10, జనవరి 2023, మంగళవారం

స్ఫటిక లింగం..!

 *స్ఫటిక లింగం..!!*


శ్లో.శుధ్ధస్ఫటిక సంకాశం శుధ్ధవిద్యాప్రదాయకమ్ ! 

శుధ్ధం పూర్ణం చిదానందం! 

సదాశివ మహంభజే!!..


*స్పటికం మహేశ్వర స్వరూపం.*


దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. 

స్ఫటికం స్వచ్ఛతకు సంకేతం

మన మనస్సులు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా  ఉండాలంటే మనఃకారకుడైన చంద్రుడివంటి వన్నేతో చల్లతనంతో విరాజమానం అవుతున్న స్ఫటిక మయ శివలింగమునకు అర్చనాభిషేకాది కైంకర్యాదులు ఒనరించిన వారికి ఒడలు తెలియనంత ఆనందానుభూతులు కల్గటం అనేది అనుభవైకవేద్యమై అలరారుతున్నది, శివుని శరీరము శుద్ధస్ఫటిక సంకాశం అని కీర్తింపబడింది. 


సాక్షాత్తు శివ స్వరూపమైన స్ఫటిక లింగాన్ని ఆరాధించి సేవిస్తే ముక్తి లభిస్తుందని శాస్త్రాలలో పేర్కొనబడింది. 


శివారాధన వికల్పాలలో విభిన్న వ్యక్తులు విభిన్న శివలింగాలని మాత్రమే పూజించాలని పురాణాలలో ప్రతిపాదిస్తూ స్పటిక లింగాన్ని మాత్రం స్త్రీ పురుష భేదం లేకుండా అందరు సేవించి పరమపదమును పొందవచ్చునని నిరూపింపబడింది.


🙏శ్లో.ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాణ్డ మావిస్ఫురత్ 

జ్యోతిః స్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః |

అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకామ్ జపన్

ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రో2భిషించేచ్చివం ||...🙏


_యజుర్వేద తైత్తిరీయ సంహితలోని రుద్ర నమక ధ్యాన శ్లోకము..._


*తాపర్యము :*


పాతాళము నుండి నభస్థలాంతము వరకు వ్యాపించిన స్ఫటికమయమైన జ్యోతిర్లింగ రూపుడైన రుద్రమహాదేవుని రుద్రమంత్రాలతో అభిషేక క్రియ సల్పినవారికి శీఘ్ర శివానుగ్రముకల్గి ఎల్ల ఈప్సితములు నెరవేరుతాయని  ఈ విధముగా వర్ణింపబడి ఉన్నది.


స్పటిక శివలింగం అత్యంత విశేషమైనదిగా చెప్పబడుతోంది. 

కొన్ని శివలింగాలను పూజించడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, మోక్షం లభిస్తుంటాయి. 


ఇక స్పటిక శివలింగం దగ్గరికి వచ్చేసరికి దానికి ఒక ప్రత్యేకత వుందని చెబుతుంటారు.

ఫలానా కోరిక నెరవేరాలని సంకల్పించుకుని, దానిని అర్చించడం వలన మనసులోని ఆ కోరికలు అనతికాలంలోనే నెరవేరతాయని చెప్పబడుతోంది. 


స్పటిక లింగం పరబ్రహ్మానికి చిహ్నం. తురీయమైన శివానికి అది గుర్తు. 

శంకరాచార్యుల వారు కైలాసం వెళ్ళి అయిదు స్పటిక లింగాలను తెచ్చారు.


మార్కండేయ సంహితలో ఆ లింగాలను ఎక్కడెక్కడ ప్రతిష్ఠించిందీ వివరించబడింది. 


శ్లో.శివలింగం ప్రతిష్ఠాప్య చిదంబర సభాతటే మోక్షదం సర్వజంతూనాం భువనత్రయసుందరం!

ముక్తిలింగం తు కేదారే నీలకంఠే వరేశ్వరం! కాంచ్యాం శ్రీకామకోటే తు యోగలింగ మనుత్తరం! శ్రీ శారదాఖ్యపీఠేతు లింగం తం భోగనామకం!!..🙏


*తాపర్యము ;*


1.కేదారంలో ముక్తి లింగాన్ని, 


2.నేపాల్ లో గల నీలకంఠ క్షేత్రంలో వరలింగాన్ని,


3.చిదంబర క్షేత్రంలో కనక సభలో మోక్షలింగాన్ని, 


4.శృంగేరీ శారదాపీఠంలో భోగలింగాన్ని,


5.కాంచి కామకోటి పీఠంలో యోగలింగాన్ని 


ప్రతిష్ఠించటం జరిగిందని మార్కండేయ సంహిత అనే గ్రంధరాజంలో ఉన్నదని మనకు విబుధజనుల ద్వారా తెలియవొస్తున్నది.


శివమయం జగత్. ఈ విశాల విశ్వంలో శివుడు కానిది ఏదీలేదు. 

శివశబ్దమే కల్యాణకారకం అని అర్థం, శివుడు సకల జగాలకు పాలకుడు. దిక్కులనే అంబరాలు ధరించినవాడు.


శివుడు భక్తసులభుడు, ‘హర హర మహాదేవ శంభో’అన్నంతనే నేనున్నా నంటూ భక్తులను బ్రోచే భక్తవశంకరుడు. జడమైన జగతికి చైతన్యాన్ని ప్రసాదించే లయకారుడు. మాయానాశకుని ఉదంతాన్ని తెలియచేయడానికే లింగోద్భవం జరిగిందంటారు. 


స్పటిక లింగాన్ని ప్రధమం మహాశివరాత్రి రోజుగాని, శుక్రవారం లేదా సోమ వారం రోజుగాని పూజా మందిరంలో ప్రతిష్టించి అభిషేకించటం మంచిది. 

జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు దోష నివారణకు స్పటిక లింగాన్ని అభిషేకించటం మంచిది.


రవి, శుక్ర గ్రహాలు కలసి 10 డిగ్రీల లోపు ఉన్నప్పుడూ అస్తంగత్వ దోషం ఏర్పడుతుంది. 

ఇలాంటి దోష నివారణకు రవికి అధి దైవం అయిన శివస్వరూపమైన శివలింగాన్ని, 


శుక్ర గ్రహానికి చెందిన రత్నమైన స్పటికాన్ని శివలింగ రూపంలో అభిషేకించి అభిషేక తీర్ధాన్ని స్వీకరించటం ద్వారా అస్తంగత్వ దోష ప్రభావం నుండి విముక్తి కలుగుతుంది. 


వివాహ విషయంలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది, ప్రతి నిత్యం స్పటిక శివ లింగానికి అభిషేకించే వారికి వైవాహిక జీవితంలోని సమస్యలను తొలగిస్తుంది.

స్పటిక లింగానికి అభిషేకించిన అభిషేక తీర్ధాన్ని స్వీకరించిన వారికి స్ఫురణ శక్తి పెరుగుతుంది.


ఉద్యోగులకు, వ్యాపారులకు   స్పటిక లింగానికి అభిషేకం చేయించుకోవటం వలన వ్యాపారాభివృద్ధి, ఆర్ధికాభివృద్ధి, మంచి తెలివితేటలు, మంచి వాక్ శుద్ధి, నరదృష్టి ప్రభావం తొలగి జనాకర్షణ కలుగుతుంది..


స్వస్తీ..🌹🙏


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కామెంట్‌లు లేవు: