30, మార్చి 2023, గురువారం

ఆమెను భర్త దగ్గరకు వదిలి రా...

 ఆమెను భర్త దగ్గరకు వదిలి రా...


చాలా సందర్భాల్లో, ఇతరులపైన పరమాచార్య స్వామివారి ప్రేమ బహిర్గతం అవ్వదు. కాని ఒకసారి మహాస్వామివారు శ్రీమఠం బాలు మామని ఒక పని చెయ్యమని ఆదేశించారు. ఆ సంఘటన వివరాలు బాలు మామ మాటల్లో.


శ్రీమఠం మకాం షోలాపూర్ లో విడిది చేసి ఉన్నప్పుడు, ఒక సాయంత్రం మహాస్వామి వారు బాలు మామను పిలిచి, “. . . ఇతని ఇంటికి వెళ్లి, వారి అమ్మాయిని తీసుకుని తన భర్త ఇంటిలో వదిలిరా!” అని ఆజ్ఞాపించారు.


ఆ మాట విని బాలు మామ నిశ్చేష్టుడయ్యాడు.


పరమాచార్య స్వామివారు చెబుతున్న వ్యక్తీ స్వామివారికి పరమ భక్తుడు, వైశ్య కులానికి చెందినవాడు; పెద్ద సంసారం కలవాడు; ఏవో కారణాల వల్ల అతని కుమార్తె భర్త నుండి విడువడి, తల్లితండ్రుల వద్దే ఉంటోంది. కాని ఈ విషయం ఎవరూ మహాస్వామివారికి తెలుపలేదు. కాని స్వామివారి నుండి ఇటువంటి ఆదేశం వచ్చింది.


“ఏమిటి ఈ ఆదేశం? మరొకరి కుటుంబ విషయాల్లో నేను జోక్యం చేసుకోవడం ఎలా? ఆ అమ్మాయిని తీసుకునివెళ్ళి భర్త ఇంటిలో వదిలిరావాలా? ఇది సరైనదేనా?” అని పరిపరివిధాల ఆలోచిస్తున్నాడు బాలు మామ. ఎటువంటి ఆజ్ఞనైనా స్వామివారి నుండి వెలువడితే, సహాయకులెవ్వరూ మరొక్క ఆలోచన లేక అమలుచేస్తారు. కాని ఈ విషయంలో బాలు మామ సంకోచిస్తున్నాడు.


బాలు మామ ఇబ్బందిని అర్థం చేసుకున్న స్వామివారు అతనికి ధైర్యంగా ఉంటుందని, “నీతోపాటు బ్రహ్మచారి రామకృష్ణన్ ని కూడా వెంట తీసుకునివెళ్ళు” అని చెప్పారు.


వారు ఆ ఇంటికి వెళ్లి, స్వామివారి ఆదేశాన్ని వారికీ తెలిపారు. స్వామివారి ఆదేశాన్ని వినగానే అందరూ ఏడవడం మొదలుపెట్టారు. అమ్మాయిని అక్కడకు పంపడం అంటే, ప్రేమతో పెంచుకున్న చిలకను పిల్లి వద్దకు పంపడమే అని వారికి తెలుసు.


కాని వారికి మహాస్వామి వారిపై ఉన్న నమ్మకం, భక్తి చేత ఎటువంటి అనుమానానికి తావివ్వకుండా మనస్సును స్థిమితపరచుకున్నారు. పరమాచార్య స్వామివారే ఇలా ఆదేశించారంటే అందులో ఎదో ఉంటుందని వారికి తెలుసు. అమ్మాయిని పంపడానికి నిర్ణయించుకున్నారు.


ఆ అమ్మాయి ఎంత ఆలోచిస్తున్నాడో తన భర్త ఇంటికి వెళ్ళడానికి, బాలు మామ కూడా అంతే  తటపటాయిస్తున్నాడు. కాని అది స్వామివారి ఆజ్ఞ కావడంతో ఇక బయలుదేరింది. ఏమి జరుగుతుందో అని భయపడుతూ ముగ్గురూ బయలుదేరారు.


వీళ్ళు అక్కడకు వెళ్ళగానే అత్తింటి వారు ఎంతో సాదరంగా వాళ్ళను ఆహ్వానించారు. వీరు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఆమె భర్త కూడా తనని ప్రేమతో ఆదరించి, ఇక్కడే ఉంచుకుంటాను అని ప్రమాణం చేశాడు.


--- శ్రీ రా. గణపతి, “శంకరర్ ఎండ్ర సంగీతం” నుండి.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: