16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

రథసప్తమి

 *రథసప్తమి* special


*16-2-2024 తారీకున రథసప్తమి* రోజు ఆచరించవలసిన కొన్ని నియమాలు.


రథసప్తమి కొరకు ముందు రోజు నుంచే తయారు కావాలి. షష్టి రోజు నూనె వెయ్యని పదార్థాలు తినాలి రాత్రి ఉపవాసం ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. భూశయనం చెయ్యాలి ఇవన్నీ రథసప్తమికి ముందు రోజే అనగా షష్టి రోజు చేయవలసిన పనులు.(ఆరోగ్యం బాగున్న వారికి మాత్రమే).


రథసప్తమి రోజు చేయవలసిన నాలుగు విధులు


1. ప్రత్యేక స్నానం చేయాలి 

2. ఉపాసన 

3. నైవేద్యం 

4. దానం


1. ప్రత్యేక స్నానం చేయాలి:- రథసప్తమి రోజు వీలైతే ప్రవహించే నీరు (నది) లో స్నానం చేస్తే చాలా మంచిది అలా కానిపక్షంలో షవర్ ఉన్నవారు షవర్ స్నానం చేయండి. ఈ స్నానం చేస్తున్నప్పుడు ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగు ఆకులు శిరస్సుపై ఉంచుకొని 


నాలుగు శ్లోకాలు:


నమస్తే రుద్ర రూపాయా రసానాం పతయే నమః వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే 


**యధా జన్మ కృతం పాపం, మయా జన్మసుజన్మసు

తన్మే రోగంచ శోకంచ మఖరీ హంతు సప్తమి** 


**ఏతత్ జన్మ కృతం పాపం, యచ్చ జన్మాంతరార్జితం

మనోవాక్కాయజం యచ్చ, జ్ఞాతా జ్ఞాతేచ యే పునః**


**ఇతి సప్తవిధం పాపం, స్నానాన్ మే సప్త సప్తికే 

సప్త వ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి**


చదువుతూ స్నానమాచరిస్తే ఉత్తమ ఫలితం.


2. ఉపాసన:- వీలైనంతవరకు రక్త వర్ణ దుస్తులు అనగా ఎరుపు రంగు ధరించాలి చిక్కుడుకాయలతో రథం తయారు చేసి పూజాదికములు నిర్వహించాలి. వీలైన వారు సూర్యనారాయణ ప్రతిమను ఆ రథంలో ఉంచాలి లేనిపక్షంలో తమలపాకుపై ఎర్రచందనంతో సూర్యుని బొమ్మ చిత్రించి ఆ ఆకుని అందులో ఉంచాలి.


3. నైవేద్యం:- తులసి కోట దగ్గర వీలైతే ఆవు పిడకలతో (తంపి)పెట్టి దానిపై ఆవుపాలతో కొత్త బియ్యం నెయ్యి బెల్లంతో ప్రసాదం తయారు చేయాలి. ఈ ప్రసాదం కలపటానికి చెరుకు గడను వినియోగించాలి.


4. దానం:- రథసప్తమి రోజు దానం అక్షయ తృతీయ లాగే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వీలైనంతవరకు దానం చేయాలి. నోములు, వ్రతాలు, మంత్ర సాధన కొరకు గురు ఉపదేశం పొందుటకు రథసప్తమి చాలా అనువైన శుభదినం.

కామెంట్‌లు లేవు: