12, జూన్ 2024, బుధవారం

శ్రీమద్భాగవత విశిష్టత

 శ్రీమద్భాగవత విశిష్టత  !!    


భాగవతంలోని అంశాలు - ప్రత్యేకత 


    శ్రీమద్భాగవతం ఇతర పురాణాలకంటే విశిష్టమైనది. 

    ఇతర పురాణాలలో ప్రధానంగా, 

1. సర్గము, 

2. ప్రతి సర్గము, 

3. వంశము, 

4. మన్వంతరములు, 

5. వంశానుచరితము - అనే ఐదే అంశాలు ఉంటాయి. 


    అయితే, శ్రీమద్భాగవతంలో అలా కాక పది అంశాలుంటాయి. 


శ్లో॥ 

అత్ర సర్గోవిసర్గశ్చ స్థానం పోషణ మూతయః I 

మన్వంతరేశాను కథాః నిరోధోముక్తిరాశ్రయః ॥ 


ఆ పది అంశాలు 


1. సర్గము : ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి అనేవి పంచభూతాలు. 

    శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనేవి పంచతన్మాత్రలు. 

    వాక్, పాణి, పాద, పాయు అవస్థలనేవి కర్మేంద్రియాలు. 

    త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణాలనేవి జ్ఞానేంద్రియాలు. 

    మనోఽహంకార చిత్తాలతో కూడిన ఇవన్నీ ఏర్పడిన విధానాన్ని నిర్ణయించడమే సర్గము. 

2. విసర్గము : సత్త్వరజస్తమో గుణాలనే ప్రకృతి ధర్మాలతో పరమాత్మ భిన్నభిన్న స్వరూపాన్ని వర్ణించడం. 

3. స్థానం : వైకుంఠుడైన పరమాత్మ సర్వులనూ జయించి సర్వోత్కర్షగా ప్రకాశించినట్లు వర్ణించడం. 

4. పోషణం : పరమాత్మ అనుగ్రహాన్ని వర్ణించడం. 

5. ఊతులు : ఆయాకర్మ వాసనలు ఎల్లా ప్రభావం చూపెడతాయో వర్ణించడం. 

6. మన్వంతరము : సజ్జనులుండవలసిన విధానాన్ని వర్ణించడం. 

7. ఈశాను కథలు : పరమాత్మా, ఆయనకు అనుయాయులైన విశిష్ట భక్తులూ అవతరించి చేసిన ఘనకార్యాలని వర్ణించడం. 

8. నిరోధము : పరమాత్మ తన శక్తులతో నిద్రాముద్ర వహించడాన్ని వర్ణించడం. 

9. ముక్తి : శరీదాది ఇతర స్వరూపం తనది కాదనీ, తాను కేవలం ఆత్మననీ గ్రహించడం. 

    శరీరాదులయందు "నేను" అను భ్రమను తొలగించుకొని స్వస్వరూపంతో ఉండడమే ముక్తి. 

10. ఆశ్రయం : ఎవరి నుండీ, 

                       ఎవరి యందే, 

                       ఎవరి వలననే, 

    ఈ జగత్తుకు సృష్టి, 

                        స్థితి, 

                        లయాలు ఏర్పడుతున్నాయో, అలాంటి పరమాత్మే ఆశ్రయము. 


*  భాగవతాన్ని ఆశ్రయించి లబ్ధి పొందడమే జీవిత గమ్యం - అని వ్యాసమహర్షి అందిచ్చిన అద్భుత గ్రంథం భాగవతం. 

*  తెలుగువారికి పోతనామాత్యులవారు అందిచ్చిన భాగవతం, మరింత సులువుగా భక్తి జ్ఞాన వైరాగ్యాలని అందించడానికి, సాక్షాత్తూ శ్రీరామచంద్రుని అనుగ్రహం.!!

* 🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: