16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

శ్రీ కృష్ణావతారం

 🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *పురాణ పఠనం*

. *🪐శ్రీ కృష్ణావతారం🪐*

. *92వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*సాళ్వుని వధించుట* 


అప్పుడు తన మీద పదునైన బాణాలను గుప్పిస్తున్న సాల్వుడిని చంపటానికి శ్రీకృష్ణుడు నిశ్చయించుకొని, తన తిరుగులేని తీవ్రమైన బాణాలను వర్షధారలవలె ప్రయోగిస్తూ ఆకాశాన్ని కప్పివేసి శత్రువు కిరీటాన్నీ ధనుస్సునూ కవచాన్నీ ఛేదించి వేశాడు. మహాక్రోధంతో శ్రీకృష్ణుడు విశ్వవిఖ్యాతమైన వీరవిజృంభణంతో ఆకాశంనిండా మెరుపులు వ్యాపించేలా గదాదండాన్ని విసిరి త్రిపురాల వంటిదీ గొప్ప మాయతో విరాజిల్లుతున్నది అయిన సాల్వుడి సౌభకవిమానాన్ని తుత్తునియలు చేసాడు.ఆ విధంగా మయడు నిర్మించిన మాయావిమానాన్ని శ్రీకృష్ణుడు తన గదాఘాతంతో ముక్కలు చేసి సముద్రమధ్యంలో పడేలా చేసాడు. అప్పుడు సాల్వుడు కోరలు తీసిన క్రూరసర్పంలా దీనుడై మాయాబలం నశించి కూడ, మొక్కపోని పరాక్రమంతో భూమికి దిగాడు. ఓ రాజా నరేంద్రా! సాల్వుడు వజ్రాయుధంతో సమానమైన భయంకర గదను చేతబట్టి కృష్ణుడిని ఎదుర్కొన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ గదతో సహితంగా వాడి చేతిని ఖండించివేసాడు. అంతటితో ఆగకుండా శ్రీకృష్ణుడు ప్రళయకాల సూర్యమండల ప్రభలను వెదజల్లే సుదర్శన చక్రాన్ని సాల్వుడి మీద ప్రయోగించాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్రాసురుని చంపినట్లుగా, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వేసి మకరకుండల రత్నాలతో విరాజిల్లుతున్న సాల్వుడి తలను ఖండించాడు.


 దంతవక్త్రుని వధించుట 


ఆ విధంగా శ్రీకృష్ణుడు సాల్వుడిని సౌభకవిమానాన్నీ ధ్వంసం చేయటం చూసిన దంతవక్త్రుడు తన మిత్రులైన సాళ్వ, పౌండ్రక, వాసుదేవ, శిశుపాలురకు ఉత్తరక్రియలు పూర్తి చేసి; మిక్కిలి భయంకరాకారంతో కృష్ణుడి మీదకు వచ్చాడు. పండ్లు పట పట కొరుకుతూ, కళ్ళనుండి నిప్పుకణాలు రాలుస్తూ, పాదఘట్టనలతో భూమివణికేలా అడుగులు వేస్తూ, గద గిరగిర త్రిప్పుతూ, ఎండాకాలపు సూర్యుడిలాగా మండిపడుతూ దంతవక్త్రుడు కృష్ణుడిని వచ్చి తాకాడు. ఆ విధంగా

తన మీదకి వస్తున్న దంతవక్త్రుడిని చూసిన శ్రీకృష్ణుడు వికసించిన హృదయంతో గద చేత పట్టి రథం దిగాడు. పూని ఉగ్రంగా విరోధికి ఎదురు నడిచాడు. దంతవక్త్రుడు అట్టహాసంగా గద త్రిప్పుతూ నీచంగా మురారిని.....

ఎగతాళి చేస్తూ ఇలా అన్నాడు. “ఓ కృష్ణా! ఈనాడు నీవు నా భాగ్యవశం వలన నాకు ఎదురుగా కనపడ్డావు. నువ్వు బంధువు రూపంలో ఉన్న విరోధివి. శరీరంలో ప్రవేశించిన భయంకరవ్యాధిని మందులతో పోగొట్టే వైద్యుడిలా, మేనమామ కొడుకువు అనే అభిమానం లేకుండా వజ్రాయుధం లాంటి నా గదాయుధంతో మిత్రద్రోహివైన నిన్ను యమలోకానికి పంపిచేస్తాను. నిన్ను చంపి నీవు చంపిన నా మిత్రుల ఋణాన్ని తీర్చుకుంటాను.” అంటూ దంతవక్త్రుడు శ్రీకృష్ణుణ్ణి దుర్భాషలాడుతూ దగ్గరకు వచ్చి..దంతవక్త్రుడు తన గదాదండంతో కృష్ణుడి తలమీద మోదాడు. అంకుశం పోటుకి కోపించెడి మదగజంలా, శ్రీకృష్ణుడు ఆగ్రహించి వజ్రాయుధంలాంటి గదతో వాడి వక్షస్థలాన్ని పగులకొట్టడంతో, వాడు రక్తం కక్కుతూ నేలకూలాడు. తక్షణమే పర్వతంవంటి దేహంతో దంతవక్త్రుడు నేలపడి శిరోజాలు విడివడి చిక్కులు పడేలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు. అప్పుడు, వాడి దేహం లోంచి ఒక సూక్ష్మతేజం వెలువడి శ్రీకృష్ణుడి శరీరంలో ఐక్యం అయింది. సకల జీవులూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో విదూరథుడు అను వాడు అన్న మరణం చూసి అతి కోపంతో ప్రళయకాలపు అగ్నిజ్వాలవంటి భయంకరమైన కత్తి, డాలు ధరించి శ్రీకృష్ణుడి పైకి దూకాడు. చక్రి అది చూసి.....కృష్ణుడు తన చక్రాయుధం పూని వేయడంతో, అది వాని శిరస్సును ఖండించింది. అలా బలవంతుడైన శ్రీకృష్ణుడు సౌభకంతో పాటు, సాల్వుణ్ణీ, శిశుపాలుణ్ణీ, వాని తమ్ముడు విదూరథుణ్ణీ, వారి సోదరులతో సహా సంహరించాడు. ఇంతేకాక, వారి వంశం వారిని చాలా మందిని చంపాడు.అలా సాల్వాదులను అంతమొందించిన సమయంలో.....మానవులు, మునులు, యోగులు, దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, ఖేచరులు మొదలైన వారంతా ఆశ్చర్యానందాలతో శ్రీకృష్ణుని ప్రభావాన్ని స్తుతించారు. అప్సరసలు ఆనందంతో నృత్యాలు చేస్తుండగా, దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవ దుందుభులు మ్రోగుతుండగా, యాదవ వీరులు సేవిస్తుండగా, వందిమాగధులు తన విజయ గాథలను గానం చేస్తుండగా, బహు మనోజ్ఞములైన వైభవాలతో, నందనందనుడు పరమానందంతో ఒక శుభముహుర్తంలో నవ్యనూతన అలంకారాలతో విరాజిల్లుతున్న ద్వారకానగరం ప్రవేశించాడు. అప్సరసలు ఆనందంతో నృత్యాలు చేస్తుండగా, దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవ దుందుభులు మ్రోగుతుండగా, యాదవ వీరులు సేవిస్తుండగా, వందిమాగధులు తన విజయ గాథలను గానం చేస్తుండగా, బహు మనోజ్ఞములైన వైభవాలతో, నందనందనుడు పరమానందంతో ఒక శుభముహుర్తంలో నవ్యనూతన అలంకారాలతో విరాజిల్లుతున్న ద్వారకానగరం ప్రవేశించాడు. ఆ సమయంలో నగరంలోని స్త్రీలు మేడలమీద నుండి శ్రీకృష్ణుడిమీద పూలు అక్షతలు కురిపిస్తుండగా, శ్రీకృష్ణుడు మహావైభవంతో అంతఃపురం ప్రవేశించాడు. మహాయోగులకు ఈశ్వరుడు, షడ్గుణైశ్వర్యములు సమృద్ధిగా కలవాడు, సకల జగత్తులకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడు అలా నగరం ప్రవేశించి, ద్వారకలో సుఖంగా ఉన్నాడు.


ఓ పరీక్షిన్మహారాజా! కౌరవ పాండవులకు యుద్ధం ప్రారంభం కానున్నదని తెలుసుకుని ఇరుపక్షాలకూ కావలసిన వాడు కనుక, బలరాముడు బయలుదేరి తీర్ధయాత్ర నెపంతో వెళ్ళిపోయాడు.


సశేషం🙏


*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: