31, మార్చి 2023, శుక్రవారం

ఏది ఉచితంగా రాదు

ఏది ఉచితంగా రాదు  

మనం ఉంటున్న ప్రపంచం ఒక చిత్రమైనదిగా తోస్తుంది. బాహ్యంగా కనపడేది ఒకటి ఉంటే అంతరంగికంగా ఇంకొక విధంగా ఉంటుంది. కొన్ని సమయాలల్లో బాహ్యానికి అంతర్యానికి పూర్తిగా వ్యతిరేకంగా భిన్నంగా వుండే సంఘటనలు కూడా లేకపోలేదు. 

ఒక వ్యాపార ప్రకటన ఇట్లా ఉంటుంది మీరు రెండు కొంటె ఒకటి ఉచితం అని వ్రాసి ఉంటుంది. విషయం ఏమిటంటే రెండు కొంటె ఒకటి అనే పదాలను చిన్న అక్షరాలలో పేర్కొని ఉచితం అనే పదాన్ని మాత్రం పెద్దగా వ్రాస్తారు. తీరా నీవు అక్కడికి వెళ్లి చుస్తే ఆ స్టాకు పూర్తిగా పాతది పారేయటానికి మాత్రమే పనికి వచ్చేదిగా వుండి వుంటుంది. చౌకగా వస్తుంది అని నీవు వస్తువు సామర్ధ్యాన్ని గణనలోకి తీసుకోకుండా నీకు సదరు వస్తువు అవసరమా కాదా అనేది కూడా ఆలోచించకుండా తీసుకొని వస్తావు చివరకు నీ భార్య ఆగ్రహానికి లోనౌతావు. తరువాత వాటిని తీసుకొని వాపసు ఇవ్వటానికి దుకాణానికి వెళితే సారీ సారూ క్లీరెన్సు సేలు వాపసు తీసుకోము అని చెప్పి పంపిస్తాడు. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే నిజానికి షాపువాడు ఒక్కటి కూడా నీకు ఉచితంగా ఇవ్వలేదు. ఒక తక్కువ నాణ్యత కలిగిన వస్తువును అమ్ముకోవటానికి వేసిన పధకం అని తరువాత మనకు తెలుస్తుంది. కాబట్టి ఏదయినా వస్తువు కొనేటప్పుడు దాని ధర చౌకగా వున్నదని వైపోచించకుండా దాని నాణ్యత అది ఎంతవరకు మనకు ఉపయోగకరం అనే విషయాలను కూడా అలోచించి కొనటం చాలా అవసరం. ఈ రోజుల్లో ప్రలోభాలకు గురిచేసే వ్యాపార ప్రకటనలు అనేకం మనం చూస్తున్నాము వాటి ప్రభావానికి లోనయి నష్టపోయిన సందర్భాలు ప్రతి మనిషికి అనుభవమే.

మనషులలోని మానసిక బలహీనతలను ముఖ్యంగా మధ్యతరగతి మనుషులను గురిచేసి వ్యాపారవేత్తలు ఇలాంటి ప్రలోభాలకు గురిచేస్తుంటారు.మధ్యతరగతి వారికి ఎన్నిసార్లు మోసపోయిన మరల మరల తెలియకుండా మోసపోతూనే వుంటారు. 

బజారులో చిన్న చిన్న సంచులలో కేవలం బత్తాయి పండ్ల బైటి వైపు మాత్రమే కనిపించే విధంగా ఉంచి అమ్ముతారు.  వాటిని చూసి ఆ పండ్లు మంచివని అనుకోని మనం కొనుక్కొని వస్తాము. ఆ సంచి చించి చుస్తే అన్ని పండ్లు క్రుళ్ళి పోయి ఉంటాయి. మన కళ్ళను మైమరిపింపచేసి చెడిపోయిన వస్తువులను అమ్మటం వాళ్ళు మోసం అనుకోవటం లేదు అది వారి చాకచక్యం అని తలుస్తూ విశేష లాభాలను గణిస్తున్నారు. 

మార్కెట్లో కూరగాయలు కొనటానికి వెళితే అక్కడ ఒక్కడు మిగిలినవారి కన్నా తక్కువ ధరకు అమ్ముతుంటారు. కూరలు చుస్తే తాజాగా కనిపిస్తాయి వాటిని చూసి నీవు తక్కువ ధరకు లభిస్తున్నాయని అక్కడ కొంటావు.  తీరా ఇంటికి వస్తే నీ భార్య ఏమండీ వంకాయలు కిలో తెచ్చారా అరకిలో తెచ్చారా అంటే కాయలు తాజాగా ఉన్నాయని కిలో తెచ్చాని నీవు బదులు ఇస్తావు.  మిమ్మల్ని కూరగాయలవాడు మోసం చేసాడు నిజానికి ఇవి కిలో లేవు అని ఆమె చెపితే ప్రక్కనే వున్న కిరాణాషాపుకు వెళ్లి తూకంవేయిస్తే 600-700 గ్రాములు మాత్రమే ఉంటాయి. అప్పుడు నీకు కళ్ళు తెరుచుకుంటాయి ఆ వ్యాపారి తక్కువ ధరకు ఎందుకు అమ్మాడో అని. 

వ్యాపారవేత్తలు వారి వారి లాభాలకొరకు ప్రజలను మోసం చేయటం పరిపాటే కానీ ఇతరులు అలా కారు అని అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా మనకు ఉచితాలను చూపెట్టి తమ పబ్బం కడుపుకుంటున్నారు. ఒక సమర్ధమైన ప్రభుత్వం ప్రజలలో ఎలాంటి విభేదాలను చూడకుండా లేక చూపకుండా అందరిని తన కన్నా పిల్లలవలె పరిపాలించాలి అని కదా రాజనీతి తెలుపుతుంది. మరి ఆలా జరుగుతున్నదా అంటే లేదు అని ప్రతి మనిషికి తెలుసు పూర్తిగా స్వార్ధపూర్తితంగా, వోటురాజకీయంగా రాజకీయ నాయకులు తమ తమ స్థానాలను గెలవటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల సంక్షేమం కన్నా స్వా సంక్షేమానికే వారు విలువని ఇస్తున్నారు. ఉచితంగా ఇవ్వాలి అంటే యెంత దానం ప్రభుత్వానికి కావలి అని మనం ఆలోచించకుండా ఉచిత పథకాలకు అలవాటు పది ఓటువేసి పన్నుల ఊబిలో కూరుకొని పోతున్నాము.  రాత్రి 8 గంటల సమయంలో ప్రతి కూడలిలో పోలీసువారు వాహనాలను అపి జరిమానాలు విధించటం మనమెరుగుదము. అవి ఉచిత పథకాల ప్రభావమే కావచ్చు.

కొందరు అనవచ్చు తల్లిదండ్రుల ప్రేమలో స్వార్ధం ఉండదు అది కేవలం ఉచితంగా లభిస్తుంది  అని. అట్లా అనుకుంటే పొరపాటే అవుతుంది  అదెట్లో పరిశీలిద్దాం. బాల్యంలో తల్లిదండ్రులు పిల్లలను ఏంతో ప్రేమగా చూసుకొని వేలు, లక్షలు ఖర్చు పెట్టి విద్యావంతులను చేస్తారు.  అదంతా ఉచ్చితమే అని పిల్లలు అనుకోవచ్చు కానీ నిజనికి తల్లిదండ్రులు వృద్దులు అయినప్పుడు వారిని ప్రేమతో చూసుకొని వారసంతోషానికి పాత్రులు కావలి. ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకుంటున్నారన్నది మనం రోజు చూస్తున్నాము. ఎప్పుడో శతక కారుడు చెప్పాడు 

తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు 
పుట్ట నేమి వాడు గిట్టనేమి
పుట్టలోని జెదలు పుట్టవా? గిట్టవా?
విశ్వదాభిరామ వినురవేమా!

 చిన్నతనంలో తల్లిదండ్రులు చూపిన ప్రేమకు పర్యవసానంగా వాళ్ళు వృద్దులు అయినప్పుడు పిల్లలు వారి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవటం కనీస బాధ్యత.  ఈ బాధ్యతను ప్రతివారు విస్మరించకుండా ఉండాలి. 

కొందరు తల్లిదండ్రులు బాల్యంలో వారి పిల్లలపట్ల ప్రేమాభిమానాలు సరిగా చూపకపోవటంతో వారు పెద్దవారైనాతరువాత పిల్లల్నుండి ప్రేమను పొందలేక బాధపడితే ప్రయోజనం ఉండదు. కాబట్టి తల్లి దండ్రులు ఎల్లప్పుడూ బిడ్డలను కంటికి రెప్పగా చూసుకోవాలి అప్పుడు మాత్రమే వారి పిల్లల ప్రేమను పొందటానికి అర్హులు అవుతారు. 

నిజానికి భూమి మీద మనకు గాలి నీరు కూడా ఉచితంగా లభించదు అది ఎట్లాగో చూద్దాం. పరిసరాలలో వున్న గాలిని మనం మన శక్తిని వుపయోగించి మాత్రమే పొందుతాము. ఊపిరితిత్తులు వాటి శక్తిని వాడకపోతే గాలి శరీరానికి వెళ్ళదు.  శక్తి కావాలంటే ఆహరం తీసుకోవాలి ఆహరం సంపాయిస్తేనే వస్తుంది అది మనకు తెలుసు.  ఇక నీటి విషయానికి వస్తే నీరు భావిలోనో లేక నదిలోనో వున్నాయనుకోండి అప్పుడు కూడా మీరు మీ శక్తిని ఉపయోగించి మాత్రమే నీటిని పొందగలరు. ఈ రోజుల్లో మనం త్రాగే నీటిని కొనుక్కొని త్రాగుతున్నామన్నది సర్వులెఱింగినదే. 

ఈ ప్రపంచంలో ఏది కూడా ఉచితంగా లభించదు మనం ఒకటి పొందాలంటే ఒకటి కోల్పవాలి అన్నది అనాదిగా వస్తున్న నానుడి. ఇది ముమ్మాటికీ నిజం. ఆహరం ఎక్కడ ఉచితంగా లభిస్తుంది అంటే ఎలుకల బోనులో అని ఒకడు అన్నదాత దాని అర్ధం బోనులోకి ఎలుకలను రప్పించటానికి ఆహారాన్ని ఉంచారన్నది విషయం.  కాబట్టి ఏదయినా ఉచితంగా వస్తున్నది అంటే నిజానికి అది ఉచితం కాదు దాని వెనుక నీకు తెలియని ఒక విషయం దాగి వున్నది అని తెలుసుకోవాలి.. 

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ

 

కామెంట్‌లు లేవు: