4, జూన్ 2024, మంగళవారం

ఇతరులను నిందించి ప్రయోజనం లేదు

 165


ఇతరులను నిందించి ప్రయోజనం లేదు


పారమార్థిక సాధకుడు అందరితో కలిసిమెలసి ఉండకపోవచ్చు. కానీ ఎవరినీ చిన్నచూపు చూడకూరదు. పవిత్రమైన జీవితం గడపని వారిని నిందిస్తూ, నేను వారికంటే అధికుణ్ణి అని భావించడం మంచిది కాదు. 'నేను నీ కంటే 'పవిత్రుడ్డి' అన్న వైఖరి మనల్ని మితిమీరిన విశ్వాసంలో ముంచివేసి, అజాగ్రత్త వరులుగా తయారుచేస్తుంది. కానీ సాధకుడు అపవిత్రమైన మనుష్యుల నుంచీ, వారి స్పందనల నుంచీ తనను తాను కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక శక్తిని కూడగట్టుకుని, ఇతరులను మార్చగలిగే స్థాయికి ఎదిగినప్పుడు మాత్రమే, అందరితో నిస్సంకోచంగా కలసిపోవచ్చును. భగవంతుడు చరాచర సృష్టిలోని అన్ని జీవులలోనూ ఉన్నమాట నిజమే అయినా, మనం ఉన్న పరిస్థితులలో, ఆయన యొక్క కొన్ని రూపాలతో మిళితం కావడం శ్రేయస్కరం కాదు. ఆయా వ్యక్తీకరణలకు దూరం నుంచే నమస్కరించాలి!


కానీ ఒక్కోసారి తప్పనిసరిగా చెద్దవారితో కలవవలసి వస్తుంది. అప్పుడు ఏమి చేయాలి? మీరు వారిని నిరసిస్తూ, పట్టించుకోకుండా ఉండకూడదు. అత్యంత జాగరూకతతో మెలుగుతూ, మనస్సులోనే ఒక అడ్డుగోడను నిర్మించుకోవాలి. ఒక అంతర్నిర్మిత కవచంతో మిమ్మల్ని మీరు రక్షించుకోండి. కూలంకషంగా ఆత్మవిశ్లేషణ చేస్తూ, చెడు ముద్రలు మీలో వేళ్ళూనుకునే లోపలే, వాటిని బయటకు పంపించి వేయాలి. నిజమైన సాధకుడు ఎల్లప్పుడూ తన వివేచనను ఉపయోగిస్తుంటాడు. అది ఒక అలవాటుగా మారుతుంది. భగవంతుని వైపు పరుగుపరుగున చేరే మనస్తత్వంతో మెలగండి. 'బేబి కంగారూ' (ఆస్ట్రేలియా ఖండంలో కనిపించే 'కంగారూ' అనే జంతువు పిల్ల) ఏమి చేస్తుందో దాన్ని అనుకరించండి. అది అపాయం ఎదురైనప్పుడు రక్షణ కోసం తన తల్లి పొట్ట మీదున్న సంచిలోకి దూకినట్లు, మీరు కూడా భగవంతుని సాన్నిధ్యంలోనికి తక్షణం చేరడాన్ని సాధన చేయండి.

కామెంట్‌లు లేవు: