4, జూన్ 2024, మంగళవారం

హనుమజ్జయంతి ప్రత్యేకం - 4/11

 ॐ       హనుమజ్జయంతి ప్రత్యేకం -  4/11 

        (ఈ నెల 1వ తేదీ హనుమజ్జయంతి) 


IV.హనుమ - శిశువుగానే పొందిన వరాలు  

     

*వాయుదేవుని సమ్మె 


    శిశువుగా ఉన్నప్పుడే, ఆకలి కలిగియున్నప్పుడు,

    సూర్యుని ఫలమనుకొని, పొందుటకు ఎగిరాడు ఆంజనేయుడు.  

    సూర్యునివద్డ మారుతిని చూచి, రాహువు ఇంద్రునికి ఫిర్యాదు చేయగా,       

    ఇంద్రుడు వచ్చి వజ్రాయుధం ప్రయోగించడం సంభవించింది. 

    అప్పుడు ఆ వజ్రాయుధం ఆంజనేయుని దౌడ(హనుమ)కు తగిలి, స్వామి నిర్జీవుడై పడిపోవడం జరిగింది. 

    అదిచూసి, వాయుదేవుడు సకల జీవరాశి నుంచి బయటకు వచ్చి సమ్మె చేశాడు. 


*వాయువు ప్రాముఖ్యత -  బ్రహ్మదేవుని మాట


   "శరీరము లేని వాయువు శరీరాన్ని పాలిస్తూ, దానిలో సంచరిస్తూంటుంది. 

    వాయువు లేకపోతే శరీరం కట్టెలాగా అయిపోతుంది. 

    వాయువే ప్రాణము. వాయువే సుఖము. ఈ సమస్త జగత్తూ వాయువే. 

    వాయువు విడిచివేస్తే జగత్తుకు సుఖముండదు. 

    ఆయుర్దాయ స్వరూపుడైన వాయువు జగత్తును ఇప్పుడే విడిచాడు. 

    ప్రాణులన్నీ ఇప్పుడే ఉచ్ఛ్వాసనిశ్వాసలు లేకుండా కర్రలవలే, గోడలవలే అయిపోయాయి. 

    అందుచేత మనము, మనకు అనారోగ్యం కలిగించిన వాయువు ఉన్నచోటుకి వెళదాము. 

    ఆ వాయువును అనుగ్రహింపజేసికొనకుండా మనకు ఆరోగ్యం లేదు." 


    అంటూ, దేవతలతో వచ్చి, 

    ఆంజనేయుని పునర్జీవితుని చేశాడు. వాయువుకి సంతోషపరిచాడు. 

    సమ్మె విరమించి, వాయువు సకల ప్రాణులకూ మోదం కలిగించాడు. 


*హనుమకి దేవతల వరాలు 


    వాయువుకి సంతోషం కలిగించడానికీ, 

   భవిష్యత్తులో దేవతల గొప్పకార్యాన్ని మారుతి నిర్వహించడానికీ, 

   దేవతలందఱినీ మారుతికి వరాలిమ్మన్నాడు బ్రహ్మదేవుడు. 

    అప్పుడు, 


1.ఇంద్రుడు: 

    బంగారు పద్మహారమునిచ్చి, 

    హనుమ అని నామమిడి, 

    తన వజ్రాయుధము వలన ఏ హానీ కలుగదన్నాడు. 


2.సూర్యుడు: 

    తన తేజస్సులో నూఱోవంతు ఇస్తున్నాననీ, 

     శైశవ దశనించీ విద్యార్జన స్థితి రాగానే, 

    సకల శాస్త్ర జ్ఞానాన్నీ కలిగిస్తాననీ, 

    తద్వారా వాక్చతురుడు కాగలడనీ, 

    శాస్త్రజ్ఞానమందు హనుమతో సరితూగగలవాడు మరొకడుండడనీ అన్నాడు. 


3.వరుణుడు: 

    తన పాశము వలనగానీ, జలములవలనగానీ, 

    లక్షలకొలది సంవత్సరాల వరకూ మృత్యుభయం ఉండకుండా వరమిచ్చాడు. 


4.యముడు: 

    తన దండము వలన మృత్యువు కలగదనీ, 

    ఎల్లప్పుడూ ఆరోగ్యభాగ్యాలతో వర్ధిల్లుతాడనీ, 

    యుద్ధమునందు విషాదగ్రస్తుడు కాడనీ మారుతికి వరాలొసగాడు. 


5.కుబేరుడు:  

    సమరమునందు తన గద ఆంజనేయునికి ఎట్టి ఆపదను కలిగించదన్నాడు. 


6.శంకరుడు: 

    తన వలన గానీ, శూల పాశుపతాస్త్రాది తన ఆయుధాల వలనగానీ హనుమ వధ్యుడు కాడని వరమనుగ్రహించాడు. 


7.విశ్వకర్మ: 

    తాను నిర్మించిన దివ్యశస్త్రములలో ఏ ఒక్కటైననూ రణమందు వధింపజాలదనీ, 

    చిరంజీవి అవుతాడనీ హనుమకి వరాలిచ్చాడు. 


8.బ్రహ్మ: 

    ఏ బ్రహ్మదండంచేతనూ వధ్యుడు కాడనీ, 

    దీర్ఘాయువనీ మారుతికి వరాలిచ్చి, 


 వాయుదేవునితో మారుతిని గూర్చి 

  - శత్రువులను గడగడలాడించగలడనీ, 

  - మిత్రులకు అభయప్రదాత అవుతాడనీ, 

  - యుద్ధంలో శత్రువులకు అజేయుడై వర్ధిల్లుతాడనీ, 

  - కోరుకొన్న రూపాలను పొందగలడనీ, 

  - ఇష్టానుసారంగా అంతటా - వేగంగానూ, నెమ్మదిగానూ సంచరింపగలడనీ, 

  - చిరస్థిరకీర్తితో వర్ధిల్లగలడనీ, 

  - యుద్ధమునందు అతడొనర్చే వీరోచిత సాహసాద్భుత కృత్యాలన్నీ రావణ సంహారానికి కారకాలవుతూ, అవి రామునకు ప్రియము గూర్చుతాయనీ, 

    లోకాలకు రోమాంచమునూ సంతోషాన్నీ కలిగిస్తాయనీ పేర్కొన్నాడు. 


    ఆ విధంగా సకల వరాలూ పొందిన శిశువైన మారుతిని, వాయుదేవుడు అంజనాదేవి వద్దకు తీసుకువచ్చి, ఆమెకు అప్పగించి, వరాలగూర్చి వివరించి వెళ్ళాడు.


*సందేశం 


    జాంబవంతుడు హనుమ శక్తిని పొగిడి సముద్రలంఘనం చేయించాడు. 


    మనం కూడా స్వామిని స్తుతిస్తే సకల శుభాలూ కలిగిస్తాడు.   

    ప్రతిరోజూ ఆరాధిస్తూ, 

    సకల శాస్త్ర పారంగతుడూ, సర్వశక్తిమంతుడూ అయిన హనుమని సేవిద్దాం. 

    మన జీవిత లక్ష్యాలని నెరవేర్చుకొందాం. 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

కామెంట్‌లు లేవు: