలో ఒక సభ్యుడయ్యాడు.
శ్రీమఠం తరువాతి మకాం ఏ సౌకర్యములు లేని చోట చేసారు. అది రాత్రి సమయం కావున వంట వండి మఠం సభ్యులందరూ భోజనాలు ముగించారు. అన్న పానాదులు ఎవరికి లోటు లేకుండా సమృద్ధిగా ఉండాలని మమాస్వామి వారి ఆజ్ఞ. మఠంలో పనిచేసేవారికి ఎవరికి భోజనం తక్కువ కాకూడదు.
అందరూ భోజనాలు ముగించిన తరువాత పరమాచార్య స్వామి వారు వచ్చి, ఒక్కొక్కరిని భోజనం ముగించారా అని విచారిస్తున్నారు. అందరూ తిన్నామని చెప్పారు. చివరగా వారు బయటకు వచ్చి చూస్తే తలుపు దగ్గర పవార్ కాపలా ఉన్నాడు.
అతనికి తమిళం రానందున ఏమైనా తిన్నావా అని స్వామి వారు సైగలతో అడిగారు. కాని అతను దీనంగా లేదు అన్నట్టుగా తల అడ్డంగా తిప్పాడు. మహాస్వామి వారు వెంటనే మఠం మేనేజరును పిలిచి, “ఈ యువకుడు మనల్ని నమ్మి ఇక్కడికి వచ్చాడు. అతనికి భోజనం పెట్టాలని నీకు ఎందుకు అనిపించలేదు? అతను అడగకపోయినా అతనికి మన భాష రాకపోయినా నువ్వు ఎందుకు అతని గురించి పట్టించుకోలేదు. కనీసం తిన్నావా? అని అయినా అడిగావా? మీరందరూ తినేసి, వంట వార్పు ఆపేసారు. ఈ నిర్మానుష్య ప్రదేశంలో అతనికి తినడానికి ఏమి దొరుకుతుంది?” అని అడిగారు.
స్వామి వారు చాలా కోపంగా మేనేజరుని మందలించారు . తరువాత మేనేజరు మహాస్వామి వారితో పవార్ కు తినడానికి ఏమైనా ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు.
కొద్దిసేపటి తరువాత ఒక వ్యక్తి సైకిల్ లో ఒక క్యారేజితో అక్కడికి వచ్చాడు. ఇంకా ఇక్కడ గుడారాలలో వెలుగు కనపడడంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. వారు అతన్ని వివరములు అడుగగా, అతను ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్నవారికి భోజనం తిసుకుని వెళ్తున్నానని, దార్లో వెళ్తూ స్వామి వారిని దర్శించాలని వచ్చానని చెప్పాడు. వెంటనే పరమాచార్య స్వామి వారు ఆ వ్యక్తితో పవార్ ను చూపిస్తూ, “నువ్వు తీసుకెళ్తున్న దాంట్లో కొద్ది ఆహారం ఇతనికివ్వగలవా?” అని అడిగారు. అపార కరుణకు సాకార రూపమైన మహాస్వామి వారు తన సేవకుని కోసం ఒక అజ్ఞాతవ్యక్తిని అర్థిస్తున్నారు.
వెంటనే ఆ వ్యక్తి, “ఈ క్యారేజిలో ఆహారం ఉంది. అతన్ని తినమనండి. నేను వేరే ఏర్పాట్లు చేసుకుంటాను” అని క్యారేజిని ఇచ్చి వెళ్ళిపోయాడు. వారు దాన్ని తెరవగా అందులో ఉత్తరభారతీయుల అహారమైన వేడి వేడి చపాతీలు, కూరగాయల సబ్జి ఉన్నది. స్వామి వారు నవ్వుతూ పవార్ వైపు చూసి తినమన్నారు. తన కోసం ఇలా ఎవరినో మహాస్వామి వారు అర్థించడం చూసి పవార్ కదిలిపోయాడు. తరువాత ఆ వ్యక్తి ఎప్పుడూ మళ్ళా ఆ క్యాంపు వైపు కాని రాలేదు. కనీసం అక్కడ వదిలిపెట్టిన క్యారేజి తీసుకుని వెళ్ళడానికి కూడా రాలేదు.
పవార్ కు మహాస్వామి వారే ప్రపంచంలా మారిపోయింది. మఠంలో శాశ్వత ఉద్యోగి అయిపోయాడు. పరమాచార్య స్వామి వారు మేనాలోనికి(అందులోనే స్వామివారు నిద్రపోయేవారు) వెళ్ళేవరకు అన్నీ తానై సేవించేవాడు. అన్ని అవసరాలని తీర్చేవాడు.
కొన్ని సంవత్సరాల తరువాత పవార్ కుటుంబం స్వామి వారి దర్శనానికి కాంచీపురం వచ్చింది. కొన్ని రోజులు ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. తరువాత అక్కడి నుండి వారు తిరుమల వెళ్ళి శ్రీనివాసుణ్ణి దర్శించుకోవాలనుకున్నారు. పవార్ వచ్చి స్వామి వారికి వారి కోరిక తెలుపగా “సంతోషంగా వెళ్ళి రమ్మను” అని చెప్పారు.
మనసులో పవార్ కు కూడా తన కుటుంబంతో వెళ్ళాలని ఉంది. దానికి మహాస్వామి వారి ఆశీస్సులు, అనుమతి కావాలి. అదీకాకుండా తను వాళ్ళతో వెళ్తే స్వామివారి అవసరాలని ఎవరు చూసుకుంటారు. కావున కేవలం ఒక్కరోజు మాత్రమే వెళ్ళి వద్దామని స్వామి వారిని అనుమతి అడిగాడు.
స్వామివారు అతనితో, “నీకు బాలాజిని చూడాలని ఉందా? సరే వాళ్ళతో కూడా వెళ్ళు” అని సెలవిచ్చారు. పవార్ చాలా సంతోషించాడు.
స్వామివారు మేనాలొనికి వెళ్ళగానే దాని తలుపులు గట్టిగా మూయడం, ఉదయాన్నే స్వామి వారికంటే ముందే మేల్కొని మేనా తలుపులు తీయడం పవార్ కి దినచర్య. ఆరోజు ఉదయం పవార్ మరియు అతని కుటుంబం తిరుమల వెళ్ళాలని నిశ్చయించుకొన్నారు.
రోజూలాగే అరోజు కూడా మేనా తలుపులు తీసి ఉదయం చెయ్యవలసిన పనులన్ని చేసి తిరుమలకు వెళ్దాము అనుకున్నాడు. తెల్లవారగానే మేనా తలుపులు తీసి లోపలికి చూసి స్థాణువై భక్తితో కన్నుల నీరు కరుతుండగా స్వామి వారికి సాష్టాంగం చేసి నమస్కరించాడు. అతనికి మేనాలో స్వామి వారికి బదులుగా కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీనివాసునిగా దర్శనమిచ్చారు.
మహాస్వామి వారు తమ కరుణాపూరితమైన చూపులతో చూడగా, ఆ చూపులలో “నీకు తెలియదా నీ బాలాజి ఇక్కడే ఉన్నాడు అని” అన్నట్టు తోచింది పవార్ కు. కొద్దిసేపు పవార్ మౌనంగా ఉన్నాడు. చిన్నగా స్వామివారిని చూస్తూ, ”నేను వారితో తిరుమల వెళ్ళడం లేదు” అని చెప్పి తన దినచర్యకు ఉపక్రమించాడు.
పవార్ తన మనసులో “అన్నీ అందించగలిగే దేవుడు ఇక్కడ ఉండగా దేవునికోసం వేరేచోట వెదకడం ఎందుకు?” స్వామివారికి ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా అనుగ్రహించాలో బాగా తెలుసు. వారు త్రికాలవేదులు, కాలాతీతులు.
#KanchiParamacharyaVaibhavam #Paramacharya
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి