23, జులై 2023, ఆదివారం

వేదవిహితధర్మమే

 వేదవిహితధర్మమే శ్రేయఃప్రాప్తిహేతువు


ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మ ద్వైతవాసనా,

దుర్లభం త్రయ మేవైతత్ దైవాను గ్రహహేతుకమ్ ||

మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుషసంశ్రయః,

స్వవర్ణా శ్రమధర్మేణ తపసా హరితోషణాత్ ||

జ్ఞానముత్పద్యతే పుంసాంవైరాగ్యాది చతుష్టయం,

తథాప్యనుగ్రహాదేవ తరుణేందు శిఖామణేః |

అద్వైతవాసనా పుంసా మావిర్భవతి నాన్యథా||


మనుష్యత్వమూ, ముముక్షుత్వమూ, మహాపురుషుల సంశ్రయమూ యీ మూడూ దుర్లభములు, దైవానుగ్రహమే వీటికి హేతువు పరుషుల స్వవర్ణాశ్రమధర్మాల నాచరించడం వల్లా, తపోనిష్ఠచేతా, పరమేశ్వరుని ప్రీతుని చేయడంవల్లనూ, ఇహాముత్రఫలభోగ విరాగరూపమైన జ్ఞానాన్ని పొందగలుగుతారు.


''తరుణేందు శేఖరుడైన స్వామి అనుగ్రహం లేకుంటే అద్వైతవాసన పట్టుబడుదు.''

ఈశ్వరానుగ్రహంవల్లనే పురుషునకు పరమశ్రేయం దొరుకుతుందనియీవిధంగా ఆచార్యపురుషుల ఉపదేశములు, ఆప్తవాక్యములు భోధిస్తున్నవి. కనుక మనమందరం ఆ ఈశ్వరానుగ్రహంకోసం తీవ్రమైన యత్నం చేయవలసివుంది. సకల శ్రేయఃప్రాప్తికి ఆ యనుగ్రహమే కారణం. ఈశ్వరుడు మనకిచ్చిన ఆయుస్సంతటిని తదనుగ్రహ సంపాదనకోసమేవ్యయిస్తే సార్ధకమవుతుంది. ఇతర విధాల గడపిన ఆయువంతా వ్యర్థమే అవుతుంది.


కాబట్టి, నీబ్రతుకు ఫలవంతం కావాలంటే స్వామిఅనుగ్రహంమీదనే దృష్టిని నిలిపివుంచు. ఈశ్వరానుగ్రహ సంపాదనాన్ని ఏమరి ఒక్కక్షణం గడపినా నీ బ్రతుకంతా నిరర్ధకమైవూరుకుంటుంది. మావనులందరు ఈశ్వరభక్తియం దోలలాడ వలెననీ, ఈశ్వరానుగ్రహం అందరిమీదా ప్రసరింపచేయవలెననీ సర్వదా స్వామి చరణకమల సన్నిధిని చేరి వేడుకో. ప్రతి మానవునియందు ఈశ్వరపదార్థం ఉండనేవుంది. కనుక భక్తులైనవారు సకలమానవులను ఒక్కరీతిగానే భావించవలసివుంటుంది.


శ్రీ కామకోటిపీఠాన్ని ఏబదేండ్లుగా మేము సేవించితిమి. ఈ ఏబదేండ్లలో మేము చేసిన కార్యములను సింహావలోకనం చేయడంవల్ల అంతగా ప్రయోజనంలేదు. ఇకముందు కూడా పరమేశ్వరుడు మాకు ఏ కొంచెమో ఆయువు అనుగ్రహిస్తే దాని నెలా వినియోగించాలి? మాకు కర్తవ్యమేమిటి? అని విచారించుకోగా, నైష్కర్మ్య సంపాదనమే కర్తవ్యమని తేలుతున్నది. మరి భగవంతుడు గీతాశాస్త్రంలో నైష్కర్మ్యమంటే చేతులు ముడుచుకొని కూరుచుండటం కాదని పదేపదే సెలవిస్తూవచ్చారు. మీదుమక్కిలి కర్మాచరణంవల్లనే నైష్కర్మ్యం సిద్ధిస్తుందన్నారు. ఆకర్మ ఎంత తీవ్రమైనదో! ఏకర్మను ఆచరించడంవల్ల నైష్కర్మ్యసిద్ధి కలుగుతుందో? అని విచారించగా భగవత్పాదుల ఆజ్ఞయే గుర్తుకువస్తుంది. అందరికీ ఉపదేశిస్తున్న ఆయాజ్ఞనే మేమూ స్మరిస్తున్నాము. ''కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్యవిధియతా మపచితిః'' 'నీవంతుకు వచ్చిన కర్మను లెస్సగా ఆచరించు. అదే ఈశ్వరునకుతుష్టికూరుస్తుంది, అనేదే ఆ యాజ్ఞ.

కాబట్టి ఎవరివంతుకు వచ్చినపని వారువారు లెస్సగా ఆచరించాలి. స్వస్వకర్మాను ష్ఠానమును మించిన ఈశ్వరపూజా, ఈశ్వరారాధనమూ లేదు. భగవదనుగ్రహ సంపాదన కదే మార్గము. ఎవరివంతునకువచ్చిన కర్మలనువారువారు అనుష్ఠించుతూ తద్వారా ఈశ్వరార్చనపరులమై శ్రేయమును సంపాదించు కొందాము.


ఇతరులకు, మనకుకూడా శ్రేయంగూర్చే కర్మలనాచరించుట వల్లనే జన్మము చరితార్ధమగును. కడచిన ఏబదేండ్లలో మేము చేసిన పనులను అందలి లోపములను ఒకతూరి వెనుకకు పారజూచుకొన్నచో అది భావిజీవితానికి మార్గదర్శకం కాగలదు. కడచిపోయినదానిని గూర్చి వ్యర్ధముగా చింతించుచు గూర్చుండుటకంటె పాపపుణ్య వివేచనం చేసుకోగలిగితే అది దోషములనుండి కాపాడుతుంది.


ఏపనియైనా ఇతరులను కూడగట్టుకొని చేస్తే ఫలప్రదమవుతుంది. అలా యితరుల సహాయముతో మే మీ చరమ జీవితమున ఏమి చేయవలసిఉంటుందో ఆలోచించుకోవాలి. లోకంలో ఎవ్వరికీ దుఃఖము, లోపము లేకుండా అందరూ సుఖం పొందవలెననే విషయం సకల దేశాలవారు, సమస్త మతములవారు అంగీకరించి, అందుకై ఎంతో కృషిచేస్తున్నారు. బహుజనులకు అత్యధికసుఖం చేకూర్చడమే మాకు ధ్యేయమని అన్ని పార్టీలవారూ చెబుతున్నారు.


వేదవిహితమైన ధర్మాచరణంవల్లనే బహుజనులకు సుఖం లభిస్తుందని కనిపిస్తున్నది. శ్రేయఃప్రాప్తికి వేదవిహిత ధర్మమొక్కటే మార్గము.


ఎందరో మహనీయులు శ్రేయఃప్రాప్తికి మార్గములు చెప్పియున్నారుకదా! అట్టి వారిని కాదని, ఒక్క వైదికధర్మమునే ఎందుకు ఆశ్రయించాలి అని కొందరు ఆక్షేపించవచ్చును. ఇందుల కొక్కటే సమాధానము. ఇతర మత కర్తలు చెప్పిన ధర్మాలన్నీ వేదములందే పరిశీలించిచూస్తేకనిపించుతవి. ఇతర ధర్మగ్రంధములన్నీ వేదములకు పిమ్మటనేపుట్టినట్లు చరిత్రవల్ల ఏర్పడుతున్నది. వేదములు చెప్పని ధర్మమూసత్యమూ అంటూలేదు. వేదము లెప్పుడు పుట్టినవో మనము నిర్ణయింపలేము. వేదకాల నిర్ణయము చేయబూనడం నష్టజాతకాన్ని గణించడంవంటిది.


ఉదారము, నిర్మలమునైన మన వైదికధర్మమును అనుసరించకపోవడంవల్లనే మన మతము దుర్బలమై మనము కష్టనష్టముల పాలగుట తటస్థించినది. వైదిక ధర్మము తదనుయాయులను పరిశుద్ధులనుచేసి, ఈశ్వరానుగ్రహపాత్రులను గావింపగలదనీ, ఇతరమతములు పుట్టకమున్నే వైదికధర్మం లోకమంతటికీ మేలుగూర్చే మార్గం ఉపదేశించిందనీ మనం గ్రహించి ఇతరులకు తెలియచెప్పవలసివుంది. వేదములయం దేమాత్రమోభక్తిగల మన కందరకు ఇది విహితమైన పని. సమస్తమునకు మూలకందమైన వేదముల నాశ్రయించినచో శాఖలయందు వినవచ్చే భేదమర్మములన్నీ సమసిపోగలవు. వైదిక ధర్మావలంబులు ఇతరమతస్థులను రండని చేరబిలుచుట మన పనికాదు. అనాదియైన వేదమే సకల శ్రేయములకు మూలమని మనము గ్రహించినచో చాలును. ఇంతకంటే మనకిపుడు పరమధర్మము లేదు.


లోకమున భిన్న మతయలకు విరోధములు కొరగావని వేదము చెపుతూవుంది. ఎవరేమార్గ మనుసరించినను అందరు ఏకగమ్యమునేచేరుదురని వేదమొక్కటే చెప్పుచున్నది. ఇతర మతములు తమమార్గమేసత్యమని, తక్కినవినరకహేతువులనీ చెప్పుచున్నవి. ఒక గమ్యమునకే పెక్కుమార్గములున్నవని వేదముతప్ప ఇతరమతము లంగీకరింపవు. ఈ పరమార్ధమును గ్రహించు భారముమనపై నున్నది. కాని వేదవిహితానుష్ఠానముపై శ్రధ్ధలేక ధర్మాచరణమున ఇతర మతస్థులకంటె వెనుక బడియున్నచో యీ పరమార్ధమునుపదేశించే అర్హత మనకు కలుగదు.


సకల జగద్ధాత్రియైన పరమేశ్వరి, ఆపరాసక్తిని మనసారా భజించినచో లోకాని కేకొంచెమోక్షేమం చేకూర్చటంవల్ల మనం విశ్వాన్ని జయిచగలుగుతాం. జయించుట అంటే ఇతరుల కపజయం కూరుస్తామని కాదు. వారు, మనం ఎల్లరం శ్రేయస్సౌఖ్యములం దోలలాడగలుగుతాము. ఈ సత్యాన్ని గ్రహించి మాకు మిగిలియున్న జీవితమందు దీనిని సమస్త లోకానికి చాటిచెప్పి తోడిమానవులను సేవించుకునే శక్తిని పరమేశ్వరుడు మా కనుగ్రహించుకాక!

నమః పార్వతీపతయే


హరహర మహాదేవ.


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: