10, జులై 2024, బుధవారం

ప్రసాదం కూడా ప్రత్యేకమే

 🙏☘️🙏☘️🙏

పూరి జగన్నాథుని ప్రసాదం కూడా ప్రత్యేకమే

☘️☘️☘️☘️☘️

పూరీ జగన్నాథుని ఆలయం అనగానే ఆషాఢమాసంలో జరిగే రథయాత్రే గుర్తుకువస్తుంది. ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్రగా ఈ ఉత్సవాన్ని పేర్కొంటారు. ఈ రథయాత్రలో పాల్గొంటే జన్మధన్యమైపోతుందని భక్తులు నమ్ముతారు. రథయాత్రతో పాటు పూరీ ఆలయానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. వాటిలో ఒకటే %-% మహాప్రసాదం!పూరీ జగన్నాథునికి ఆరుదఫాలుగా నైవేద్యాన్ని అందిస్తారు. ఇందుకోసం 56 రకాల పదార్థాలని తయారుచేస్తారు. హిందీలో 56ని ఛప్పన్ అంటాం కాబట్టి ఈ మహాప్రసాదాన్ని ఛప్పన్ భోగ్గా పేర్కొంటారు. ఈ 56 సంఖ్య వెనుక రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకప్పుడు అఖండ భారతదేశంలో 56 స్వతంత్ర రాజ్యాలు ఉండేవి. ఆ రాజ్యాలన్నీ క్షేమంగా ఉండాలనే ఆలోచనతో రాజ్యానికి ఒక ప్రసాదం చొప్పున 56 ప్రసాదాలను నివేదించి ఉండవచ్చు. మరో ఊహ ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరినిఏడురోజుల పాటు తన చిటికెనవేలు మీద నిలిపి ఉంచాడట. ఆ ఏడురోజుల పాటు ఆయన అన్నపానీయాలనూ ముట్టలేదు. అందుకని ఎనిమిదవ రోజున భక్తుల వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారట. ఆనాడు కృష్ణునికి 56 పదార్థాలను అందించారు కాబట్టి... పూరీ జగన్నాథునికి అదే రీతిలో ఉపచారం జరుగుతోందని ఓ నమ్మకం.జగన్నాథునికి నిత్యం 56 ప్రసాదాలను అందించాలంటే, అక్కడి వంటశాల కూడా ప్రత్యేకంగా ఉ ండాల్సిందే కదా! అందుకే 30కి పైగా గదులతో, 600 మందికి పైగా వంటవారితో... ప్రపంచంలోనే

అతిపెద్ద వంటశాలగా పూరీ పేరుగాంచింది. వందలు, వేలు కాదు- రోజుకి లక్షమంది భక్తులకు సరిపడా ఆహారాన్ని ఇక్కడ సిద్ధం చేయగలరు. ప్రసాదాన్ని వండేందుకు మట్టికుండలనే పాత్రలుగా వినియోగించడం, వాటిని కట్టెల మీదే వండటం మరో ప్రత్యేకత. అలా వండిన పదార్థాలని ముందుగా జగన్నాథునికి నివేదిస్తారు. ఆ తర్వాత క్షేత్రపాలకురాలైన విమలాదేవికి నివేదిస్తారు. అటు తర్వాత వాటిని భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ఆలయానికి ఈశాన్యంలో ఉండే 'ఆనంద బజార్' అనే ప్రదేశంలోభక్తులకు ఈ ప్రసాదాలను అందిస్తారు.పూరీలో ఇలా 56 ప్రసాదాలను నివేదించే ఆచారం ఎప్పటినుంచి మొదలైందో తెలియదు కానీ... దానికి విశేష ప్రచారాన్ని తీసుకువచ్చింది మాత్రం ఆదిశంకరులని చెబుతారు. ఆలయంలో నివేదించిన పదార్థాలతో భక్తుల కడుపు కూడా నిండాలనే తలపుతో ఆయన మధ్యాహ్నం వేళ 'ఛత్ర భోగ్' అనే ఆచారాన్ని ఆరంభించారట. అప్పటి నుంచి ఈ ప్రసాదాలు కేవలం ఆలయానికి వచ్చే భక్తులకే కాదు, పూరీ చుట్టుపక్కల పేదలకి కూడా ఆకలి తీరుస్తున్నాయి. స్వామివారి ప్రసాదాన్ని తింటున్నామనే తృప్తినీ అందిస్తున్నాయి. అంతదాకా ఎందుకు? పూరీ నగరంలో ఎవరన్నా పేదవాడి ఇంట్లో ఏదన్నా వేడుక జరిగిందనుకోండి... అతిథులకి విందుభోజనాన్ని అందించేందుకు నేరుగా పూరీ ఆలయానికి చేరుకుంటారట.మహాప్రసాదం గురించి ఇంత విన్నాక, ఇందులో ఏఏ పదార్థాలు ఉంటాయో తెలుసుకోవాలని అనిపించక మానదు. పాయసం, పరమాన్నం, కిచిడీ, పాలకూర, కొబ్బరి లడ్డూ, కోవా లాంటి రకరకాల పదార్థాలు ఎలాగూ ఉంటాయి. వీటితో పాటుగా ఒడిషాసంప్రదాయ వంటకాలూ కనిపిస్తాయి. మరో విశేషం ఏమిటంటే... ఈ పదార్థాలను భగవంతునికి నివేదించేంతవరకూ ఎలాంటి వాసనా రాదట. కానీ ఆ జగన్నాథునికి నివేదించిన వెంటనే... అన్ని పదార్థాల నుంచి ఘుమఘుమలాడే సువాసనలు వెదజల్లుతాయట.ఇవీ జగన్నాథుని మహాప్రసాదానికి సంబంధించిన విశేషాలు. అయితే ఏడాదిపొడవునా ఇవి భక్తులకు అందుబాటులో ఉంటాయనుకోవడానికి లేదు! రథయాత్రకి ముందు ఓ 21 రోజుల పాటు మహాప్రసాదాలు చేయరు. ఆ సమయంలో జగన్నాథునికి జ్వరంగా ఉంటుందని భక్తుల నమ్మకం. మిగిలిన సమయంలో ఆలయానికి చేరుకునే భక్తులు అటు జగన్నాథుని దర్శించి, ఇటు ఆయన ప్రసాదాన్ని ఆరగించి తృప్తిగా ఇళ్లకు చేరుకుంటారు.

🙏☘️🙏☘️🙏

కామెంట్‌లు లేవు: