*🌹🌹🌹అమృతస్య పుత్రాః🌹🌹🌹*
*శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం*
*మొదటి భాగము*
*ప్రవృత్తి నివృత్తి*
*వేదాలు ప్రవృత్తి, నివృత్తియని రెండు మార్గాలు చూపించాయి. ప్రపంచ వ్యవహారాలను ధార్మికంగా నిర్వహించడం ప్రవృత్తిమార్గం. ప్రాపంచిక వ్యవహారానికి దూరంగా ఉండి జనన మరణ ప్రవాహం నుండి విముక్తుడగుట, పరమాత్మతో ఐక్యమగుట నివృత్తిమార్గం.*
*ప్రవృత్తిమార్గం, వేదచోదిత ధర్మంపై ఆధారపడి వర్ణాశ్రమాలతో ఉండి తన శ్రేయస్సునకు, సంఘ శ్రేయస్సునకు తోడ్పడే రీతితో ఉంటుంది. పుణ్య కర్మ ఫలం క్షీణించగా మరల జన్మనెత్తుట జరుగుతుంది.*
*అంటే స్వర్గ సౌఖ్యము శాశ్వతము కాదని తేలినట్లే గదా! లోకంలో గాని, స్వర్గంలో కాని శాశ్వత సుఖం అంటూ లేదు. ఇక్కడా, అక్కడా భయం, దుఃఖం, క్రోధం మామూలే! కన్ను, చెవులు మొదలైన ఇంద్రియాల వల్ల కొంత సౌఖ్యం అనుభవించే మాట నిజమే. కాని లోనున్న ఆత్మకు ఇవి సంతోషాన్ని ప్రసాదిస్తాయా? ఆత్మతృప్తి కల్గుతుందా?*
*అఖండానందం అనుభవించాలంటే నివృత్తి మార్గాన్నే అనుసరించాలి. సంఘానికి దూరంగా ఉండి ఆత్మనే చింతిస్తూ అదే బ్రహ్మమని భావిస్తూ సమాధి స్థితిలో ఉండిపోవడమే. లౌకిక సుఖాలననుభవిస్తూ ఒక్కొక్కప్పుడు బ్రహ్మానందం అంటూ ఉంటారు.*
*నిజమైన బ్రహ్మానందం నివృత్తి మార్గంలోనే. ఇలా అని నేను చెప్పడం కాదు. వేదమే 'అనావృత్తి శబ్దాత్, అనావృత్తి శబ్దాత్' అని చెప్పిందని బ్రహ్మసూత్రాలలో ఉంది. శబ్దమనగా ఇక్కడ వేదం. ఇదే ఛాందోగ్యోపనిషత్ మరల మరల చెప్పింది. నివృత్తి మార్గం వల్లనే పరమ సుఖమని, వీటి తాత్పర్యం.*
*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి