16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

రథసప్తమి

 🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏


💥మాఘ శుద్ధ సప్తమి.. #రథసప్తమి.


ఆదిదేవ! నమస్తుభ్యం - ప్రసీద మమ భాస్కర |

దివాకర! నమస్తుభ్యం - ప్రభాకర నమోస్తుతే ||


సకల జీవకోటికి ప్రాణప్రదాత అయిన సూర్యున్ని హిందువులు ప్రత్యక్ష్య దైవంగా భావిస్తారు.


సమస్త జీవజాలం సూర్యునిపైనే ఆధారపడి ఉందని ఋగ్వేదం (1-164) చెబుతోంది. వైదిక సాంప్రదాయాల్లో సూర్యుడికి విశిష్ట స్థానం కల్పించబడింది.


సూర్యున్ని త్రిమూర్తి స్వరూపుడిగా భావించి..


బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం|

సాయం ధ్యాయే సదా విష్ణుం త్రయీమూర్తిద్ధివాకరః||


అంటే ఉదయం బ్రహ్మ స్వరూపంగా, మధ్యాహ్నం పరమేశ్వర స్వరూపంలో, సాయంకాలం విష్ణురూపునిగా స్తుతిస్తాం.


రథసప్తమి రోజున సూర్యోదయ కాలంలో పుణ్యస్నానాన్ని చేయడం, సూర్యున్ని పూజించడం చేయాలి.


ఈనాటి సూర్యారాధన వలన ఎంతటి అనారోగ్యమైనా తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, అకాల మరణం నివారింపబడుతుందని, సకల సంపదలు కలుగుతాయని చెప్పబడినది.


💥రథసప్తమి వ్రతాచరణలో స్నానం, దీపం, అర్ఘ్యం, ఉపచార పూజ, తర్పణం ముఖ్యమైనవి.


#స్నానం:


సప్తమి ముందురోజు రాత్రి అంటే షష్ఠి రోజు రాత్రి ఉపవాసం ఉండి, సప్తమి నాడు సూర్యోదయ సమయంలో స్నానాన్ని ఆచరించాలి.


రథసప్తమి స్నానం వలన సకల రోగాలు నివారింపబడుతాయి, ఏడేడు జన్మల పాపాలు హరింపబడుతాయని ధర్మ సింధువు పేర్కొంటుంది.


రథసప్తమి స్నానాన్ని నదిలోనో, పుణ్యతీర్థం లోనో, చేయడం మంచిది. అది వీలుకానప్పుడు కనీసం చెఱువులోనో, కాలువలోనో లేక బావి దగ్గరో చేయటం మంచిది.


స్నానం చేసేటప్పుడు...


యద్యజ్జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు

తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ

ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం

మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః


అనే మంత్రాన్ని చెప్పుకోవాలని ధర్మ సింధువు చెబుతోంది.


అంటే జన్మ మొదలుగా చేసిందీ, జన్మాంతరాలలో చేసిందీ అయినటువంటి రోగ రూపంలోనూ, శోక రూపంలోనూ ఉండే పాపమంతా మకరంలోని సప్తమి హరింపచేయాలని, ఈ జన్మలోనూ, జన్మాంతరంలోనూ మనస్సు చేత, వాక్కు చేత, ఇంద్రియముల చేత తెలిసి, తెలియక చేసిన పాపములన్నీ సూర్య ప్రియమైన ఈ మకర సప్తమి స్నానం చేత నశింపబడాలనే అర్థంలో ఈ మంత్రాన్ని పఠిస్తారు.


రథసప్తమి స్నానంలో జిల్లేడు లేదా రేగు ఆకులను తలపైనా, భుజాల పైన, చేతులపైన, మోకాళ్ల పైన ఉంచుకొని స్నానం చేయాలి.


#దీపం:


స్నానానికి ముందు ప్రమిదలో గానీ, ఆకులతో చేసిన దొన్నెలో గానీ దీపాన్ని వెలిగించి దానిని తలపై పెట్టుకుని


నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః|

అరుణాయ నమస్తేస్తు హరిద్రాశ్వ నమోస్తుతే||


అని సూర్యుని ధ్యానిస్తూ ఆ దీపాన్ని నీటిలో వదలాలి. దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించాలి. లభించని పక్షంలో నువ్వుల నూనె లేక ఇతర నూనెలు వాడవచ్చు.


#అర్ఘ్యం:


స్నానం తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ అర్ఘ్యాన్ని


సప్త సప్తివహ ప్రీత! సప్తలోక ప్రదీపన!

సప్తమీ సహితో దేవ! గృహాణార్ఘ్యం దివాకరః!


అనే మంత్రంతో ఇవ్వాలి.


#ఉపచార_పూజ:


అర్ఘ్యాన్ని ఇచ్చిన తరువాత సూర్యదేవుణ్ణి షోడశోపచారాలతో పూజించాలి. ఈ పూజలో సూర్యునికి విధిగా తీపి పొంగలిని నివేదించాలి.


ఈ పొంగలిని ధనుర్మాసంలో పెట్టే గొబ్బి పిడకలతో పొయ్యిని వెలిగించి చేయటం కొన్ని చోట్ల ఆచారంగా ఉంది.


సూర్యునికి ఎదురుగా ఆవు పేడ పిడకలతో ...ఇత్తడి గిన్నెలో ఆవుపాలను పొంగిస్తారు. పొంగిన తరువాత బియ్యం, బెల్లం కలిపి పరమాన్నం చేస్తారు. చిక్కుడు ఆకులలో ప్రసాదంగా తీసుకొంటారు.


#తర్పణం:


ఈ రోజు నుంచి వరుసగా అయిదు రోజులు అంటే – సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశిలను “#భీష్మ_పంచకం” అని అంటారు.


భారత యుద్ధంలో అర్జునుని శరాఘాతానికి కుప్పకూలిన భీష్మ పితామహుడు అప్పటికి ఇంకా దక్షిణాయనం అవటం వలన ఉత్తరాయణ పుణ్యకాలం రావటం కోసం అంపశయ్య మీద ఎదురుచూసి ఈ అయిదు రోజులలో రోజు కొక్కటి చొప్పున పంచ ప్రాణాలు వదిలేసాడని పురాణ గాధ. అందుకే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలే ఆచారం కూడా ఉంది.


సూర్యానుగ్రహం వలన సకల కోరికలు నెరవేరుతాయని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. 

🪷🪷🪷

కామెంట్‌లు లేవు: