11, ఆగస్టు 2024, ఆదివారం

భాస్కరాచార్యుడు

 భాస్కరాచార్యుడు…….  సనాతన భారతదేశం కన్న గణిత శాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు. ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణితసూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి. చిక్కుముడి గణిత సమస్య లను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు. పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత, గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు.

భాస్కరులు సా.శ. 1114 సంవత్సరంలో మహారాష్ట్ర లోని విజ్జదిత్ (విజ్జలబిడ)(విజయపురం) అనే గ్రామంలో జన్మించాడు. భాస్కరుడు బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు. మహేశ్వరుని తనయుడు, మనోరధుడి మనుమడున్ను. ఇతని గ్రంథాల్లో ఎక్కువగా వైష్ణవపరంగా ప్రార్థనునులుండవల్లనైతేనేం, ఆచార్యశబ్దం నామాంతంఉండడంవల్ల నైతేనేం కొందరీతడు వైష్ణవుడన్నారు. కానీ ఆచార్యశబ్దం కేవలం ఆతని పాండిత్యము లోని ఉత్కృష్ణతను తెలియజేసేదే ఐ ఉంటుంది. చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశోధనలు ప్రారంభించాడు. వీరు ప్రపంచప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది.

అదేమంటే భాస్కరులు జ్యోతిష్యంలో మంచి దిట్ట. ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే పద్ధతి ఏమిటంటే కుండలలో ఇసుక, నీళ్ళు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు క్రిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను, శుభాశుభాలను లెక్కించేవాడు. ఇలానే ఒకసారి తన కుమార్తె (పేరు లీలావతి) పెళ్ళి కొరకు ముహూర్తం నిర్ణయించాడు. తన కుమార్తె జాతకంలో వైధవ్యం ఉన్నదని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు. కాని భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది. ముహూర్త నిర్ణయానికి ముందు లీలావతి ఒక రోజు ఆడుకుంటూండగా తన ముక్కుపుడక లోని ముత్యం ఆ కుండలలోని పై కుండలో జారవిడుచుకొంది. ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటిచుక్కల లెక్క, పడు సమయం మారింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్ళైన సంవత్సరం లోనే భర్త చనిపోయాడు. ఈ దుఃఖం భరించలేక పోయిన భాస్కరులు తను, లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేసాడు. ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు, సిద్దాంతాలు కనుగొని ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. తన కుమార్తెకు కూడా పేరుతెచ్చి పెట్టాడు.

కామెంట్‌లు లేవు: