శుక్రవారం విడిచిన దుస్తుల్నే ధరిస్తే.....బియ్యం కొలిచే పాత్రను బోర్లిస్తే...........!!
శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. సంపదలతో తులతూగాలి అనుకునే వారు శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి. ఇంకా ఇంట పసుపు, ఉప్పు అయిపోయాయనే మాట వినబడ కూడదు. పసుపును కొనాలి. లేదా ఉప్పును తేవాలి అని చెప్పడం చేయొచ్చు.
ఉప్పు, పసుపు అయిపోయేంతవరకు ఉపయోగించకూడదు. అవి అయిపోయే లోపు ఇంట తెచ్చుపెట్టుకోవడం చేయాలి. అలాగే ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం. ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బోర్లించకూడదు.
ఇంట సుఖసంతోషాలు, సిరిసంపదలు పొందాలంటే.. విడిచిన బట్టలను తలుపుకు వేలాడదీయకూడదు. విడిచిన బట్టలను రెండో రోజు, మూడో రోజు ధరించకూడదు. ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్ర్యం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు.
* శుక్రవారం నాడు సాత్త్విక ఆహారాన్ని తీసుకోవాలి. పాలను వినియోగించాలి.
* శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి, రంగ వల్లికలతో అలంకరించి.. దీపారాధన చేయాలి.
* రోజూ లేదా శుక్రవారం రాత్రిపూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో వుంచి వంటింట్లో వుంచడం సంప్రదాయం. ఇలా చేస్తే పితరులు, దేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ వుండుగాక అంటూ దీవిస్తారని ప్రతీతి.
* శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచివుంటుంది. ఇంకా స్టిక్కర్లను నుదుటన ధరించకుండా తెల్ల వక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది.
* తెల్ల వక్కలను, నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమానికి కస్తూరి పొడి, కుంకుమ పువ్వు పొడిని కలిపి చూర్ణం చేసుకుంటే కుంకుమ సిద్ధమవుతుంది. ఈ కుంకుమను నుదుటన ధరించడం ద్వారా సుగంధ భరితమైన సువాసనతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ధనవృద్ధి వుంటుంది.
* శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం. తెల్లని వస్త్రాలంటే శుక్రునికి, మహాలక్ష్మీకి ప్రీతికరం. తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
* అలాగే శుక్రవారం పూట కమలములతో, కలువలతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పుష్పాలను దానం చేసినా, అన్నదానం చేసినా, వస్త్ర దానం చేసినా శుభఫలితాలుంటాయి. కస్తూరిని మిత్రత్వం కోరి స్నేహితులకు అందించినా, శుక్రవారం వర్జ్యం వున్న సమయంలో మౌనవ్రతం పాటించినా ఆ ఇంట తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి