4, జూన్ 2024, మంగళవారం

గంధర్వ గానం

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*

04.06.2024


ఆ పాట అధరామృతం.. ఆ గానం గంధర్వ గానం. ఆయన గళం విప్పితే పాటే ఆయనకు ప్రణమిల్లుతుంది. అందుకే ఆయన గాన గంధర్వుడయ్యారు. స్వర బ్రహ్మగా జన నీరాజనాలు అందుకుంటున్నారు. శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం మన బాలు అయ్యారంటే ఆయన కృషి పాలు ఎంతుందో మనకు అర్థమవుతుంది.


శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.. ,1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుకి.. తొలిసారిగా 1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది.ఎంతమంది కథానాయకులకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్పగాయకుడు ఎస్. పి. బీ. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం బాలసుబ్రహ్మణ్యం. తెలుగు సినిమా పాటకు ఘంటసాల తరువాత లభించిన సిసలైన వారసుడు బాలసుబ్రహ్మణ్యం.


పదాల మాధుర్యాన్ని గమనించి.. బాలూ చేసే ఉచ్చారణ పాటను పండిత పామరులకి చేరువ చేసింది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి.. ప్రాణం పోశారు. ఒక పాట విన్న తర్వాత ఆ పాట ఏ హీరోదో చెప్పడం అది బాలూ పాడితేనే సాధ్యం. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటారు బాలూ. హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నారు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది.

కామెంట్‌లు లేవు: