31, మార్చి 2023, శుక్రవారం

సూక్ష్మక్రిమి పరిజ్ఞానం -

 ఆయుర్వేదం నందు గల సూక్ష్మక్రిమి పరిజ్ఞానం - 


     ఇప్పటివరకు మనం అనుకుంటున్నట్టుగా సూక్ష్మక్రిములను కనుగొన్నది పాశ్చత్య శాస్త్రజ్ఞులు మాత్రం కాదు. వారికంటే కొన్ని వేల సంవత్సరాల మునుపే మన పూర్వీకులకు సూక్ష్మక్రిముల పైన మరియు అవి కలుగచేసే వ్యాధుల పైన సంపూర్ణ అవగాహన కలదు. ఈ విషయాల గురించి నేను తెలుసుకొవడానికి కొన్ని అత్యంత పురాతన ఆయుర్వేద గ్రంథాలు పరిశీలిస్తున్నప్పుడు వాటిలో కొన్ని చోట్ల ఈ సూక్ష్మక్రిమి సంబంధమైన అనేక విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. ఆ విలువైన సమాచారాన్ని మీకు కూడా తెలియచేయుటకు ఈ పోస్టు పెడుతున్నాను .


         సుశ్రుతునకు సూక్ష్మక్రిములుకు సంబంధించిన పరిజ్ఞానం అపారంగా ఉన్నది అని చెప్పవచ్చు. రోగానికి కారణం అయ్యే సూక్ష్మక్రిములను గురించిన జ్ఞానమునకు "భూతవిద్య " అని పేరుకలదు . అష్టాంగహృదయములో ఇది ఒక ప్రత్యేక భాగముగా పరిగణించబడినది. భూతవిద్యా లక్షణమును చెప్పునప్పుడు దేవాసుర , గంధర్వ , యక్ష , రక్ష , పితృ , పిశాచ , నాగ అనే భూత గ్రహాలుగా సూక్ష్మజీవులను వర్ణించాడు. కొన్ని మంత్రగ్రంధాలలో పైన చెప్పిన పేర్లు కలవారు వేరే లోకమునకు సంభంధించినవారుగా దుష్టశక్తులుగా వర్ణించి వారు మానవులను పట్టి పీడించువారుగా ఉన్నది. కాని సుశృతుడు దీనికి ఒప్పుకోడు వారు దేవాసుర , గంధర్వులు ద్యులోక వాసులు వారు భూలోకమునకు వచ్చి మనుష్యులతో కలిసి ఎన్నటికీ నివసించరు అని ఆయన అభిప్రాయం .


       సుశ్రుతుడు సూక్ష్మజీవుల గురించి వివరిస్తూ వాటిని గ్రహములగా పిలుస్తూ ఈ విధముగా చెప్పుచున్నాడు. కోట్లకొలది అసంఖ్యాకముగా ఉన్న ఈ గ్రహములు రక్తము , మాంసములను భుజించి వృద్ది అగుచుండెను . అవి మహాపరాక్రమము కలిగినవి. అయినను అవి సూర్యుని వెలుగుకు జడిసి రాత్రుల యందు సంచరించుచుండును . చీకటి , నీడగల తావుల యందు పగలంతా ఉండును. ఈ సూక్ష్మక్రిములు నేలమీదను , అంతరిక్షము నందు , అన్ని దిక్కుల లోను పాడిపడిన చీకటి గృహముల యందు నివాసము ఉండును. ఈ సూక్ష్మక్రిములు ఒకొక్క కాలము నందు విజృంభించి జనులను పీడించునని సుశృతుడు తెలియచేసెను .


         వ్రణసంబంధ ఇన్ఫెక్షన్స్ గురించి సుశృతుడు వివరించుతూ ఈ సూక్ష్మక్రిములకు మాంస , రక్తం ప్రియం అగుటచేత గాయములలోకి తరచుగా ప్రవేశించి సమస్యలను కలుగచేయునని తెలుపుతూ ఈ రోగకారణమగు సూక్ష్మక్రిములను మూడు ప్రధాన గణములుగా గుర్తించారు. 


            ఇప్పుడు సుశృతుడు రోగహేతుకారణాలైన సూక్ష్మజీవులను మూడు రకాలుగా వర్గీకరించారు. వాటి గురించి మీకు వివరిస్తాను. అవి 


 1 - పశుపతి అనుచరులు .


 2 - కుబేర అనుచరులు .


 3 - కుమార అనుచరులు .


 * పశుపతి అనుచరులు -


      మనస్సు , ఇంద్రియములను వికలమొనర్చి భ్రమ , ప్రలాప , ఉన్మాదములను కలిగించును. 


 * కుబేర అనుచరులు - 


       ఇవి యక్షరక్షో గణములకు చెందిన క్రిములు . శారీరక బాధలను మాత్రమే కలిగించును.


 * కుమార అనుచరులు -


       పసిపిల్లలను వశపరుచుకొని బాధించును . వీటినే బాలగ్రహములుగా పిలుస్తారు . 


         పైన చెప్పినవిధముగా సుశ్రుతుల వారు సూక్ష్మక్రిములను మూడు రకాలుగా వర్గీకరించారు . మలేరియా జ్వరమునకు రురుజ్వరం అని తక్ష్మ జ్వరం అనియు అధర్వణవేదములో వ్యవహరించబడినది. ఈ జ్వరమును కలిగించే సూక్ష్మక్రిములు ఉండు నివాసస్థలము గురించి చెప్పుతూ గుడ్లగూబ , గబ్బిలము , కుక్క , తోడేలు , డేగ , గద్ద ఈ జంతుపక్షి శరీరాల్లో మలేరియా క్రిములు ఎల్లప్పుడూ ఉండి వాటి మలముతో బయటకి వచ్చి జనులు తాగే నీటిలో కలిసి మనుష్యులకు సంక్రమించునని ఉన్నది.


           ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో కొన్నింటిలో ఈ విధముగా ఉన్నది. క్రిములు శరీరం నందు ప్రవేశించినంత మాత్రాన రోగము రాదు . శరీరము నందు ఓజస్సు మిక్కిలిగా అభివృద్ధిచెందిన ఊర్జశక్తి అన్ని రకముల క్రిములను జయించుచున్నది. ఇక్కడ మనశరీరములోని రోగనిరోధక శక్తి గురించి వివరణ ఇవ్వడం జరిగింది. శరీరానికి హితమైన ఆహారం సేవించకుండా విరుద్ద ఆహారాలను సేవించువారికి , ప్రకృతివిరుద్ధ నియమాలు పాటించువారికి క్రిములు బాధించును గాని అగ్నిదీప్తి చక్కగా ఉండి యవ్వనంలో ఉన్నవారికి , స్నిగ్ధ శరీరులకు , వ్యాయమం చేయుచుండువారికి , శరీరబలం అధికంగా ఉన్నవారికి క్రిములు ఏమి చేయలేవు .


               క్రీ . శ 18 వ శతాబ్దములో మైక్రోస్కోప్ యంత్రము కనిపెట్టబడిన పిమ్మట సూక్ష్మజీవులను కనుగొన్నారు అని మన పాఠ్యపుస్తకాలలో చదువుతున్నాం .కాని కొన్నివేల సంవత్సరాలకు పూర్వమే మన మహర్షులు ఈ సూక్ష్మక్రిమి విజ్ఞానం సంపాదించారు. మన మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు వారు తమ మనోనేత్రముతో అన్నింటిని దర్శించగలరు మరియు కనుగొనగలరు. మైక్రోస్కోప్ గురించి దానికి పాశ్చాత్యులు కనుగొన్నారు అని గొప్పగా చెప్పుకుంటాం కాని అధర్వణవేదము నాలుగోవ కాండ ఇరవైవ సూక్తములో పిశాచక్షయ మంత్రములో మైక్రోస్కోప్ వంటి "బిబిర్హిని " అను ఒక దివ్య ఔషధి లభించినట్టు కశ్యప మహాముని ఈ ఔషదీ సహయముతో భూమి మరియు అంతరిక్షంలో వ్యాపించి ఉన్న సర్వరోగ క్రిములను చూడగలిగెను అని ఈ మంత్రం చెప్పుచున్నది. క్రీ .శ మూడొవ శతాబ్దములో బింబసారుని ఆస్థాన వైద్యుడు అయిన జీవకునికి ఇట్టి మహత్తర ఔషధి లభించెనని గ్రంధస్థం చేయబడి ఉన్నది. దీని సహాయముతో నేటి ఎక్సరే యంత్రము వలే శరీర అంతర్భాగము నందలి శరీరభాగాలను చూస్తూ పేగులలో చిక్కుకున్న రాళ్లను తీసివేశారు అని ఎన్నో పురాతన గ్రంథాలలో కలదు.


               సమాప్తం 


    

      

కామెంట్‌లు లేవు: