7, జులై 2024, ఆదివారం

మనస్సు పెట్టును.

 *బాలాస్తావత్క్రీడాసక్తః*

*తరుణస్తావత్తరుణీసక్తః|**

*వృద్ధస్తావచ్చింతాసక్తః*

*పరేబ్రహ్మణి కోఽపి న సక్తః॥* 

బాలుడు ఆటలపై మనస్సు పెట్టును. యువకుడు యువతిపై మనస్సు పెట్టును. ముసలివాడు చింతపై మనస్సు పెట్టును. పరబ్రహ్మపై ఎవడూ మనస్సు పెట్టడు.

*కా తే కాంతా కస్తే పుత్రః* 

*సంసారోఽయమతీవ విచిత్రః|* 

*కస్య త్వం కః కుత ఆయాతః*

*తత్త్వంచింతయ తదిహ భ్రాతః ||* 

నీ భార్య ఎవరు? నీ పుత్రుడు ఎవరు? ఈ సంసారము చాలా విచిత్రమైనది. నీవెవడివాడవు? ఎవడవు? ఎక్కడినుండి వచ్చావు? ఓ సోదరుడా! తత్త్వమునాలోచింపుము.

*సత్సంగత్వే నిస్సంగత్వం* 

*నిస్సంగత్వే నిర్మోహత్వమ్|* 

*నిర్మోహత్వే నిశ్చలతత్త్వం* 

*నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||* 

సత్పురుషసాంగత్యము వలన భవబంధములూతొలగును.బంధములు తొలగినచో మోహము నశించును. మోహము నశించగా స్థిరమైన జ్ఞానమేర్పడును. స్థిరజ్ఞానమేర్పడగా జీవన్ముక్తి కలుగును.

*వయసిగతే కః కామవికారః* 

*శుష్కే నీరే కః కాసారః|* 

*క్షణేవిత్తే కః పరివారః*

*జ్ఞాతే తత్త్వే కః సంసారః ||* 

వయస్సు మళ్ళినచో కామవికారమెక్కడ? నీరెండిపోగా చెరువెక్కడ? సంపదక్షీణించినచో బంధువులెక్కడ? తత్త్వజ్ఞానమేర్పడగా సంసారమెక్కడ?

 *మా కురు ధన జన యౌవన గర్వం*

*హరతి నిమేషత్కాలః సర్వమ్*

*మాయామయ మిదమఖిలం బుధ్వా*

*బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా* ||

ధనము - జనము - యౌవనము చూచి గర్వపడకుము.వీటన్నిటినీ కాలము ఒక్క క్షణములో హరించును. మాయామయమయిన ఈ ప్రపంచమును విడిచి జ్ఞానివై బ్రహ్మపదము పొందుము.

*దినయామిన్యౌ సాయం ప్రాతః*

*శిశిరవసంతౌ పునరాయాతః|*

*కాలః క్రీడతి గచ్ఛత్యాయుః* 

*తదపి న ముంచత్యాశా వాయుః* 

పగలు - రాత్రి , సాయంకాలము - ప్రాతఃకాలము , శిశిర ఋతువు - వసంత ఋతువు ఇవన్నీ మళ్ళీ

మళ్ళీ వచ్చును.కాలము ఆటలాడుచున్నది. ఆయుష్షు క్షీణించుచున్నది అయినా ఆశ విడవకున్నది.

*-శృంగేరీ జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు*

కామెంట్‌లు లేవు: