17, మే 2023, బుధవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 62*


.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 62*


చాణక్యుడు ముసిముసిగా నవ్వి ...

"తక్షశిల వదిలిన మేము కాశీ నగరాన్ని చేరినట్లు మీకు తెలుసు కదా ! కాశీ పండిత పరిషత్ లో శ్యామశాస్త్రి అను వృద్ధ పండితుడు మా చేతుల్లో ఓటమి పాలైన పండితుల్లో ఒకడు. ఆయన ఆంధ్రుడు. ఆయన కుమార్తె, అల్లుడు అకాల మరణం చెందారు. వారి కుమార్తె గౌతమి. మాతామహుల సంరక్షణలో వుంటోంది. వారూ మేమూ ఆంధ్రులమే కావడం చేత, వారికి తోడు మరెవరూ లేకపోవడం చేత మా బస వారింట, వారి బలవంతం చేత ఏర్పాటయింది. మా అమ్మగారికి గౌతమి నచ్చడం చేత, ఆవిడ బలవంతం వల్ల గౌతమితో మా వివాహం నిరాడంబరంగా జరిగింది. మాకెటూ ఈ కార్యభారము దేశాలు తిరగవలసిన అవసరం ఉన్నది కదా ! అందుకే గౌతమితో పాటు మా అమ్మగారిని కూడా కాశీలో శ్యామశాస్త్రిగారి సంరక్షణలో ఉంచక తప్పలేదు. కాకపోతే, విశేషమేమిటంటే, మేము కాశీని వదిలి మగధకి ప్రయాణం ప్రారంభించేనాటికి గౌతమికి ముచ్చటగా మూడవ మాసం. రేపో... మాపో మా అమ్మగారికి మనవడో, మనవరాలో జన్మిస్తారు..." అని చెప్పి కొంచెం సిగ్గుపడ్డాడు చాణక్యుడు. 


"శుభాభినందనలు గురుదేవా..." అంటూ మిగతా ఇద్దరు సింహళవాసుల వేషధారులైన చాణక్య శిష్యులు, శార్జారవుడు, సంఘభూతి ఆయనకి తమ ఆనందాన్ని, అభినందనలను తెలియజేశారు. అనంతరం వారు చాణక్యుని సైగననుసరించి అతనికి మరొక మారు నమస్కరించి కర్తవ్య పరాయణులై నిష్క్రమించారు. 


"ఇదంతా నాకు చాలా, వింతగా విచిత్రంగా ఉంది గురుదేవా ! ఆ నలుగురూ తమ శిష్యులని గానీ, తమరి ఆదేశనుసారమే నాకు పాటలీపుత్ర అధికారవర్గంలో స్థానం కల్పించడానికి మాయాసింహం నాటకం ఆడారని నేను వూహించనే లేదు" అన్నాడు చంద్రగుప్తుడు. 


చాణక్యుడు నవ్వి "నీ ఊహకి అందని మరెన్నో వింతలూ విశేషాలు మున్ముందు తెలుసుకుందువు గానిలే..." అని చెప్పి మురాదేవి వైపు సాభిప్రాయంగా చూసి ఇలా చెప్పాడు....


"అమ్మా ! మీ తండ్రిగారు పిప్పలవన ప్రభువు జన్మతః హిందువులై వుండీ, మీ వివాహానంతరం బౌద్ధమతమును స్వీకరించి, మరికొంత కాలం తర్వాత మరల హిందూ మతమును స్వీకరించడాన్ని జీర్ణించుకోలేని కొందరు హిందూమత దూరహంకారులు ఆయనను శూద్రుడని నిందించి, ఆయనకి ప్రాయశ్చిత్తము లేదని ప్రకటించడం మీకు కలిసి వచ్చింది. ఆనాడు ఏకాంత దుర్గము నుండి తప్పించుకున్న మిమ్మల్ని మీ తండ్రిగారు ఆదరించిననూ, ఆయన మతమార్పిడి కారణంగా చంద్రునికి 'వృషలుడనే' నామాంతరం కల్పించడం చేత ఇంతకాలం మీ రహస్యం మీ విరోధులకి తెలియలేదు. చంద్రునికి ఆపదలు సంభవించలేదు. ఇప్పుడు మన శత్రువులందరికీ చంద్రుడు 'చిరంజీవి' అన్న వార్తని నేనే వ్యాపింపజేశాను. ఇక ముందున్నది మన వైరులకు ముసళ్ళ పండగ. నేనూ చంద్రుడూ ప్రయాణమై వివిధ రాజ్యాధీశులను కలిసి సైనిక సహాయాన్ని అర్దిస్తాం. ఈ బృహత్తర కార్యక్రమంలో తమరూ కాస్త సహకరించాలి." 


"ఆజ్ఞాపించండి స్వామీ ! నా ప్రభువు మహానందుల వారికి జరిగిన ద్రోహం గురించి మగధ ప్రజలందరూ తెలుసుకోవాలి. వారికి జరిగిన అన్యాయాన్ని ఈ లోకమంతా ముక్తకంఠంతో ఖండించాలి. ఆనాడు, నా ప్రభువు కన్నీళ్ళతో చేతులు జోడించి నాతో చెప్పిన చివరి సందేశాన్ని... నా ప్రభువు నాకిచ్చిన అంతిమ ఆదేశాన్ని... అంతిమ ఆదేశాన్ని... " అంటుంటే మురాదేవి కంఠం రుద్ధమై దుఃఖం ముంచుకొచ్చింది. ఆవిడ దుఃఖంతో వివశురాలై సన్నగా రోదించసాగింది. 


తల్లి దుఃఖిస్తుంటే తట్టుకోలేని చంద్రుడి వదనం కందగడ్డలా ఎరుపెక్కింది. అతడు ఆవేశంతో పగబట్టిన త్రాచులా బుసలుకొడుతూ... 

"అమ్మా ! పదహారేళ్ళుగా నీ కాన్నీటిని చూస్తూ... భరిస్తూ... నీ కన్నీళ్లను తుడిచే వయస్సూ, అవకాశమూ లేక ఇంతకాలం వ్యర్ధుడిలా జీవించాను. పగతురులు కళ్ళముందే తిరుగుతూ ప్రగల్భాలు పలుకుతుంటే, సందర్భం వచ్చినప్పుడల్లా మా నాన్నగారిని హేళన చేసి మాట్లాడుతుంటే, పౌరుషాన్ని దాచుకుని, నీ మాటకు కట్టుబడి జీవచ్చవంలా బ్రతికాను. ఇహ నీ దుఃఖాన్ని చూడలేను. ఇకనైనా నాకు ఆనతి ఇయ్యమ్మా ... ఇప్పుడే వెళ్లి ఆ నందుల మీదికురికి నా శౌర్య ప్రతాపాలు వాళ్లకి రుచి చూపిస్తాను. మా తండ్రి, మగధ సామ్రాజ్యాధినేత మహానందుల వారి పవిత్ర రక్తమే నాలో ప్రవహిస్తోందని రుజువు చేస్తాను. నాన్నగారి ఆత్మ శాంతి కోసం ఆ నందులతో ముఖాముఖి తలపడి పోరాడి, అవసరమైతే వీరుడిలా మరణిస్తాను. నన్ను ఆదేశించమ్మా" అన్నాడు ఆవేశంతో. 


"అలా చేస్తే మహానందుల వారి ఆత్మ శాంతిస్తుందా చంద్రా..." చాణక్యుని గంభీర కంఠస్వరం పెల్లుబికుతున్న చంద్రుని ఆవేశం పైన నీళ్లు చిలకరించినట్లైంది. అతడు చాలా ఉక్రోశంగా ఆర్యుని వైపు చూసాడు. 


"నువ్వు వ్యర్ధావేశానికి లోనై నందుల మీద దాడి చేసి మూర్ఖంగా చావు తెచ్చుకుంటే నీ తల్లి దుఃఖం తీరుతుందా ? చక్రవర్తికి ఆవిడ ఇచ్చిన మాటకి విలువ ఉంటుందా ?" గంభీరంగా ప్రశ్నించాడు చాణుక్యుడు. 


చంద్రుడు ఆవేదనతో తల్లడిల్లిపోతూ "గురుదేవా...!" అన్నాడు బాధగా. 

(ఇంకా ఉంది)...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

 


యోగసాధన, ఉపాసన మార్గం లో గణపతి అర్చన /మంత్ర సాధన, ప్రవేశద్వారం వంటిది.  గణపతి ఉపాసన చేయనిదే ఇతర దేవతా మంత్ర సాధనలు ఫలించవు.  గణపతి మంత్ర సాధన ఎంత ఎక్కువ చేస్తే అంత సాధకుని శరీరానికి, మనస్సుకు, బుద్ధి కి దైవఆకర్షణ పెరుగుతుంది.  గణపతి తత్వం ప్రధానంగా ఆకర్షణా, వశీకరణ. అందువల్ల ఇతర దేవతా చైతన్యం తొందరగా సిద్ధిస్తుంది. యోగసాధనా /ఉపాసనా మార్గం లో గణపతి తత్త్వం :  1. పెద్ద శిరస్సు (మేధస్సు )- శాస్త్రపరిజ్ఞానం, అవగాహన.2. పెద్ద చెవులు -ప్రతి విషయాన్ని క్షుణ్ణo గా వినడం, అర్ధం చేసుకోవడం.  3. చిన్న నేత్రాలు - స్పష్ట ద్రుష్టి, సునిసిత పరీశీలన.  4.  దీర్ఘ తుండం - దీర్ఘ ఉచ్చ్వాస, నిచ్వాసల ద్వారా, విశ్వావ్యాప్తమైన ప్రాణశక్తిని అధికంగా గ్రహించి శరీరం లో నిలుపుకోవడం ద్వారా ఉపాసనా  మంత్రానికి ప్రాణ చైతన్యం అధికం గాను, శాశ్వతం గాను ప్రాప్తిస్తుంది.  5.( బృహత్ ) పెద్దదైన, ధ్రుఢమైన, ఆరోగ్యావంతమైన శరీరం, - దీర్ఘ కాలం యోగ /ఉపసనా మార్గంలో నిలకడ. 6. బలమైన నాలుగు కాళ్ళు - సాధనలో స్థిరత్వం. 7. మందగమనం - నిదానమైన సాధన. 8.  తుండం చివర అమృతకలశం - ప్రాణ వాయువే అమృత రూపం. దానిని నాసికాగ్రమ్ నుండే గ్రహించాలి. 8.  రక్త వస్త్రం, రక్త వర్ణ శరీరం రజో గుణ తత్త్వం. 9.  రత్న సింహాసనం, రత్న కిరీటం - లోకాధిపత్యం. 10.  ఎలుక వాహనం - సేవాభావంతో మనసా, వాచా, కర్మణా ఆరాధించే సాధకులను జన్మలతో సంబంధం లేకుండా తన దగ్గరే స్థిర నివాసం.


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*


నాన్న అపోహ  (కథ)

 ✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు


“ విరిగిపోయిన ఈ బక్కెట్టు తీసుకెళ్లి పాత సామాన్ల వాడికి ఇచ్చెయ్” అంది అమ్మ  రవికి  ప్లాస్టిక్ బకెట్ అందిస్తూ. తొమ్మిదో తరగతి చదివే రవిలో తెలివి, సృజనాత్మకత శాతం ఎక్కువ. 


 ఆకుపచ్చ రంగున్న బకెట్ మీద రంగు రంగుల్లో పువ్వులున్నాయి. విరిగినదే అయినా సరే అందంగా కనిపిస్తోందది. దాన్ని పాత సామాన్ల  వాడికివ్వడం   రవికి నచ్చలేదు.   కాసేపు ఆలోచించాడు రవి.  వాడికో ఆలోచన వచ్చింది. 


 ఒక కత్తెర తీసుకుని బకెట్ అంచు నుండి విరిగిన భాగం వరకు  క్రమ పద్ధతిలో కత్తిరించి. అడుగున ఒక   రంధ్రం చేసి, మట్టితో నింపాడు. పెరట్లోని  గులాబీ మొక్కల్లో ఒకటి తెచ్చి మట్టిలో  పాతాడు. దాని మీద  నీళ్లు  పోసాడు. ఇప్పుడది పూల కుండీ అయింది. దాన్ని తీసుకెళ్లి ప్రహరీ గేటు ప్రక్కన అలంకరణగా  పట్టేసి  అమ్మకి చూపించాడు.


 “ఇదెప్పుడు కొన్నాము?” అని ఆశ్చర్య పోయిందావిడ.  జరిగింది  అమ్మకి చెప్పాడు రవి. వాడి ఆలోచనకు మెచ్చుకుని,  వాళ్ళ నాన్నతో  చెప్పబోయింది. “చదువుకోవాల్సిన  సమయాన్ని ఇలా  వృధా చేయవద్దు.  చదువుకోమను” అన్నాడు నాన్న.    

 మరొక రోజు వీధిలో అందరికీ కరెంట్ పోయింది. రవి గదిలో మాత్రం విద్యుత్ బల్బు వెలుగు కనబడింది. 


వీధిలో వాళ్లకు రవి వాళ్లింట్లో మాత్రం వెలుగు కనబడడం ఆశ్చర్యమేసింది. 

“మీకు కరెంట్ పోలేదా? లేకపోతే ఇన్ వర్టర్ దా?” అని అడగడానికి వచ్చారు కొందరు.  


రవి అమ్మా నాన్నలు కూడా  ఆశ్చర్యపోయి “మాకూ కరెంట్ పోయింది. ఇన్ వర్టర్  లేదు” అని చెప్పారు.  


“మీ ఇంట్లో  లైట్ వెలుగుతోంది” అని వాళ్లు చెబితే ఆశ్చర్యపోయి లోపలకు వెళ్లారు.  అక్కడ విద్యుత్ వెలుగులో చదువుకుంటూ కనబడ్డాడు రవి. 

“ఇదెలా సాధ్యం?” అని అడిగారు రవిని.

“ పనిచెయ్యని కారు బ్యాటరీలను ఒక అంకుల్ పారెయ్యబోతుంటే అడిగి తీసుకున్నాను. మనింట్లో కరెంట్ రిపేరు చేసినప్పుడు మిగిలిపోయిన రాగి వైర్లు   నా దగ్గర దాచాను. ఆ పాత బ్యాటరీలో మెగ్నీషియం సల్ఫేట్ (ఎప్సమ్ సాల్ట్), కాస్టిక్ సోడా ,  పరిశ్రమల్లో  ఉపయోగించే స్ఫటికాకార ఆమ్లం ఉపయోగించి ఛార్జింగ్ చేశాను.  దానికి  కొత్త జీవితం వచ్చింది. ఇన్ వర్టర్ లాగా పనిచేసి వెలుగు ఇస్తోంది” అన్నాడు రవి. 


వీధిలో వాళ్లంతా రవి తెలివిని అభినందించి వెళ్ళిపోగా, నాన్న మాత్రం ఇలాంటి వాటికి సమయం వృధా చేస్తున్నాడని గొణుక్కున్నాడు. 


 ఒకరోజు సాయంత్రం బడి నుండి వచ్చిన రవితో ‘దోమతెర  చినిగిపోయిందని,  కొత్త దోమతెర  కట్టడానికి సాయం  రమ్మని’  పిలిచింది వాళ్ళమ్మ.  పాత   దోమతెరలో  కొన్నిచోట్ల  రంధ్రాలు పెద్దవయ్యాయి. పనయ్యాక  పాత తెరని  బయట పడెయ్యమంది. 


దాన్ని చూసిన  రవి  మనసులో బయట పారేయడం కంటే  వడియాలు, పిండి, నువ్వులు  ఆరబోసేటప్పుడు  పక్షులు ఎత్తుకు పోకుండా  వల లాగా  వాడాలన్న ఆలోచన కలిగింది.  ఆ మాటే వాళ్ళమ్మకి చెప్పగా  భలే ఆలోచన అంటూ మెచ్చుకుంది ఆమె.   


సరిగా అప్పుడే వాళ్ళ నాన్న ఇంట్లోకి వస్తూ ఆ మాటల్ని  విన్నాడు.  “ అదే పనిగా మెచ్చుకుని వాడిని పాడు చెయ్యకు” అని కసిరాడు. 


రవి  మీద వాళ్ళ నాన్నకి ప్రేమ ఉంది. ఇలాంటి పనులతో చదువుకి ఆటంకం వస్తుందని  భయపడుతుంటాడు.  తరగతి  పుస్తకాలు చదవాలి తప్ప ఇలాంటి  పనులు చేయొద్దంటాడు. ఏదైనా కొత్తగా  ఆలోచించి రవి చెప్పగానే వాటిని  మొగ్గలోనే తుంచి పారేసేవాడాయన. కొడుకుని ప్రోత్సహించాలని ఉన్నప్పటికీ భర్తకి ఎదురు చెప్పలేక పోయేది వాళ్ళమ్మ. 


ఒక  రోజు ఉదయం  కూరగాయలు కోసం  వెళ్లిన రవి నాన్నకి సైన్సు మాస్టారు కనిపించారు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. రవి తెలివిని , సృజనాత్మకతని     మెచ్చుకున్నారు మాస్టారు. 

  రవి నాన్న  సంతోషించలేదు సరికదా   “నాకూ అదే  భయం. వేరే ఆలోచనల్లో పడిపోయి  చదువుని  నిర్లక్ష్యం చేస్తాడేమోనని ” అన్నాడు.    


“ అందులో భయపడాల్సిందేముంది?   వాళ్ల కొచ్చే  ఆలోచనలను స్వాగతించాలి.  రవిలా సృజనాత్మకత  ఉన్నవాళ్లు మాత్రమే దేన్నైనా   కొత్త కోణంలో చూస్తారు.  బడిలో పిల్లలకు వచ్చే కొత్త  ఆలోచనలను మేం స్వాగతిస్తుంటాం.  వాటిని నూతన ఆవిష్కరణలుగా మార్చడానికి ప్రయత్నిస్తుంటాము. విజ్ఞాన ప్రదర్శనలప్పుడు ప్రదర్శిస్తుంటాం”  అన్నారు మాష్టారు. 


రవి ఇంట్లో చేసిన  పనుల గురించి  మాష్టారికి చెప్పి “వీటివల్ల ఏం ప్రయోజనం ఉంది?” అనడిగాడు   రవి నాన్న. 


మాష్టారు “ఎన్నో ఏళ్ళు పిండి విసిరిన తిరగలి అరిగిపోతే కొందరు పారేస్తారు. మరికొందరు గార్డెన్లో మెట్టుగా వాడతారు. టీ  కప్పు పగిలితే  కొందరు పారేస్తారు. మరికొందరు బడ్ వేజ్ గా వాడతారు . ఇందులో డబ్బు  ఎంత మిగిలిందన్నది ప్రశ్న కాదు. కొత్త రూపంలో పాత వస్తువుని చూసినప్పుడు కలిగే  మానసిక ఆనందం  వేరు. అందులో  ఉన్న కొత్త కోణాన్ని. సృజనాత్మకతను చూస్తే  ఆ పని ఎంతో గొప్పదని తప్పక అర్ధమవుతుంది.  రవిలో చురుకైన బుద్ధి ఉంది.  తెలివిగా, వేగంగా  ఆలోచిస్తాడు. అందువల్ల చదువుల్లో కూడా ముందుంటాడు  తప్ప నష్టం జరగదు” అన్నారు  నమ్మకంగా. 


 రవి నాన్నకి అంతవరకూ ఉన్న  అపోహలన్నీ తొలగిపోయాయి.  రవిని చదువుకే పరిమితం చేయకుండా మిగతా విషయాల్లో కూడా  ప్రోత్సహించాడు. తన మీద అమ్మానాన్నలకు ఉన్న   నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు రవి.  

—---*******-----

సేకరణ:- కన్యాకుమారి వాట్సాప్ పోస్ట్. 

🌹

శుభోదయం. సర్వే జనాః సుఖినోభవంతు.     ఉపాసన :  మంత్ర సాధన చెయ్యాలి అనుకునేవారు ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనకు మంత్రోపదేశం చేసే గురువు కి ఆ మంత్ర సాధనకి సంబంధించిన గురు పరంపర ఉండాలి. అంటే తనకు మంత్రోపదేశం  చేసే స్వ గురువు, ఆ గురువుకి గురువు పరమ గురువు , ఆ గురువుకి గురువు పరమేష్టి  గురువుల  యొక్క( దీక్షా నామం. Etc ) వివరాలు తెలియాలి. గురుత్రయం ఉపదేశం తో ప్రారంభించి, ఉపసక మంత్రం యొక్క ఋషి /చంధస్సు /అధిష్టానా దేవత /బీజం /శక్తి /కీలకం /వినియోగం /ధ్యాన శ్లోకం ఉపదేశం చెయ్యాలి. ధ్యాన శ్లోకం ఉపాసక దేవత యొక్క సగుణ రూప వర్ణన. ఉపాసకుని సంకల్పం నెరవేరాలంటే దేవత, ధ్యానశ్లోకం లో వర్ణించినట్టు గానే అనుగ్రహిస్తుంది. గురువు ఉపదేశించిన ధ్యాన శ్లోకమే అనుష్టానం చెయ్యాలి. ఉపదేశం చేసే మంత్రాలకు సంస్కార మంత్రాలు కూడా చెప్పబడ్డాయి. అనేక విధాలైన దోష నివారణా / మంత్ర చైతన్య /శాప విమోచన (ఉపాసనలో శాప విమోచన అంటే శపించడం కాదు. ఇది మంత్ర వినియోగానికి ఒక password/pin లాంటిది.)/ఉజ్జీవన /ఉద్దీపాన /ప్రాణ యోగ /ముఖ శోధన /కుళ్ళుక /మంత్ర సేతు /మహాసేతు లాంటి మంత్రాలను గురువు ఉపదేశ పూర్వకం గా చెప్పాలి. (ఆ గురువు ఇవన్నీ చేసివుండాలి ). ఉపదేశం, ఆ దేవతా గుడి /మందిరం /క్షేత్రాలలో జరగాలి. గురువుకి ఆ మంత్రానికి సంబంధించిన పూర్ణ జ్ఞానం ఉండాలి. అన్నింటికంటే ముందు ఉపదేశం చేయడానికి ఆయన స్వగురువు అనుజ్ఞ ఉండాలి. ఉపదేశం తో పాటు ఆ గురు పరంపర /సాధన కి సంబంధించిన ఆచారాలు, నియమాలు చెప్పి పాటించేలా చెయ్యాలి. ఉపసకునికి మంత్రార్వణం (ధన, సుసిద్ధ /సిద్ధ Etc.,)తప్పక  చూడాలి. సాధనా కాలం గురువు పర్యవేక్షణ ఉండాలి. పై విధమైన అంశాలు పరిగణలోకి తీసుకోకుండా మంత్రసాధన చేస్తే అది ఫలించదు. గురూపదేశం లేని విద్య అసుర విద్య గా విపరీత సంకల్పాలకు,స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించాలనే ప్రమాదకరమైన ఆలోచనలు వచ్చి బ్రష్టుపట్టిపోతారు.కర్త, కారాయితా చైవ, ప్రేరకశ్చ, అనుమోదాకహా అన్నట్టు మంచైనా,చెడైనా ఎవరి వాటా వాళ్లకి వస్తుంది.T. V లో, ఇతర  చానాల్స్ లో సమయం, సందర్భం లేకుండా మంత్రో పదేశాల  విషయం లో ఉపదేశం చేసే గురువులు, సాధన చేసే శిష్యులు తస్మాత్ జాగ్రత్త. శుభం భూయత్ .


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*



          *అన్నదాతా సుఖీభవ...!!*

                  ➖➖➖✍️


*పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు.* 


*వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు.*


*అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు.*


*ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. "ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, “స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును” అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది.*


*'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట!’ అంటూ వెనుదిరిగాడు.* 


*అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు. *


*లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి’ అని తొందర పెట్టాడు.*


*అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది'* 


*’ఇదేనా ఆ గొప్ప ఉపకారం?’ అన్నాడు ధనికుడు అసహనంగా.* 


*సన్యాసి అతనికొక సూది ఇచ్చి 'ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు!’ అన్నాడు.*


*ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు.* 


*ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా?’ అని ప్రశ్నించాడు.*


*ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు.*


*ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని.* 


*ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు.*


*’నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి’ అని అతడికి చెప్పాడు.* 


*ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు.*


*సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.*


*గుమాస్తా చదవడం ప్రారంభించాడు...*


*1వ వాడు:*

*’ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!’*


*2వ వాడు:*

*’ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా.’*


 *3వవాడు: *

*’అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?’* 


*అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. ‘చాలు చాలు చదవకు..’ అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు.*


*’స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది..’ అంటూ వాపోయారు.*


*సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు.* 


*ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు.*


*మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు.*


*మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.*


*1వ వాడు:*

*’అన్నదాతా సుఖీభవ!’*


*2వ వాడు:*

*’ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.’*


*3వ వాడు: *

*అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.*


*దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు.*


*కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఈనాడు లభించింది.*


*అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కామెంట్‌లు లేవు: