6, జనవరి 2025, సోమవారం

న్యాయస్థానములెప్పుడు

 ఓం శ్రీ మాత్రేనమః

ఓం శ్రీ గురుభ్యోనమః

05-01-25

న్యాయ - నైపుణి

డా.రఘుపతి శాస్త్రుల(41)


న్యాయస్థానములెప్పుడు

న్యాయాన్యాయపు విచక్షణైక సుబుద్ధిన్

సాయము చేసెడు విధముల

శ్రేయమొసగ మాతృభాష సేవింపనగున్


మాతృభాషలో తీర్పు సమంచితముగ

తెలియ జేసిన బాధితుల్ తృప్తిగనుచు

వాస్తవమ్ముల గ్రహియించి వర్ధిలుదురు

మాటలాడెడు భాషదౌ మహిమ దెలియు

(సమంచితము=పూజింప తగినది)


చెప్పెడు భాషకున్ తగు విశిష్టత గూర్చిన జాలు వాస్తవ

మ్మెప్పుడు గాంచ నౌను జనముల్ తగు వృద్ధిని గాంచు రీతులే

మెప్పును పొంద గల్గును సమీక్షలు జేయగ గల్గు భాగ్యమున్

చొప్పడు గాన ధర్మ విధి శోధన జేసి వచింపగా తగున్

(సమీక్ష=అవగాహన)


మాతృభాషకు సాటి యీ మహినిలేదు

తల్లిదండ్రుల మించిన దైవ శక్తి

గాంచగా లేము భువిలోన నెంచగలుగ

విలువల తెలిసి మసలిన ప్రియమొసంగు

కామెంట్‌లు లేవు: