నిత్యాన్వేషణ:
చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారికి ఎందుకు అంత పేరు ప్రఖ్యాతులు లభించాయి?
దీనికి ముందుగా దివాకర్ల తిరుపతిశాస్త్రిగారు ఒక సందర్భంలో చెప్పిన మాటని చెప్పాలి.
ఎప్పుడూ తగాదాలాడుకుంటూ వుండే దివాకర్ల తిరుపతిశాస్త్రిని, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిని కలిపి అంటుకట్టి కీర్తిని, డబ్బుని నొల్లుకుంటూ గడపమని దేశం మీదకి వదిలారు గురువుగారు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి.
అలా అవధానాలు చేసుకుంటూ, చేసుకుంటూ పోలవరం జమీందారు వద్ద ఆస్థాన పండితునిగా ప్రవేశించాడు, దివాకర్లాయన. బందరు హైస్కూల్ లో తెలుగు టీచరయ్యారు చెళ్లపిళ్ల. కలిసి దేశం తిరగటం తగ్గింది.
నరసరావుపేటలోనో లేదా నూజివీడులోనో శతావధానానికి పిలుపు వచ్చింది. తను రాలేనని, దివాకర్ల ఒక్కడినే వెళ్ళమని చెళ్లపిళ్లవారు ఉత్తరం రాశారు. తిరుగుటపాలో దివాకర్ల "నువ్వు వస్తేనే సభ రక్తి కడుతుంది. జనం ఆనందిస్తారు. నేను ఒక్కడినే వెళితే ' ఎవరో వైదీకపు పోతుపేరంటాలు వచ్చి వెళ్లింది' అంటారు. అందుకని నువ్వు వస్తేనే వెళ్తాను" అని రాశారు.
దివాకర్లవారి సమాధానాన్ని బట్టి మీకు అర్థమై వుండాలి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారికి ఎందుకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయో!
చెళ్లపిళ్లవారు ధారాళంగా మాట్లాడగలరు. ఏకబిగిన 5, 6 గంటలపాటు కూడా.
మధ్య మధ్యలో సాహిత్య చమత్కారాలు, పిట్టకథలు, శృంగార జోక్స్, ప్రత్యర్ధులపై ఆశు ఎత్తుపొడుపులు….. ఓ… జల్లు జల్లులుగా పడుతుండేవి. వేరు వినోదాలు లేని ఆ రోజులలో జనం నోరు తెరుచుకొని వింటూ వుండేవారు. మీరు కథలు గాథలు చదివితే ఆయన శైలి, ఆయన ముచ్చట్లు, ఆయన చమత్కారాలు అన్నీ వివరంగా తెలుస్తాయి.
యివన్నీ కాక సాహిత్యంలో యోధానుయోధులైనవారు కలకాలం సాహిత్యంలో నిలిచిపోయే పేరుపెంపులు గలవారు ఆయన శిష్యులు.
యీ కారణాలు చాలవా, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారికి అతిశయించిన పేరుప్రఖ్యాతులు కలగటానికి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి